Telugu Global
Andhra Pradesh

చిన్న లాజిక్‌తో నారా లోకేష్‌ నోరు మూయించిన వైసీపీ ఎమ్మెల్యే

ఒకవేళ నేను అలాంటి వాడిని అయితే.. మీ నాన్న చంద్రబాబు నాయుడు రెండు సార్లు ఎమ్మెల్సీ పదవి నాకు ఎందుకు ఇచ్చారు..? అలానే ఓసారి జిల్లా అధ్యక్షుడిగా ఎందుకు చేశారు..?

చిన్న లాజిక్‌తో నారా లోకేష్‌ నోరు మూయించిన వైసీపీ ఎమ్మెల్యే
X

యువగళం పాదయాత్రలో వైసీపీపై ఘాటు విమర్శలు గుప్పిస్తున్న నారా లోకేష్‌ని చిన్న లాజిక్‌తో శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి నోరు మూయించారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన నారా లోకేష్.. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి జిల్లాలో ఎర్రమట్టి దందాలు, భూ కబ్జాలు, ఇసుక రవాణా చేస్తూ పెద్ద ఎత్తున కమీషన్లు తీసుకుంటున్నాడని ఆరోపణలు గుప్పించారు. చివరికి శ్రీశైలం దేవుడిని కూడా వదల్లేదని.. ఆయన తమ్ముడు, అనుచరులు దోచుకుంటున్నారని విమర్శించారు. జిల్లాలో ఆయన ఛీటింగ్ చక్రపాణి అంటూ ఎద్దేవా చేశారు.

నారా లోకేష్ విమర్శలపై ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి కూడా ఘాటుగా స్పందించారు. ‘‘నన్ను ఛీటింగ్ చక్రపాణి అంటావా..? చాలా సంతోషం. మీ ఛీటింగ్ స్కూల్‌లోనే నేను ఆరేళ్లపాటు చదువుకున్నాను. ఒకవేళ నేను అలాంటి వాడిని అయితే.. మీ నాన్న చంద్రబాబు నాయుడు రెండు సార్లు ఎమ్మెల్సీ పదవి నాకు ఎందుకు ఇచ్చారు..? అలానే ఓసారి జిల్లా అధ్యక్షుడిగా ఎందుకు చేశారు..? వెళ్లి మీ నాన్నని అడుగు నేను ఎలాంటి వాడినో చెప్తాడు. అంతెందుకు నారా లోకేష్ నీకు దమ్ముంటే మహానందికి రా.. అక్కడ ప్రమాణం చేద్దాం’’ అంటూ సవాల్ విసిరారు.

ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి సవాల్‌తో శ్రీశైలంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. కానీ.. నారా లోకేష్ నుంచి మాత్రం సమాధానం రాలేదు. లోకేష్ పాదయాత్ర సోమవారంతో 100వ రోజుకి చేరుకుంది.

First Published:  15 May 2023 5:06 AM GMT
Next Story