Telugu Global
Andhra Pradesh

కలుద్దాం అంటే ఢిల్లీకి రమ్మని కాదు.. బాబుపై విజయసాయి ఫైర్..!

తాజాగా విజయ‌సాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా టీడీపీపై మరో సెటైర్ వేశారు. 'మిలెంగే అని అన్నారో లేదో చంద్రబాబు మళ్లీ తనకు పాత రోజులు వచ్చినట్టే కలలు కంటున్నాడు.

కలుద్దాం అంటే ఢిల్లీకి రమ్మని కాదు.. బాబుపై విజయసాయి ఫైర్..!
X

ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీలకు చెందిన నాయకులను కేంద్ర ప్రభుత్వం ఢిల్లీకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ చంద్రబాబుని పలకరించి మాట్లాడారు. ఆ సమయంలో ఆయనొక్కరినే కాదు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాజకీయ ప్రముఖులు అందరినీ మోదీ పలకరించారు.

అయితే టీడీపీ అనుకూల మీడియా ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ టీడీపీ, బీజేపీ మధ్య మళ్లీ మైత్రి బంధం చిగురిస్తోందని, అందువల్లే చంద్రబాబుతో మోదీ మాట్లాడారని, ఈ సందర్భంగా అప్పుడప్పుడు ఢిల్లీకి వచ్చి వెళ్తుండండి.. అని మోదీ చంద్రబాబుతో అన్నారని వార్తలు వండి వారుస్తోంది. అయితే టీడీపీ అనుకూల మీడియాలో వస్తున్న వార్తలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వరుసగా కౌంటర్ లు ఇస్తున్నారు.

బతిమాలగా.. బతిమాలగా అయిదేళ్ల తర్వాత చంద్రబాబును ప్రధాని మోదీ పలకరిస్తేనే పచ్చ మీడియా పులకరించి పోయిందని, ఊహాజనిత కథనాలతో రోజంతా రచ్చ రచ్చ చేసిందని నిన్న ఆయన సెటైర్స్ వేశారు. తాజాగా విజయ‌సాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా టీడీపీపై మరో సెటైర్ వేశారు. 'మిలెంగే అని అన్నారో లేదో చంద్రబాబు మళ్లీ తనకు పాత రోజులు వచ్చినట్టే కలలు కంటున్నాడు. ఇద్దరు వ్యక్తులు నిమిషం మాట్లాడినా వెళ్లేటప్పుడు మిలేంగే (కలుద్దాం) అనడం సాధారణం. దాని అర్థం అప్పుడప్పుడు ఢిల్లీ కి రండి అని కాదు. ' ఊహలు గుసగుసలాడే' అన్నట్టు కుల మీడియాతో డప్పు కొట్టిస్తున్నాడు' అని విజయ సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

గతంలో పలు సార్లు టీడీపీ, బీజేపీ కలసి ఎన్నికల్లో పోటీ చేశాయి. 2014 ఎన్నికల్లో కూడా టీడీపీ, బీజేపీ కలసి ఎన్నికల్లో పోటీ చేశాయి. అప్పుడు ఈ రెండు పార్టీలకు పవన్ కళ్యాణ్ కూడా మద్దతు ఇచ్చారు. అయితే ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చింది. నాలుగేళ్ళ పాటు టీడీపీ, బీజేపీ బంధం బాగానే సాగింది. అయితే ఎన్నికలకు ఏడాది సమయంలో చంద్రబాబు తెలివిగా బీజేపీ ప్రభుత్వం నూతన రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వడం లేదని, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని ఆరోపిస్తూ బీజేపీతో పొత్తును తెగదెంపులు చేసుకున్నారు.

ఇక అప్పటి నుంచి టీడీపీ, బీజేపీకి మధ్య అంత సఖ్యత లేదు. 2019 లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాగా వైసీపీ కూడా కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగానే మెలుగుతోంది. ఈ క్రమంలో ప్రస్తుతం బీజేపీకి మళ్లీ దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తోంది టీడీపీ. ఇందుకు ఆ పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా కూడా తనవంతు సాయం అందజేస్తోంది. అయితే టీడీపీ చేస్తున్న రాజకీయాలపై వైసీపీ నేతలు తమదైన శైలిలో విమర్శిస్తున్నారు.

First Published:  8 Aug 2022 10:36 AM GMT
Next Story