Telugu Global
Andhra Pradesh

ప్రజాస్వామ్యానికి చంద్రబాబు శని.. - విజయసాయిరెడ్డి ట్వీట్

ఎక్కడో పక్క రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికను ఆధారంగా చేసుకొని తమ నాయకుడిని విమర్శించడం ఏమిటని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు

ప్రజాస్వామ్యానికి చంద్రబాబు శని.. - విజయసాయిరెడ్డి ట్వీట్
X

మునుగోడు ఉప ఎన్నిక తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు, మీడియా ఫోకస్ మునుగోడు మీద పడింది. డబ్బు, మద్యం ఈ నియోజకవర్గంలో ఏరులై పారాయి. టీఆర్ఎస్, బీజేపీ పోటీ పడి ఇక్కడ డబ్బు ఖర్చుపెట్టాయన్న టాక్ వినిపించింది. ఓటర్లకు ఓ పార్టీ రూ. 5000, మరో పార్టీ రూ. 4000 చొప్పున‌ పంచిందని వార్తలు వచ్చాయి. చివరకు ఇక్కడ టీఆర్ఎస్ 10 వేల మెజార్టీతో గెలుపొందింది.

ఇదిలా ఉంటే.. మునుగోడు ఉప ఎన్నికలో డబ్బు, మద్యం కీలక పాత్ర పోషించాయని చర్చ జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఓ ఆసక్తికరమైన ట్వీట్ పోస్ట్ చేశారు. ఓటర్ల కొనుగోలుకు ఆద్యం పోసింది చంద్రబాబు నాయుడేనని ఆరోపించారు. 1996లోనే 500 నోట్లను వెదజల్లి ప్రజాస్వామ్యానికి శనిలా దాపురించాడు చంద్రం అంటూ ట్వీట్ చేశారు.

అంతేకాదు నంద్యాల ఉపఎన్నికలో ఓటుకు రూ.5 వేలు సమస్యే కాదని ప్రకటించి, పంపిణీ చేశాడని ఆరోపించారు. ఇప్పుడు రాజకీయాల్లో అదే బెంచ్ మార్క్ అయింది అని విమర్శించారు. డబ్బు కొట్టు-ఓటు పట్టు నినాదానికి ఆద్యుడు చంద్రం అంటూ విజయసాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం విజయసాయిరెడ్డి పెట్టిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

ఎక్కడో పక్క రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికను ఆధారంగా చేసుకొని తమ నాయకుడిని విమర్శించడం ఏమిటని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. కాగా ఓటుకు నోటు అనే విధానం తీసుకొచ్చింది.. నిజంగా చంద్రబాబు నాయుడే కదా.. ఉన్నమాటంటే అంత ఉలుకెందుకు అంటూ వైసీపీ కార్యకర్తలు కౌంటర్లు ఇస్తున్నారు. మొత్తంగా మునుగోడు ఉప ఎన్నికలో డబ్బు, మద్యం ఏరులై పారితే చంద్రబాబు మీద విమర్శలు రావడం గమనార్హం.

First Published:  7 Nov 2022 8:06 AM GMT
Next Story