Telugu Global
Andhra Pradesh

ఫ్యాక్ట్ టార్గెట్‌ కాదు.. పర్సన్ టార్గెట్ విచారణ- అవినాష్ రెడ్డి

సీబీఐ తన కౌంటర్‌లో ప్రస్తావించిన అంశాలపై తనకు తెలిసిన సమాచారాన్ని చెప్పానన్నారు. మరోసారి రావాల్సిందిగా తనకు సీబీఐ చెప్పలేదన్నారు. ఫ్యాక్ట్‌ టార్గెట్‌గా కంటే పర్సన్ టార్గెట్‌గా విచారణ నడుస్తోందన్నారు.

ఫ్యాక్ట్ టార్గెట్‌ కాదు.. పర్సన్ టార్గెట్ విచారణ- అవినాష్ రెడ్డి
X

కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన అవినాష్ రెడ్డి.. సీబీఐ దర్యాప్తు నిజాన్ని వెలికితీసే లక్ష్యంగా కాకుండా.. వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని సాగుతున్నట్టుగా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. సీబీఐ పిలుపు మేరకు విచారణకు హాజరైన అవినాష్ బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. మీడియా బాధ్యతగా వార్తలు ప్రసారం చేయాలని కోరారు. ఒక అబద్దాన్ని జీరో నుంచి వందకు.. ఒక నిజాన్ని వంద నుంచి జీరోకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెల్లవారుజామున మూడు గంటలకు ఫోన్ చేసినట్టు అవాస్తవాలు చెబుతూ రోజూ చర్చలు పెడుతున్నారని అభ్యంతరం తెలిపారు. మీడియానే ట్రయల్ నిర్వహించి తీర్పులు ఇస్తే ఎలా అని ప్రశ్నించారు.

సీబీఐ తన కౌంటర్‌లో ప్రస్తావించిన అంశాలపై తనకు తెలిసిన సమాచారాన్ని చెప్పానన్నారు. మరోసారి రావాల్సిందిగా తనకు సీబీఐ చెప్పలేదన్నారు. ఫ్యాక్ట్‌ టార్గెట్‌గా కంటే పర్సన్ టార్గెట్‌గా విచారణ నడుస్తోందన్నారు. తనకు తెలిసిన చాలా నిజాలను సీబీఐకి చెప్పానని.. వాటిపైనా విచారణ జరపాల్సిందిగా సీబీఐని కోరానన్నారు. అది గూగుల్‌ టేకౌటా లేక అది టీడీపీ టేకౌటా అన్నది త్వరలోనే తేలుతుందన్నారు.

టీడీపీ ఏం చెబితే అదే సీబీఐ ప్రస్తావిస్తోందని.. దీని వల్ల దర్యాప్తు జరుగుతున్న తీరుపై అనుమానాలు కలుగుతున్నాయన్నారు. వివేకానందరెడ్డి చనిపోయిన రోజు ఏం చెప్పానో ఈరోజు కూడా అదే చెబుతున్నానని అవినాష్ రెడ్డి వివరించారు. ఎవరు అడిగినా అదే చెబుతానని.. అంతకు మించి తనకేమీ తెలియదన్నారు. వివేకానందరెడ్డి హత్య స్థలిలోని లెటర్‌ ఎందుకు దాచి పెట్టారు అన్న దానిపై విచారణ జరిగి నిజాలు బయటకు వస్తాయన్నారు.

First Published:  24 Feb 2023 1:48 PM GMT
Next Story