Telugu Global
Andhra Pradesh

ఎమ్మెల్యేకి ఈసారి టికెట్ ఇవ్వొద్దు- పెద్దిరెడ్డి కారు ముందు బైఠాయింపు

వైసీపీ అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేసిన ఒక ప్రధాన సామాజికవర్గం నేతలను, కార్యకర్తలను అణచివేస్తూ అక్రమంగా ఎమ్మెల్యే శంక‌ర్ నారాయ‌ణ కేసులు పెట్టిస్తున్నారని వారు వివరించారు.

ఎమ్మెల్యేకి ఈసారి టికెట్ ఇవ్వొద్దు- పెద్దిరెడ్డి కారు ముందు బైఠాయింపు
X

సత్యసాయి జిల్లా పెనుకొండ వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. కొంతకాలంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే శంకర్‌నారాయణకు వ్యతిరేకంగా వైసీపీలో గ్రూపులు ఏర్పడ్డాయి. మంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు గానీ శంకర్ నారాయణ వైసీపీలోని కొన్ని వర్గాలను అణచివేస్తూ వస్తున్నారన్న విమర్శ ఉంది. వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా తాను, తన సోదరులు, బంధువులే అన్ని సొంతం చేసుకుంటున్నారని అసమ్మతి వర్గం ఆరోపిస్తూ వస్తోంది.

తాజాగా జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి వస్తున్న విషయం తెలుసుకున్న వైసీపీలోని ఎమ్మెల్యే వ్యతిరేకులు రోడ్డుపై బైఠాయించారు. శంక‌ర్‌నారాయ‌ణ‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై పెద్దిరెడ్డి కారును అడ్డుకున్నారు. వచ్చే ఎన్నికల్లో శంకర్ నారాయణకు టికెట్ ఇవ్వొద్దని డిమాండ్ చేశారు.

వైసీపీ అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేసిన ఒక ప్రధాన సామాజికవర్గం నేతలను, కార్యకర్తలను అణచివేస్తూ అక్రమంగా ఎమ్మెల్యే శంక‌ర్ నారాయ‌ణ కేసులు పెట్టిస్తున్నారని వారు వివరించారు. కొందరు కార్యకర్తలు పెద్దిరెడ్డి కారు మీదకు చెప్పులు విసిరే ప్రయత్నం చేయగా నాయకులు నిలువరించారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశం నేపథ్యంలో రెండు రోజులుగా సోషల్ మీడియాలోనూ ఎమ్మెల్యే శంకర్ నారాయణకు వ్యతిరేకంగా వైసీపీ వారు ప్రచారం చేస్తున్నారు.

సంపాదన, అణచివేత అనే జోడు గుర్రాలతో ఎమ్మెల్యే స్వారీ చేస్తున్నారని వైసీపీ వారు పోస్టులు పెట్టారు. ప్రతి పనిలోనూ కమీషన్లను ఎమ్మెల్యే, ఆయన సోదరులు వసూలు చేస్తున్నారని వివరించారు. తాము పార్టీ బాగుకోసం పోరాడుతుంటే ఎమ్మెల్యే శంకర్ నారాయణ మాత్రం కుల సమావేశాలంటూ టీడీపీ నేతలతో కలిసి తిరుగుతున్నారని వైసీపీ అసమ్మతి వ‌ర్గ నేతలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.

First Published:  17 Dec 2022 7:02 AM GMT
Next Story