Telugu Global
Andhra Pradesh

వైసీపీలో లేస్తున్న అస‌మ్మ‌తి గొంతులు

ఈ నేత‌లు త‌మ‌కి ప్రాధాన్య‌త త‌గ్గింద‌నో, త‌మ‌కు కీల‌క ప‌ద‌వులు ద‌క్క‌లేద‌నో అల‌క‌బూనారు. పార్టీ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటూ అదే వేదిక‌ల‌పై నుంచి అస‌మ్మ‌తి గ‌ళం వినిపిస్తున్నారు.

వైసీపీలో లేస్తున్న అస‌మ్మ‌తి గొంతులు
X

వైసీపీలో ఇప్ప‌టివ‌ర‌కూ అస‌మ్మ‌తి స‌మ‌స్య పెద్ద‌గా లేదు. అయితే ఇటీవ‌ల ఒక్కొక్క‌రూ అస‌మ్మ‌తి గ‌ళం వినిపిస్తున్నారు. ఈ నేత‌లు త‌మ‌కి ప్రాధాన్య‌త త‌గ్గింద‌నో, త‌మ‌కు కీల‌క ప‌ద‌వులు ద‌క్క‌లేద‌నో అల‌క‌బూనారు. పార్టీ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటూ అదే వేదిక‌ల‌పై నుంచి అస‌మ్మ‌తి గ‌ళం వినిపిస్తున్నారు. వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే ఆనం రామ‌ నారాయ‌ణ‌రెడ్డి మంత్రి ప‌ద‌వి ఆశించార‌ని, రెండు విడ‌త‌ల్లోనూ కేబినెట్‌లో చోటు ద‌క్క‌క‌పోవ‌డంతో ప్ర‌భుత్వ పాల‌న‌పై బ‌హిరంగ విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు.

కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి సీఎంకి బాగా స‌న్నిహితులు. కోటంరెడ్డి కూడా స‌ర్కారు తీరు, అధికారుల నిర్ల‌క్ష్యంపై బ‌హిరంగంగానే వ్యాఖ్య‌లు చేస్తున్నారు. హోం మంత్రిగా ప‌నిచేసిన మేక‌తోటి సుచ‌రిత త‌న మంత్రి ప‌ద‌వి పోయిన నుంచీ వైసీపీలో అన్య‌మ‌న‌స్కంగానే ఉన్నారు. అప్పుడ‌ప్పుడూ అసంతృప్తిని వెళ్ల‌గ‌క్కుతూనే ఉన్నారు. తాజాగా త‌న భ‌ర్త పార్టీ మారితే ఆయ‌న‌తోపాటు వెళ్ల‌క త‌ప్ప‌దంటూ తాను వైసీపీలో ఉండ‌నంటూ సంకేతాలు పంపారు. తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి వైసీపీలో వ‌ర్గ‌పోరుతో ప‌డ‌లేక అధిష్టానంపైనా, ప్ర‌భుత్వంపైనా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అంద‌రి గుండె జ‌గ‌న్ జ‌గ‌న్ అని కొట్టుకుంద‌ని ప్ర‌శంసించిన ఈ మ‌హిళా డాక్ట‌ర్, జ‌గ‌న్ పాల‌న‌లో మ‌హిళల‌పై దాడులు పెరిగిపోయాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గిద్ద‌లూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కూడా నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ పాలిటిక్స్ త‌ట్టుకోలేక తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో వైసీపీ ప‌ట్ల అంతా విధేయులుగా ఉన్నార‌ని అనుకుంటున్న ద‌శ‌లో మైల‌వ‌రం ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ‌ప్రసాద్ అస‌మ్మ‌తి గ‌ళం వినిపించ‌డం మొద‌లుపెట్టారు.

కేబినెట్లో బెర్త్ ఆశించిన వ‌నంత‌కి ఆశాభంగం ఎదురైంది. దీంతోపాటు మంత్రి జోగి ర‌మేష్ తో విభేదాలు తీవ్రం అయ్యాయి. వ‌సంత కృష్ణ‌ప్రసాద్ గుంటూరు తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో ఎన్ఆర్ఐ ఉయ్యూరు శ్రీనివాస్ త‌ర‌ఫున వ‌కాల్తా పుచ్చుకుని వైసీపీ పెద్ద‌ల‌ను ప్ర‌శ్నించే రీతిలో స్టేట్మెంట్ ఇచ్చారు. మాజీ మంత్రి వ‌సంత నాగేశ్వ‌రరావు కూడా అమ‌రావ‌తి రాజ‌ధాని విష‌యంలో వైసీపీ ప్ర‌భుత్వంపై వ్యాఖ్య‌లు చేయ‌డం వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ వివ‌ర‌ణ ఇవ్వాల్సిన వ‌చ్చింది. వైసీపీ స‌ర్కారు ఏర్ప‌డి నాలుగేళ్లు త్వ‌ర‌లో పూర్తి చేసుకుంటోంది. ఇప్ప‌టివ‌ర‌కూ పార్టీలో అసంతృప్తి గ‌ళాలు బ‌హిరంగంగా వినిపించేవి కావు. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న వేళ పార్టీ మారుదామ‌నే ఆలోచ‌న ఏమో గానీ, ధైర్యం చేసి మ‌రీ వైసీపీ పాల‌న‌పై వైసీపీ ఎమ్మెల్యేలే ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

First Published:  6 Jan 2023 7:41 AM GMT
Next Story