Telugu Global
Andhra Pradesh

మాయమైపోయిన వైసీపీ ఎమ్మెల్యే

మేకపాటి ఎవరికీ అందుబాటులో లేకపోవటంతో అనుమానాలు బలపడిపోతున్నాయి. మేకపాటి ఆఫీసులో కూడా వైసీపీ ఫ్లెక్సీలు, కటౌట్లు అన్నీ తీసేశారట. ఆఫీసుకు కూడా తాళాలు వేసున్నట్లు చెబుతున్నారు.

మాయమైపోయిన వైసీపీ ఎమ్మెల్యే
X

అధికార వైసీపీ ఎమ్మెల్యే ఎవరికీ అందుబాటులో లేకుండా మాయమైపోయారు. గురువారం జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ తర్వాత ఎమ్మెల్యే ఎవరితోనూ టచ్ లో లేరు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరో అర్ధమైపోయుంటుందే. అవును, అయనే నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి. పోలింగ్ అయిపోయిన వెంటనే ఆయన ఫోన్ స్విచ్చాఫ్ అనివస్తోంది. జిల్లాలో నేతలు చాలామంది ఎమ్మెల్యే కోసం వెతుకుతున్నారు.

కారణం ఏమిటంటే.. వైసీపీ నుంచి రెండు ఓట్లు టీడీపీ అభ్య‌ర్థికి ప‌డ్డాయ‌న్న అనుమానాలే. రెబల్ ఎమ్మెల్యేలు ఇద్దరు కాకుండా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడటం వల్లే టీడీపీ అభ్యర్ధి పంచుమర్తి అనూరాధ 23 ఓట్ల మెజారిటీతో గెలిచారు. వైసీపీ నుంచి క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన ఎమ్మెల్యేలు ఎవరనేది ఆసక్తిగా మారింది. అయితే పోలింగ్ జ‌రిగి ఫ‌లితాలు వెలువ‌డిన నిన్న‌ రాత్రికే క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన ఎమ్మెల్యేల‌ను గుర్తించినట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.

ఎప్పుడైతే సజ్జల ప్రకటించారో వెంటనే అందరి దృష్టి ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి మీద‌ అనుమానాలు పెరిగిపోయాయి. ఎందుకంటే వీళ్ళు వేయాల్సిన ఎమ్మెల్సీ అభ్యర్ధులకు ఒక్కో ఓటు తగ్గింది. దానికి తగ్గట్లే మేకపాటి ఎవరికీ అందుబాటులో లేకపోవటంతో అనుమానాలు బలపడిపోతున్నాయి. మేకపాటి ఆఫీసులో కూడా వైసీపీ ఫ్లెక్సీలు, కటౌట్లు అన్నీ తీసేశారట. ఆఫీసుకు కూడా తాళాలు వేసున్నట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యే బెంగళూరుకు వెళ్ళిపోయినట్లు అనుమానిస్తున్నారు. మరెప్పటికి అందుబాటులోకి వస్తారో తెలీదు.

ఇక రెండో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాత్రం తాను క్రాస్ ఓటింగ్‌కు పాల్పడలేదని పదేపదే చెబుతున్నారు. అయితే ఈమె మాటలను ఎవరూ నమ్మటంలేదు. పార్టీ ముఖ్యులకు ఈ ఎమ్మెల్యే అందుబాటులోనే ఉన్నారు. అయినా కూడా ఈమెపై అనుమానాలు పెరిగిపోతునే ఉన్నాయి. ఈ ఇద్దరికీ వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేదిలేదని జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పేశారట. పోలింగ్‌కు ముందు కలిసినప్పుడు కూడా జగన్ ఈ విషయాన్ని స్పష్టంచేశారని అంటున్నారు. ఎలాగూ టికెట్లు రాదుకాబట్టే తమిష్టం వచ్చినట్లు నడుచుకోవచ్చనే ఎమ్మెల్యేలిద్దరూ క్రాస్ ఓటింగుకు పాల్పడినట్లు ప్రచారంలో ఉంది.

First Published:  24 March 2023 9:11 AM GMT
Next Story