Telugu Global
Andhra Pradesh

అచ్చెన్న.. దమ్ముంటే నా ఇంటి వద్దకు వచ్చి తిరిగెళ్లు..

దమ్ముంటే అచ్చెన్నాయుడే నేరుగా వచ్చి తన ఇంటిని ముట్టడించాలని.. అలా ముట్టడించిన తర్వాత తిరిగి వెళ్లే దమ్ము అచ్చెన్నాయుడికి ఉందా అని సవాల్ చేశారు.

అచ్చెన్న.. దమ్ముంటే నా ఇంటి వద్దకు వచ్చి తిరిగెళ్లు..
X

ప్రశాంత‌మైన మాచర్ల ప్రాంతంలో ఫ్యాక్షన్‌ను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ది పొందేందుకు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. మాచర్లలో రాజకీయం వదిలేసి వెళ్లి గుంటూరులో తలదాచుకుంటున్న బ్రహ్మారెడ్డిని తిరిగి తీసుకొచ్చి పరిస్థితిని రెచ్చగొడుతున్నారని విమర్శించారు.

ఏడు హత్య కేసుల్లో బ్రహ్మారెడ్డి ఏ-1గా ఉన్నారని.. ఆయన కుటుంబాన్ని ప్రజలు చీకొట్టి 2004లో ఓడిస్తే అప్పటి నుంచి గుంటూరులో ఉంటున్నాడని.. జగన్‌ సీఎం అయిన తొలి రెండేళ్లు మాచర్లలో చిన్న ఘటన కూడా జరగలేదని.. బ్రహ్మారెడ్డిని టీడీపీ ఇన్‌చార్జ్‌గా నియమించిన తర్వాతే గొడవలు జరుగుతున్నాయని పిన్నెల్లి వివరించారు. గుంటూరులో ఉంటున్న బ్రహ్మారెడ్డికి చంద్రబాబు నెలనెల డబ్బులు పంపిస్తూ మాచర్లలో గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

మూడు రోజుల క్రితం డ్రంక్ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వారిని పోలీసులు స్టేషన్‌ను తీసుకెళ్తే 50 మందిని వెంటేసుకుని వెళ్లి స్టేషన్‌లో గొడవ చేసిన వ్యక్తి బ్రహ్మారెడ్డి అని విమర్శించారు. నియోజవకర్గంలో టీడీపీ కార్యక్రమాలు జరుగుతున్నాయని.. అక్కడెక్కడా ఎవరూ అభ్యంతరం తెలపలేదన్నారు. మాచర్లలోని 12 వార్డుల్లో మొత్తం బీసీలే ఉంటారని.. అక్కడికి వెళ్లి జగన్‌మోహన్ రెడ్డిని బ్రహ్మారెడ్డి తిట్టడంతో మహిళలు తిరగబడ్డారన్నారు. దాంతో వారిని టీడీపీ కార్యకర్తలు ఇష్టానుసారం కర్రలు, రాడ్లతో కొట్టారన్నారు. మోహన్ అనే వ్యక్తిని నడిరోడ్డు మీద పడేసి బండరాళ్లతో కొట్టారన్నారు.

వైసీపీ దాడులు చేసి ఉంటే వైసీపీ వారికే ఎందుకు గాయాలు అవుతాయని ఎమ్మెల్యే ప్రశ్నించారు. తన ఇల్లు ముట్టడించాల్సిందిగా టీడీపీ శ్రేణులకు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారని.. ఇలాంటి రెచ్చగొట్టే పనులు మానుకోవాలన్నారు. దమ్ముంటే అచ్చెన్నాయుడే నేరుగా వచ్చి తన ఇంటిని ముట్టడించాలని.. అలా ముట్టడించిన తర్వాత తిరిగి వెళ్లే దమ్ము అచ్చెన్నాయుడికి ఉందా అని సవాల్ చేశారు.

First Published:  17 Dec 2022 7:44 AM GMT
Next Story