Telugu Global
Andhra Pradesh

'పోలవరం గట్లపై గడ్డి కూడా పీకలేదు.. మరో ఛాన్సిస్తే పూర్తి చేస్తాడట చంద్రం'

భద్రాచలంలో కరకట్టను కట్టింది నా హయాంలోనే అని చెప్పుకొచ్చారు. సీఎం వైఎస్ జగన్ తప్పుకొని తనను సీఎం కుర్చీలో కూర్చోబెడితే పోలవరాన్ని పూర్తి చేస్తానని ప్రగల్భాలు పలికారు. దీనిపైనే ఎంపీ సాయిరెడ్డి విమర్శలు చేశారు.

పోలవరం గట్లపై గడ్డి కూడా పీకలేదు.. మరో ఛాన్సిస్తే పూర్తి చేస్తాడట చంద్రం
X

చంద్రబాబు మాట్లాడే ప్రతీ అబద్దపు మాట, వేసే ప్రతీ తప్పటడుగును వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తప్ప ఎవరూ విమర్శించలేరు. చంద్రబాబు చేసే ప్రతీ రాజకీయ విమర్శను ఏకి పారేయడంలో సాయిరెడ్డి ఎప్పుడూ ముందుంటారు. ఇటీవల గోదావరి వరద బాధితులను ప్రతిపక్ష నేత చంద్రబాబు పరామర్శించారు. భద్రాచలంలో కరకట్టను కట్టింది నా హయాంలోనే అని చెప్పుకొచ్చారు. సీఎం వైఎస్ జగన్ తప్పుకొని తనను సీఎం కుర్చీలో కూర్చోబెడితే పోలవరాన్ని పూర్తి చేస్తానని ప్రగల్భాలు పలికారు. దీనిపైనే ఎంపీ సాయిరెడ్డి విమర్శలు చేశారు.

చంద్రబాబుకు ఇచ్చిన ఛాన్సులు చాలవా? మరో ఛాన్స్ కావాలని ఎలా అడుగుతారని దుయ్యబట్టారు. ఆదివారం ట్విట్టర్ వేదికగా చంద్రబాబును టార్గెట్ చేసుకొని సాయిరెడ్డి ఘాటుగా విమర్శించారు. ''మరో ఛాన్సిస్తే పోలవరం పూర్తి చేస్తాడట మా చంద్రం అన్నయ్య! 14 ఏళ్లు సీఎంగా ఉండి పోలవరం గట్లపై గడ్డి కూడా పీకలేకపోయాం కదా బాబన్నయ్యా. ప్రతి సోమవారం పోలవరం టూర్లువేసి కోట్లు కొల్లగొట్టావు. మంగళవారం మాటలు ఆపేసి ముందు కందిపప్పు, కిరోసిన్ ఎలా కొలుస్తారో తెలుసుకో!కుటుంబపరువు పోతుంది'' అని సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

కాగా ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. చంద్రబాబు ప్రతీ సారి మరోసారి ఛాన్స్ అని అడుగుతున్నారని.. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, తన తప్పులను ఒప్పుకోకుండా.. మళ్లీ పదవి కోసం వెంపర్లాడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. జగన్‌ను ఎదుర్కోలేకే పవన్, బీజేపీ పొత్తుల కోసం చంద్రబాబు ఎదురు చూస్తూ.. గోదావరి వరద బాధితుల వద్ద బురద రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు.

అయితే, భద్రాచలం కరకట్టను టీడీపీ హయాంలోనే కట్టారు. అయితే అది మాత్రం చెప్పుకుంటే సరిపోయేది. కానీ రాష్ట్రం విడిపోయాక అనుభవజ్ఞుడు అని చంద్రబాబుకే పట్టం కడితే.. ఆ ఐదేళ్లు పోలవరం దగ్గరకు టూరిస్టులను పంపి.. భజనలు చేయించుకొని అభాసుపాలయ్యారు. పోలవరం దగ్గర పాడిన భజన పాట ఏకంగా చంద్రబాబు పదవికే ఎసరు తెచ్చిందని ఆయనకు గుర్తు లేకపోవడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పైగా ఇప్పుడు మరో ఛాన్స్ అని వ్యాఖ్యానించడంతో ప్రజలు నవ్వుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

First Published:  31 July 2022 11:13 AM GMT
Next Story