Telugu Global
Andhra Pradesh

కాపు సామాజిక వ‌ర్గాన్ని న‌య‌వంచ‌న చేస్తున్న ప‌వ‌న్.. - వైసీపీ ఎంపీ మార్గాని భరత్

చంద్రబాబు ఏ విధంగా కాపు సామాజిక వర్గాన్ని మోసం చేశారో ప్రజలు గ్రహించాలని, అటువంటి వ్యక్తితో ఈవేళ పవన్ ఎందుకు కలవవలసిచ్చిందో అందరికీ కాకపోయినా, కనీసం కాపు సామాజిక వర్గీయులకైనా వివరణ ఇవ్వాలి కదా అని ప్ర‌శ్నించారు

కాపు సామాజిక వ‌ర్గాన్ని న‌య‌వంచ‌న చేస్తున్న ప‌వ‌న్.. - వైసీపీ ఎంపీ మార్గాని భరత్
X

జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ కాపు సామాజిక వ‌ర్గాన్ని న‌య‌వంచ‌న చేస్తున్నార‌ని వైసీపీ పార్ల‌మెంట‌రీ చీఫ్ విప్‌, రాజ‌మండ్రి ఎంపీ మార్గాని భ‌ర‌త్ రామ్ విమ‌ర్శించారు. సోమ‌వారం ఉద‌యం రాజ‌మండ్రి పుష్క‌ర ఘాట్ వ‌ద్ద ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడారు. కాపు సామాజిక వర్గం, ఆయన అభిమానులు పవన్ సీఎం కావాలనే ఉద్దేశంతో ఆయనకు మద్దతిస్తుంటే.. ఆయనేమో చంద్రబాబు సీఎం కావాలనే విధంగా వ్యవహరించడం.. కాపు సామాజిక వ‌ర్గాన్ని నయవంచన చేయ‌డం కాదా..? అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

కాపు సామాజిక వర్గీయులు జాగృతం కావాల్సిన అవసరం ఉందని ఎంపీ భ‌ర‌త్ చెప్పారు. గతంలో చంద్రబాబు కాపు సంక్షేమానికి వెయ్యి కోట్ల నిధులు కేటాయించి, ఆ నిధులను దారిమళ్ళించేశారని, టీడీపీ హయాంలో కాపుల సంక్షేమానికి ఏ విధంగానూ కృషి చేయలేదని గుర్తుచేశారు. వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే సీఎం జగన్ కాపు నేస్తం పేరుతో కాపు మహిళల బ్యాంకు ఖాతాల్లో ఏటా రూ.15 వేలు చొప్పున గత మూడేళ్ళలో రూ.45 వేలు ప్ర‌తి ఒక్క‌రి ఖాతాలో నేరుగా జమ చేశారన్నారు. ఏటా కాపు నేస్తం కింద రూ.2 వేల కోట్ల పై చిలుకు నిధులు వెచ్చిస్తున్నారని చెప్పారు.

చంద్రబాబు ఏ విధంగా కాపు సామాజిక వర్గాన్ని మోసం చేశారో ప్రజలు గ్రహించాలని, అటువంటి వ్యక్తితో ఈవేళ పవన్ ఎందుకు కలవవలసిచ్చిందో అందరికీ కాకపోయినా, కనీసం కాపు సామాజిక వర్గీయులకైనా వివరణ ఇవ్వాలి కదా అని ప్ర‌శ్నించారు. 2014లో పవన్ పార్టీ పెట్టి పోటీ చేయలేదని, 2019లో అప్ప‌టి టీడీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడానికి ఎన్నికలలో పోటీచేశారని గుర్తుచేశారు. రానున్న ఎన్నికలలో టీడీపీతో కలిసి పోటీ చేస్తానంటున్నారు.. ప‌వ‌న్ ఆడుతున్న ఈ రాజ‌కీయ డ్రామాలు చంద్రబాబు కోసం కాదా అని ఎంపీ భరత్ సూటిగా ప్రశ్నించారు.

కులాల పేరుతో రాజకీయాలు చేయడం సీఎం జగన్ కు చేతకాదని భ‌ర‌త్ రామ్ చెప్పారు. కుల, వర్గ రహితంగా అన్ని వర్గాల వారూ ఆర్థికంగా చైతన్యవంతులు కావాలన్నదే లక్ష్యంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ కాపు ప్రజాప్రతినిధులు, ఆ సామాజిక వ‌ర్గ ప్రముఖులు సోమవారం రాజమండ్రిలో సమావేశమై వివిధ అంశాలపై చర్చించబోతున్నట్టు ఎంపీ భరత్ తెలిపారు. ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపర్చాలనే ఒకే ఒక సంకల్పం సీఎం జగన్మోహన్ రెడ్డిదని ఎంపీ చెప్పారు. చంద్రబాబు, జగన్ పాలనలలో కాపుల సంక్షేమానికి, వారి ఆర్థిక పరిపుష్టికి ఎవ‌రు కృషి చేశారో ఆలోచించాలని ఎంపీ భరత్ విజ్ఞప్తి చేశారు.

First Published:  31 Oct 2022 7:21 AM GMT
Next Story