Telugu Global
Andhra Pradesh

ఎంపీలు అసెంబ్లీ వైపు చూస్తున్నారా?

అధికార పార్టీకి చెందిన కొంత మంది ఎంపీలు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాడానికి ఆస‌క్తి చూపుతున్నారు. వారు ఎవ‌రంటే ఎంవీవీ సత్యనారాయణ, చింతా అనూరాధ, వంగా గీత, మార్గాని భరత్, లావు శ్రీకృష్ణదేవరాయలు, ఆదాల ప్రభాకరరెడ్డి, గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య.

ఎంపీలు అసెంబ్లీ వైపు చూస్తున్నారా?
X

అధికార పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీల్లోని కొందరు వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. వీరిలో కొందరు తమంతట తాముగా అసెంబ్లీకి పోటీ చేయాలని ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మరికొందరికి జగన్మోహన్ రెడ్డే చెబుతున్నట్లుగా పార్టీలో టాక్ నడుస్తోంది. వీరిలో రాయలసీమలో ఇద్దరు, ఉత్తరాంధ్రలో ఒకరు, కోస్తా, ఉభయగోదావరి జిల్లాలకు చెందిన ఎంపీలున్నారట. ఇంతకీ ఆ ఎనిమిది మంది ఎంపీలెవరంటే ఎంవీవీ సత్యనారాయణ, చింతా అనూరాధ, వంగా గీత, మార్గాని భరత్, లావు శ్రీకృష్ణదేవరాయలు, ఆదాల ప్రభాకరరెడ్డి, గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య.

విశాఖనగరంలోని తూర్పు నియోజకవర్గం నుండి ఎంపీ ఎంవీవీని పోటీ చేయించాలని జగన్ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇక్కడి నుండి టీడీపీ తరపున హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న వెలగపూడి రామకృష్ణబాబు చాలా పవర్ ఫుల్. వెలగపూడిని ఓడించేందుకు ఎంవీవీ అయితే బాగుంటుందని పార్టీ అధిష్టానం డిసైడ్ అయినట్లు సమాచారం. ఇక కాకినాడ నుండి ఎంపీగా ఉన్న వంగా గీత రాబోయే ఎన్నికల్లో పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేయటానికి బాగా ఆసక్తి చూపుతున్నారట. ఇదే విషయాన్ని జగన్‌తో చెప్పారని తెలుస్తోంది.

అలాగే అమలాపురం ఎంపీ చింతా అనూరాధ వచ్చేఎన్నికల్లో అమలాపురం నుండి లేదా పీ గన్నవరం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. రాజమండ్రి ఎంపీ భరత్ వచ్చేఎన్నికల్లో రాజమండ్రి అర్బన్ నుండి పోటీ చేయచ్చంటున్నారు. గడపగడపకు కార్యక్రమాన్ని రాజమండ్రి అర్బన్‌లో భరతే చూసుకుంటున్నారు. నరసరావుపేట ఎంపీ లావును వచ్చే ఎన్నికల్లో గుంటూరు నుండి పోటీ చేయించాలని జగన్ అనుకుంటున్నారట. గుంటూరు నుండి బలమైన అభ్యర్ధిని రంగంలోకి దింపాలన్న ఆలోచనతోనే లావుకు ఈ విషయం చెప్పినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.

హిందుపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ను వచ్చే ఎన్నికల్లో కర్నూలు జిల్లాలోని పత్తికొండ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయించే ఆలోచనలో ఉన్నారట. పత్తికొండకే చెందిన గోరంట్లను ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తే సరిపోతుందని జగన్ అనుకున్నారట. ఇక అనంతపురం ఎంపీ తలారి రంగయ్య కల్యాణదుర్గం లేదా గుంతకల్ నుండి అసెంబ్లీ బరిలోకి దిగాలని ట్రై చేస్తున్నారట. చివరగా నెల్లూరు ఎంపీ ఆదాల వచ్చే ఎన్నికల్లో నెల్లూరు సిటీ లేదా కావలి నుండి పోటీ చేయటానికి ఆసక్తి చూపుతున్నారట. ప్రస్తుత రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి నెల్లూరు లోక్ సభకు పోటీ చేసే అవ‌కాశం లేక‌పోలేదు.

First Published:  12 Dec 2022 6:27 AM GMT
Next Story