Telugu Global
Andhra Pradesh

పీకే టీమ్ మమ్మల్ని ఇబ్బంది పెడుతోంది.. సీఎం జగన్ వద్ద వైసీపీ నేతల మొర

ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యవేక్షకులను నియమించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు, ఇంచార్జులకు తోడుగా మరొకరిని నియమించాలనే వ్యూహం వెనుక ఐ-ప్యాక్ టీమ్ ఉందని నేతలు ఆరోపిస్తున్నారు.

పీకే టీమ్ మమ్మల్ని ఇబ్బంది పెడుతోంది.. సీఎం జగన్ వద్ద వైసీపీ నేతల మొర
X

ఏపీలో వైఎస్ జగన్ 2019లో అధికారంలోకి రావడానికి ఆయన కష్టం ఎంత ఉందో.. తెర వెనుక ప్రశాంత్ కిశోర్ (పీకే) స్ట్రాటజీలు కూడా అంతే పని చేశాయి. అందుకే పీకే టీమ్ ఐ-ప్యాక్ అంటే సీఎం జగన్‌కు అభిమానం ఎక్కువే. గత ఎన్నికల్లో పీకే టీమ్‌ను వాడుకున్నట్లే ఈ సారి కూడా ఉపయోగించుకోవాలని జగన్ నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఐ-ప్యాక్ టీమ్ ఏపీలో తమ పని ప్రారంభించింది. కొన్నిరోజుల కిందటే తెలంగాణ నుంచి 40 బృందాలను ఐ-ప్యాక్ ఏపీకి తరలించింది. ఆ సంస్థ పలు సర్వేలు చేయడమే కాకుండా.. ఎన్నికల స్ట్రాటజీలు కూడా ఇస్తుంది. గతంతో పీకే నేరుగా ఐ-ప్యాక్‌తో సంబంధం కలిగి ఉండేవారు. దీంతో వైఎస్ జగన్‌తో నేరుగా కలిసి మాట్లాడేవారు. ప్రస్తుతం ఐ-ప్యాక్ ఏపీ బాధ్యతలను ఆయన శిష్యుడు రిషి రాజ్ చూస్తున్నారు. అయితే పీకే ఉన్నప్పటి కంటే రిషిరాజ్ వచ్చిన తర్వాత వైసీపీకి ఏమీ ఒరగలేదని నేతలు అంటున్నారు. పైగా ఆయన వ్యూహాల వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తుందని కూడా ఆరోపిస్తున్నారు.

ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యవేక్షకులను నియమించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు, ఇంచార్జులకు తోడుగా మరొకరిని నియమించాలనే వ్యూహం వెనుక ఐ-ప్యాక్ టీమ్ ఉందని నేతలు ఆరోపిస్తున్నారు. తమకు పోటీగా ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ప్రోత్సహించలేమని సీఎం జగన్ వద్ద మొరపెట్టుకున్నట్లు తెలుస్తున్నది. అలా చేయడం వల్ల భవిష్యత్‌లో గొడవలు జరిగే అవకాశం ఉందని నేతలు చెప్పారు. తమ నియోజకవర్గాల్లో వేరే నేతలను ప్రోత్సహించడాన్ని తాము ఒప్పుకోమని ఎమ్మెల్యేలు కూడా స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతానికి జగన్ నిర్ణయం తీసుకున్నా.. ఆ విషయంపై ఇంకా ముందడుగు పడలేదు. ఒకవేళ పర్యవేక్షకులను నియమిస్తే మాత్రం తప్పకుండా పార్టీలో విభేదాలు వస్తాయని సీఎంకు చెప్పినట్లు తెలుస్తున్నది.

మరోవైపు ఐ-ప్యాక్ టీమ్ ఇష్టానుసారం సర్వేలు చేసి మీడియాకు లీకులు ఇస్తుందని, దీని వల్ల తాము ఇబ్బంది పడుతున్నామని కూడా ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఎన్నికలకు మరో కొన్ని నెలలు సమయం ఉండగా.. ఇలా తమ ఇమేజ్‌కు డ్యామేజ్ చేసే సర్వేలు చేయడం భావ్యం కాదని అంటున్నారు. పీకే టీమ్ కారణంగానే తమకు ఇబ్బందులు వస్తున్నాయని.. ఐ-ప్యాక్ టీమ్‌కు పరిమితులు విధించాలని జగన్‌కు మొరపెట్టుకున్నట్లు తెలుస్తున్నది. గడప గడపకు మ‌న ప్రభుత్వం కార్యక్రమం కూడా సత్ఫలితాలను ఇవ్వడం లేదని ఎమ్మెల్యేలు చెప్తున్నారు. మనం ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా.. ప్రజల్లో ఎంతో కొంత అసంతృప్తి ఉంటుందని, గడప గడపకు కార్యక్రమంలో అలా వెల్లగక్కిన అసంతృప్తిని మీడియా హైలైట్ చేస్తోందని చెప్తున్నారు. ఇది అంతిమంగా పార్టీకే చేటు తెస్తుందని అంటున్నారు. ఈ కార్యక్రమం మొత్తం రూపకల్పన చేసింది ఐ-ప్యాక్ టీమే అని అనుమానిస్తున్నారు. మరోవైపు పీకే టీమ్ సభ్యులు ఎప్పుడు పడితే అప్పుడు డేటా కావాలి, సర్వే చేయాలని అని ఇబ్బంది పెడుతున్నట్లు కూడా ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు.

కాగా, ఇవ్వాళ సీఎం జ‌గ‌న్ ప్రజా ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో గడప గడపకు కార్యక్రమంపై సమీక్షే ముఖ్య అజెండాగా ఉండనున్నది. వాస్తవానికి గత వారమే ఈ సమావేశం నిర్వహించాల్సి ఉన్నది. కానీ ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు నేటికి వాయిదా వేశారు. ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనని ఎమ్మెల్యేలకు సీఎం క్లాస్ తీసుకునే అవకాశం ఉన్నది. మరోవైపు పర్యవేక్షకుల జాబితాను కూడా సీఎం ప్రకటిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవైపు పీకే టీమ్‌పై ఫిర్యాదు చేసినా.. సీఎం జగన్ మాత్రం వారి స్ట్రాటజీలనే అమలు చేస్తుండటంపై ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

First Published:  28 Sep 2022 4:00 AM GMT
Next Story