Telugu Global
Andhra Pradesh

నారా లోకేష్ కి బర్త్ డే విషెస్ చెప్పిన విజయ సాయిరెడ్డి.. షాకవుతున్న నెటిజన్లు

విజయ సాయిరెడ్డి నారా లోకేష్ ని విష్ చేస్తారని ఎవరూ ఊహించలేదు. దీంతో ఇటు టీడీపీ శ్రేణులు, అటు వైసీపీ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.

నారా లోకేష్ కి బర్త్ డే విషెస్ చెప్పిన విజయ సాయిరెడ్డి.. షాకవుతున్న నెటిజన్లు
X

వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ట్విట్టర్ లో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలిసిందే. ప్రతిపక్షాలపై విమర్శలు చేసేందుకు విజయ సాయి ఎక్కువగా ట్విట్టర్ ని ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ పై తరచూ విరుచుకుపడుతుంటారు. ఇక నారా లోకేష్ ను నిత్యం పప్పు.. పప్పు..అని సంబోధిస్తూ సెటైర్లు వేస్తుంటారు.

విజయ సాయిరెడ్డి సెటైర్లకు నారా లోకేష్ కూడా అంతే స్థాయిలో స్పందిస్తుంటారు. కౌంటర్ గా విమర్శలు చేస్తుంటారు. అయితే ఇవాళ నారా లోకేష్ పుట్టిన‌రోజు సందర్భంగా ఎంపీ విజయ సాయిరెడ్డి ఆయనకు శుభాకాంక్షలు చెప్పడం సెన్సేషన్ గా మారింది. అలాగే ఆయన లోకేష్ కు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని, జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలని దీవించారు.


విజయ సాయిరెడ్డి నారా లోకేష్ ని విష్ చేస్తారని ఎవరూ ఊహించలేదు. దీంతో ఇటు టీడీపీ శ్రేణులు, అటు వైసీపీ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఇక నిత్యం ట్విట్టర్ ని ఫాలో అయ్యే నెటిజన్లు కూడా షాక్ కు గురయ్యారు. నిత్యం ఉప్పు నిప్పులా సాయి రెడ్డి, లోకేష్ మధ్య వ్యవహారాలు సాగుతుంటాయి.. అలాంటిది లోకేష్ కు విజయ సాయిరెడ్డి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారా.. అని ఆశ్చర్యానికి గురవుతున్నారు. అంతేకాదు చాలామంది నెటిజన్లు విజయ సాయిరెడ్డి చేసిన ట్వీట్ కి రిప్ల‌య్ ఇస్తున్నారు.

ఫస్ట్ టైం మీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి హుందాగా, హెల్దీగా వచ్చిన ట్వీట్ అని ఒక నెటిజన్ అనగా, మరో నెటిజన్ ఫస్ట్ టైం మీరు చేసిన ఒక ట్వీట్ కి నేను లైక్ కొట్టా.. అని రిప్ల‌య్ ఇచ్చాడు. ఇంత పాజిటివ్ ట్వీట్ మీ నుంచి చూడటం ఇదే మొదటిసారి అని చాలామంది నెటిజన్లు విజయసాయిరెడ్డికి రిప్ల‌య్‌ ఇస్తున్నారు. ఇదిలా ఉండగా నారా లోకేష్ యువగళం పేరిట 27న‌ పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా 400 రోజులపాటు 4000 కిలోమీటర్ల మేర సాగనుంది.

First Published:  23 Jan 2023 10:29 AM GMT
Next Story