Telugu Global
Andhra Pradesh

ఏపీపై నిజంగా అభిమానం ఉంటే.. అలా చేయాలి..

షర్మిలకు అసలు అజెండానే లేదని ఎమ్మెల్సీ కల్యాణి విమర్శించారు. ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడమే ఆమె తన అజెండాగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీపై నిజంగా అభిమానం ఉంటే.. అలా చేయాలి..
X

షర్మిలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలపై నిజంగా అభిమానం ఉంటే.. తెలంగాణ నుంచి ఆంధ్రాకు రావాల్సిన ఉమ్మడి ఆస్తులను రేవంత్‌రెడ్డిని అడిగి రప్పించాలని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి సూచించారు. ఆదివారం ఉదయం ఆమె విలేకరులతో మాట్లాడుతూ షర్మినుద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్న షర్మిల తెలంగాణలో కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఉంది కాబట్టి ఆమెకు నిజంగా ఏపీ ప్రజలపై అభిమానం ఉంటే ఆ విధంగా చేయాలని చెప్పారు.

అలాగే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావలసిన విద్యుత్‌ బకాయిలు రూ.6,000 కోట్లు కూడా తీసుకురావాలని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి డిమాండ్‌ చేశారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కుమార్తెగా షర్మిలను తాము గౌరవిస్తున్నామని, కానీ ఆమె మాత్రం వైఎస్సార్‌ పరువు తీస్తున్నారని మండిపడ్డారు.

షర్మిలకు అసలు అజెండానే లేదని ఎమ్మెల్సీ కల్యాణి విమర్శించారు. ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడమే ఆమె తన అజెండాగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరీ శృతిమించి ఆరోపణలు చేస్తే వైఎస్సార్‌ అభిమానులు షర్మిలను ఉపేక్షించరని హెచ్చరించారు. నర్సీపట్నంలో వైఎస్సార్‌ అభిమానులు ఎలా నిలదీశారో చూడాలని ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు.

రాష్ట్ర ప్రజలకు సంక్షేమం అందిస్తూ.. పేద కుటుంబాల పురోగతే ధ్యేయంగా సీఎం వైఎస్‌ జగన్‌ సమున్నత లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని, విద్య, వైద్యం విషయంలో ముందుచూపుతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారని వివరించారు. తద్వారా ఆయన ఆంధ్రప్రదేశ్‌ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోనున్నారని చెప్పారు. అలాంటి ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేసేముందు ఆలోచించుకోవాలని ఎమ్మెల్సీ కల్యాణి సూచించారు.

First Published:  11 Feb 2024 7:11 AM GMT
Next Story