Telugu Global
Andhra Pradesh

సామాజిక సంస్కరణలకు ఆద్యుడు సీఎం జగన్‌.. - ఎంపీ ఆర్.కృష్ణయ్య

దేశవ్యాప్తంగా ఎంతో మంది బీసీ ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ, సీఎం జగన్ తరహాలో ఒక్కరు కూడా సమాజానికి పూర్తి న్యాయం చేయలేకపోయారని చెప్పారు.

సామాజిక సంస్కరణలకు ఆద్యుడు సీఎం జగన్‌.. - ఎంపీ ఆర్.కృష్ణయ్య
X

వెనుకబడిన తరగతుల (బీసీ) సంక్షేమం, వారి అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కృషిని వైఎస్‌ఆర్‌ సీపీ రాజ్యసభ ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ప్రశంసించారు. వెనుకబడిన తరగతుల సంక్షేమంపై విజయవాడలో నిర్వహించిన సమావేశంలో ఎంపీ కృష్ణయ్య మాట్లాడారు.. సీఎం జగన్‌ సంఘ సంస్కర్త అని, బీసీల సంక్షేమం కోసం ఆయనలా కృషి చేసిన ముఖ్యమంత్రి దేశంలో మరొకరు లేరని కృష్ణయ్య కొనియాడారు.

దేశవ్యాప్తంగా ఎంతో మంది బీసీ ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ, సీఎం జగన్ తరహాలో ఒక్కరు కూడా సమాజానికి పూర్తి న్యాయం చేయలేకపోయారని చెప్పారు. బీసీలకు జరిగిన చారిత్రక అన్యాయాన్ని మార్చేందుకు సీఎం జగన్ నిరంతరం కృషిచేస్తున్నారని కృష్ణయ్య అన్నారు.

సీఎం జగన్ బీసీలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని గుర్తుచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 10 మంది బీసీలకు కూడా మంత్రి పదవులు రాని చరిత్ర ఉంటే, సీఎం జగన్‌ 70 శాతం కేబినెట్‌ పదవులు వెనుకబడిన వర్గాలకే ఇచ్చారన్నారు. అదేవిధంగా మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 40-50 శాతానికి పైగా సీట్లు ఇచ్చారని, బీసీల సాధికారత కోసం ఆయన చేస్తున్న కృషిని మనం గుర్తించాలని పిలుపునిచ్చారు.

``రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా బీసీ విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించగలుగుతున్నారు. విదేశాలలో చదువుకోవాలనే వారి కల నెరవేరుతోంది. సీఎం జగన్ ఆలోచనలతో వెనుకబడిన తరగతుల్లో రాబోయే తరం వైద్యులు, న్యాయవాదులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా మారనున్నారు. మా పిల్లలు ఎవరూ ఉద్యోగాల కోసం ఎవరినీ వేడుకోవలసిన అవసరం లేదు. ఈ సంస్కరణలతో, వెనుకబడిన వర్గానికి చెందిన వారిగా ఎవరూ మమ్మల్ని దూషించరు`` అని కృష్ణయ్య అన్నారు.

First Published:  28 Oct 2022 2:02 PM GMT
Next Story