Telugu Global
Andhra Pradesh

అవినాష్ రెడ్డి అరెస్ట్, విడుదల

సుదీర్ఘంగా వాదనలు విన్న న్యాయస్థానం అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అందులో ఒక విషయాన్ని కూడా ప్రస్తావించింది.

అవినాష్ రెడ్డి అరెస్ట్, విడుదల
X

అవినాష్ రెడ్డి అరెస్ట్, విడుదల

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదంటూ ప్రతిపక్షాలు సీబీఐని ప్రశ్నిస్తూ వచ్చాయి. అయితే అరెస్ట్‌ చేయడం, ఆయన్ను విడుదల చేయడం రెండూ జరిగిపోయాయి. ఈ వ్యవహారం అంతా ఈనెల 3నే జరిగిపోయింది. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత విడుదల చేయడాన్ని సీబీఐ కూడా రహస్యంగా ఉంచుతూ వచ్చింది. అవినాష్ రెడ్డి అరెస్ట్‌ అవడం, వెంటనే విడుదల అవడానికి ఇటీవల తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారం అయింది.

తన తల్లి అనారోగ్యంతో ఉన్నారంటూ ముందస్తు బెయిల్ కోసం ఇటీవల అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై సుదీర్ఘంగా వాదనలు విన్న న్యాయస్థానం అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అందులో ఒక విషయాన్ని కూడా ప్రస్తావించింది. అవినాష్ రెడ్డి విచారణకు వస్తారు.. ఒకవేళ సీబీఐ అతడిని అరెస్ట్ చేయాలనుకుంటే అరెస్ట్‌ చేసి వెంటనే 5 లక్షల రూపాయల పూచికత్తు తీసుకుని విడుదల చేయాలని ఆదేశించింది.

కావాలనుకుంటే అరెస్ట్ చేసి పూచీకత్తుపై విడుదల చేయొచ్చు అన్న హైకోర్టు ఆదేశాలను సీబీఐ వాడుకుంది. గత శనివారం అవినాష్ రెడ్డి విచారణకు వచ్చిన సమయంలో అరెస్ట్ చూపించి.. పూచీకత్తు తీసుకుని విడుదల చేసింది. ఇప్పటి వరకు అటు అవినాష్ రెడ్డి నుంచి గానీ, ఇటు సీబీఐ నుంచి గానీ అ విషయం బయటకు రాలేదు. అటు భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ వేసిన కౌంటర్‌లో మాత్రం అవినాష్ రెడ్డిపైనా పలు అభియోగాలు మోపింది. తొలిసారి అవినాష్ రెడ్డిని నిందితుడిగా కౌంటర్‌లో వెల్లడించింది. ఏ-8గా కేసులో అవినాష్ రెడ్డిని చేర్చినట్టు వెల్లడించింది.

First Published:  9 Jun 2023 2:24 AM GMT
Next Story