Telugu Global
Andhra Pradesh

పింఛన్ ఏపీలోనే ఎక్కువ: ఎంపీ విజయసాయిరెడ్డి

ఏపీతో పోలిస్తే ఏ రాష్ట్రంలోనూ 2000 రూపాయలకు పైబడి పింఛన్ లేదని ఆయన పేర్కొన్నారు. పచ్చ మీడియా, ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు.

పింఛన్ ఏపీలోనే ఎక్కువ: ఎంపీ విజయసాయిరెడ్డి
X

ట్విట్టర్ వేదికగా ప్రతిపక్షాలపై చెలరేగే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తనదైన శైలిలో ప్రతిపక్షాలకు కళ్లు తెరిపించే ప్రయత్నం చేశారు. ఏపీలో అమలవుతున్న పింఛను పథకం, ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న పింఛన్ పథకాలను పోల్చుతూ ఏ రాష్ట్రంలోనూ ఇంత మొత్తంలో పింఛన్ అందజేయడం లేదని ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వృద్ధులకు అధిక మొత్తంలో పింఛన్ ఇస్తున్నామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఏపీతో పోలిస్తే ఏ రాష్ట్రంలోనూ 2000 రూపాయలకు పైబడి పింఛన్ లేదని ఆయన పేర్కొన్నారు. పచ్చ మీడియా, ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

దేశంలోని అభివృద్ధి చెందిన అనేక రాష్ట్రాలు.. కేవలం రూ. 500 రూపాయలలోపే పింఛన్లు ఇస్తున్నాయని, టీడీపీ అధినేత చంద్రబాబు నోటికొచ్చినట్టు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 'కేంద్ర ప్రభుత్వ సాయంతోనే ఏపీలో పింఛన్లు ఇస్తున్నారని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అది నిజమైతే మిగిలిన రాష్ట్రాల్లో అంత మొత్తంలో పింఛన్లు ఎందుకు ఇవ్వడం లేదు. ఈ విషయాన్ని ప్రజలు దృష్టిలో ఉంచుకోవాలి' అని విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు.

ఇంత దుర్మార్గమైన ప్రతిపక్షాన్ని ఎక్కడా చూడలేదన్నారు. కళ్ల ముందు సంక్షేమ పథకాలు అమలవుతున్నా ప్రతిపక్షనేత చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని ఆయన దుయ్య‌బ‌ట్టారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని యాత్రలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ప్రజల నుంచి పెద్దగా స్పందన రావడం లేదు. రైతులు, మిగిలిన వర్గాల ప్రజలు కూడా ఆయనను పట్టించుకోవడం మానేశారని విజయసాయిరెడ్డి విమర్శించారు.

First Published:  1 Aug 2022 11:09 AM GMT
Next Story