Telugu Global
Andhra Pradesh

జాగ్రత్త.. ఉనికే కోల్పోతారు.. ప్రతిపక్షానికి విజయసాయిరెడ్డి హెచ్చరిక

టీవీ ఛానళ్లు, పత్రికలే కాకుండా ఓటీటీలను కూడా వాడుకొని ప్రతిపక్షం రాజకీయాలు చేస్తోందని.. అలా చేసి చివరికి ఎన్నికల్లో ఓడిపోవడం కాదు.. కదా..ఉనికి కూడా కోల్పోతారని విజయసాయి రెడ్డి హెచ్చరించారు.

జాగ్రత్త.. ఉనికే కోల్పోతారు.. ప్రతిపక్షానికి విజయసాయిరెడ్డి హెచ్చరిక
X

ఈ మధ్య ఏపీలో ప్రతిపక్ష పార్టీ టీడీపీ రాజకీయం విచిత్రంగా మారింది. గత ఎన్నికలు ముగిసి వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 'అనుభవించండి' వైసీపీకి ఓటేశారు కదా.. అని టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ప్రజలకు శాపనార్థాలు పెట్టారు. ఇప్పుడు కూడా మరొకసారి వైసీపీకి ఓటు వేస్తే మళ్లీ అనుభవించక తప్పదని ప్రచారం చేస్తున్నారు.

అంతేకాదు రెండు పత్రికలను అడ్డం పెట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాయిస్తున్నారు. కొన్ని మీడియా ఛానళ్లు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేస్తున్నాయి. చివరికి కొత్తగా పుట్టుకు వచ్చిన ఓటీటీ సంస్థలను కూడా టీడీపీ వదలడం లేదు. ఆహాలో ప్రసారమ‌య్యే అన్ స్టాపబుల్ షోను కూడా తన రాజకీయాలకు చంద్రబాబు, లోకేష్ వాడుకున్నారు. ఓ ఎపిసోడ్ కు తండ్రి, కొడుకు హాజరై 'వెన్నుపోటు' విషయమై తమ వెర్షన్ ని తమకు అనుకూలంగా మలచుకుని ప్రజలకు వివరించారు.


అలాగే మరొక ఎపిసోడ్ కోసం అదే షోకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను పంపారు. ఈ నేపథ్యంలో టీడీపీ చేస్తున్న రాజకీయాలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. ప్రతిపక్షాలు అన్న తర్వాత ప్రజలను కూడగట్టుకొని, వారి మద్దతు తీసుకొని, ప్రభుత్వాలు ఏవైనా తప్పు చేస్తే ఉద్యమాలు, యుద్ధాలు చేస్తాయి.. కానీ రాష్ట్రంలో మాత్రం మీడియాను నమ్ముకొని ప్రతిపక్షం ప్రభుత్వంపై యుద్ధం చేస్తోందని ఎద్దేవా చేశారు.

టీవీ ఛానళ్లు, పత్రికలే కాకుండా ఓటీటీలను కూడా వాడుకొని ప్రతిపక్షం రాజకీయాలు చేస్తోందని.. అలా చేసి చివరికి ఎన్నికల్లో ఓడిపోవడం కాదు.. కదా..ఉనికి కూడా కోల్పోతారని విజయసాయి రెడ్డి హెచ్చరించారు. 'ప్రజలను కూడగట్టుకుని వారి మద్దతుతో జరగాల్సిన యుద్ధాన్ని టీవీ స్టూడియోలు, ఓటీటీ ప్లాట్ ఫాంలు, పత్రికల అక్షరాలతో చేయాలని చూస్తోంది ప్రధాన ప్రతిపక్ష పార్టీ. ప్రత్యర్థితో ముఖాముఖి కాకుండా మదిలో ఊహించుకుని నీడలతో చేసే పోరులో ఓటమి మాట దేవుడెరుగు, ఉనికినే కోల్పోతుంది' అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

First Published:  17 Feb 2023 12:32 PM GMT
Next Story