Telugu Global
Andhra Pradesh

ఆదాల అస్త్ర‌స‌న్యాసం.. అల్లుడు అరంగేట్రం.. నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్య‌ర్థిగా బ‌రిలో దింపే ఛాన్స్‌?

ఆదాల‌కి ఇద్ద‌రు కుమార్తెలు. త‌న‌ అల్లుడినే రాజ‌కీయ వార‌సుడిగా రంగంలోకి దింపుతున్నార‌ని తెలుస్తోంది. బెంగ‌ళూరులో రియ‌ల్ ఎస్టేట్, క‌న్‌స్ట్ర‌క్ష‌న్ రంగంలో బాగా సంపాదించిన అల్లుడు పి. చంద్ర కిర‌ణ్ రెడ్డి రాజ‌కీయ అరంగేట్రానికి ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డి మార్గం సిద్ధం చేస్తున్నారు.

ఆదాల అస్త్ర‌స‌న్యాసం.. అల్లుడు అరంగేట్రం.. నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్య‌ర్థిగా బ‌రిలో దింపే ఛాన్స్‌?
X

ఆయ‌నో వ్యాపార‌వేత్త‌. అంత‌కుమించి బ‌డా కాంట్రాక్ట‌ర్. ఈ నేప‌థ్యం చాలు రాజ‌కీయ నేత‌గా రాణించ‌డానికి. ద‌శాబ్దాలుగా పార్టీలు మారినా రాజ‌కీయ రంగంలో కొన‌సాగుతూ వ‌స్తున్నారు. వివాదాల‌కు దూరంగా ఉంటూ నెల్లూరు పెద్దారెడ్డిగా పేరుగాంచారు. ఆయ‌నే నెల్లూరు ఎంపీ ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డి. రాజకీయాలంటే మొహం మొత్తిందో, అనారోగ్య స‌మ‌స్య‌లు చుట్టుముట్టాయో తెలియ‌దు కానీ, అస్త్ర‌స‌న్యాసం చేయాల‌ని మాత్రం డిసైడ్ అయ్యార‌ట‌.

పాలిటిక్స్ లో ట్రిక్స్ ప్లే చేయ‌డంలో ఆదాల‌ది అందె వేసిన చేయి. 2019 ఎన్నిక‌ల్లో టిడిపి టికెట్ తెచ్చుకుని వైసీపీలో చేరి ఎంపీ అయిన ఘ‌న‌చ‌రిత్ర ఆయ‌న సొంతం. ఇప్పుడు కూడా వైసీపీ నుంచి టిడిపిలోకి జంప్ కొట్టిన త‌రువాతే రాజకీయాల నుంచి త‌ప్పుకుంటార‌ని తెలుస్తోంది.

ఆదాల‌కి ఇద్ద‌రు కుమార్తెలు. త‌న‌ అల్లుడినే రాజ‌కీయ వార‌సుడిగా రంగంలోకి దింపుతున్నార‌ని తెలుస్తోంది. బెంగ‌ళూరులో రియ‌ల్ ఎస్టేట్, క‌న్‌స్ట్ర‌క్ష‌న్ రంగంలో బాగా సంపాదించిన అల్లుడు పి. చంద్ర కిర‌ణ్ రెడ్డి రాజ‌కీయ అరంగేట్రానికి ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డి మార్గం సిద్ధం చేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో గెలిచే పార్టీ అని ఫిక్స‌యి వైసీపీలోకి దూకిన ఆదాల, వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిడిపి గెలిచే అవ‌కాశం ఉంద‌ని ఆ గూటికి చేరే ప్ర‌య‌త్నాలు ఆరంభించార‌ని స‌మాచారం.

తెలుగుదేశం అధినాయ‌క‌త్వంతో చ‌ర్చ‌లు పూర్త‌య్యాయ‌ని తెలుస్తోంది. తాను పోటీచేయ‌న‌ని, త‌న అల్లుడికి టికెట్ క‌న్‌ఫామ్ చేయాల‌ని కోరిన‌ట్టుగా స‌మాచారం. దీనికి టిడిపి పెద్ద‌లు సానుకూలంగా స్పందించారట‌.

వాస్త‌వంగా వైసీపీ ఎంపీగా గెలిచినా ఏ రోజూ క్రియాశీల‌క రాజ‌కీయాల్లో ఆదాల లేరు. టిడిపి స‌ర్కారులో త‌న‌కు రావాల్సిన బిల్లులు కోట్ల రూపాయ‌లు అక్కౌంట్లో ప‌డ‌గానే కండువా మార్చేసిన ఘ‌నుడు ఆదాల‌. తెలుగుదేశం పార్టీ కూడా ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డి అవ‌కాశ‌వాద రాజ‌కీయాలు తెలిసి, త‌మ ష‌ర‌తుల‌కు ఒప్పుకున్నాకే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలిసింది. కాంట్రాక్ట్ ప‌నులు, బిల్లుల నేప‌థ్యంలో ఎక్కువ‌గా ఢిల్లీలోనూ, దేశ‌వ్యాప్తంగా ఇత‌ర న‌గ‌రాల‌లో ఉండే ఆదాల అయినా, ఆయ‌న అల్లుడు అయినా ఎంపీ స్థానం లాబీయింగ్ కోసమే త‌మ‌కు సూట‌వుతుంద‌ని భావిస్తున్నారు. వైసీపీలో త‌న ఎంపీ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఎమ్మెల్యేలతో ఆదాల‌కి గ్యాప్ ఉంది. అలాగే ఎంపీగా త‌న మాట నియోజ‌క‌వ‌ర్గంలోగానీ, జిల్లాలోగానీ చెల్లుబాటు కావ‌డంలేదు.

సాయిరెడ్డి, వేమిరెడ్డి హ‌వాలో ఆదాల ఎంపీ ప‌ద‌వి చిన్న‌బోయింది. ఈ కార‌ణాల‌తో వైసీపీలో తాను ఇమ‌డ‌లేక‌పోతున్నాన‌ని, వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా చేయ‌న‌ని స‌న్నిహితుల‌కు ఇదివ‌ర‌కే చెప్పేశారు. వైసీపీ కూడా త‌మ ఎంపీ అభ్య‌ర్థిత్వాల జాబితా నుంచి ఆదాల‌ని ఎప్పుడో త‌ప్పించేసిందట‌. మొత్తానికి ఆదాల మ‌రోసారి పార్టీ మారుతూ రాజ‌కీయ అస్త్ర‌స‌న్యాసం చేస్తూ..అల్లుడు రాజ‌కీయ అరంగేట్రానికి మార్గం సుగ‌మం చేస్తున్నారు.

First Published:  10 Jan 2023 9:26 AM GMT
Next Story