Telugu Global
Andhra Pradesh

నాకు ఫోన్‌ ద్వారా 35 మంది ఎమ్మెల్యేలు, న‌లుగురు ఎంపీలు, ఇద్దరు మంత్రులు టచ్‌లోకి వచ్చారు - కోటంరెడ్డి

మంత్రులు, హైకోర్టు చీఫ్ జస్టిస్, న్యాయమూర్తులు, ఐపీఎస్‌లు, ఐఏఎస్‌లు, మీడియా యాజమాన్యాలు, మీడియా ప్రతినిధులు ఇలా అందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని కోటంరెడ్డి ఆరోపించారు.

నాకు ఫోన్‌ ద్వారా 35 మంది ఎమ్మెల్యేలు, న‌లుగురు ఎంపీలు, ఇద్దరు మంత్రులు టచ్‌లోకి వచ్చారు - కోటంరెడ్డి
X

ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి కళ్లు, చెవులు అయిన ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు.. ముఖ్యమంత్రి గానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గానీ చెప్పకుండా ఫోన్‌ ట్యాపింగ్‌ చేసే పరిస్థితి లేదన్నారు. ఒక రోజు తనకు ఫోన్ చేసిన సీతారామాంజనేయులు.. ''ఎక్కడున్నావని అడిగారు. నేను నెల్లూరులో ఉన్నా అని చెప్పా. అయ్యా... మీరంటే ముఖ్యమంత్రికి చాలా ఇష్టం. నాకు కూడా మీరంటే చాలా ఇష్టం. ఎందుకు అలా మాట్లాడుతున్నారు?'' అని ప్రశ్నించారని శ్రీధర్ రెడ్డి చెప్పారు.

తప్పేముంది.. జిల్లా పరిషత్ మీటింగ్‌లో ఏం మాట్లాడానో.. ముఖ్యమంత్రి పిలిచినప్పుడు ఏం మాట్లాడానో అదే మాట్లాడా.. తానేమీ ఇతర పార్టీ వాళ్లతో మాట్లాడలేదు కదా అని ప్రశ్నించానన్నారు. తాజాగా బయటకు వచ్చిన ఆడియో ముమ్మాటికి ట్యాపింగ్ రికార్డేనన్నారు. దొంగచాటుగా తన సంభాషణను విన్నారని ఆరోపించారు. అన్ని వ్యవస్థలు చేతుల్లో ఉన్న ప్రభుత్వం త‌న ఫోన్లు ట్యాప్ చేయ‌లేద‌ని నిరూపించాలని డిమాండ్ చేశారు.

మంత్రులు, హైకోర్టు చీఫ్ జస్టిస్, న్యాయమూర్తులు, ఐపీఎస్‌లు, ఐఏఎస్‌లు, మీడియా యాజమాన్యాలు, మీడియా ప్రతినిధులు ఇలా అందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని కోటంరెడ్డి ఆరోపించారు. ఒక సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగిపై యాజమాన్యం ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఏ ఉద్యోగి అయినా ఒక క్షణమైన ఆ సంస్థలో ఉంటారా..? అని ప్రశ్నించారు. తనను అవమానించిన చోట ఇక ఉండదలుచుకోలేదన్నారు.

మూడు తరాలుగా ఆ కుటుంబంతో ఉన్నా, జగన్‌ కష్టకాలంలో ఆయన వెంట ఉన్నా, అలాంటి తన ఫోన్ ట్యాపింగ్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. నమ్మకం లేని చోట ఎందుకు ఉండాలని నిలదీశారు. ట్యాపింగ్ చేసిన ఆడియో టేపు ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులుకు చెందిన 98499 66000 నెంబర్‌ నుంచే తనకు వచ్చిందన్నారు. ట్యాపింగ్‌పై కేంద్ర హోంశాఖకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తున్నట్టు చెప్పారు. తన ప్రశ్నలకు జగన్‌ మోహన్ రెడ్డి తరపున బాలినేని గానీ, సజ్జల గానీ సమాధానం చెప్పాలన్నారు. తమ ప్రభుత్వ పెద్దలే ఫోన్లు ట్యాప్ చేస్తుంటే ఎవరికి చెప్పుకోవాలన్నారు.

ఇష్టం లేని వారు వెళ్లిపోవచ్చని బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పారని.. ఆయన మాటలను జగన్‌ మాటలుగానే తాను భావిస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను వైసీపీ తరపున పోటీ చేయడం లేదన్నారు. అందుకు తన మనసు అంగీకరించడం లేదన్నారు. తన ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టుగానే మీ కుటుంబంలోని సభ్యుల ఫోన్లను ట్యాపింగ్‌ చేసి, దొంగచాటుగా ఆ సంభాషణలు వింటే మీ కాపురాలు నిలబడుతాయా అని కోటంరెడ్డి ప్రశ్నించారు.

ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే ఆ ఆడియో క్లిప్ స్వయంగా ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు దగ్గరి నుంచి ఎలా వచ్చిందని నిలదీశారు. ఆడియో టేపు ఉంటే సీఎంకు చూపించాలి గానీ.. నేరుగా తనకే పంపించి సీతారామాంజనేయులు ప్రశ్నించారంటే ఎవరిచ్చిన ధైర్యంతో ఆ పని చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం పెద్దల ఆదేశంతోనే తనను బ్లాక్‌మెయిల్ చేయడానికి, బెదిరించడానికే ఆడియో క్లిప్‌ తనకు పంపినట్టుగా భావిస్తున్నానన్నారు. కానీ, బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదన్నారు.

పార్టీ నుంచి మౌనంగానే వెళ్లిపోదామని అనుకున్నానని.. కానీ తనను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసి, రెచ్చగొట్టారని అందుకే ట్యాపింగ్‌ వ్యవహారం బయటపెట్టాల్సి వచ్చిందన్నారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి దగ్గరకు తన తమ్ముడు నేరుగా వెళ్లలేదని.. ఆయనే పిలిపించుకున్నారా? అన్నది తమకు తెలుసు, బాలినేనికి తెలుసు, పైన భగవంతుడికి తెలుసన్నారు.

టీడీపీ తరపున పోటీ చేయాలని ఉందని.. ఆ విషయాన్నే కార్యకర్తలకు చెప్పానన్నారు. పోటీపై తుది నిర్ణయం చంద్రబాబుదేనన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా 15 నెలల ముందే మాట్లాడితే ఎన్ని ఇబ్బందులు వస్తాయో తనకు తెలుసన్నారు. కానీ అన్నింటికి సిద్ధపడే మాట్లాడుతున్నానని వివరించారు. ఆఖరి వరకు ఉండి, ఆఖరిలో వెళ్లే రకం తాను కాదన్నారు.

ఇలాంటి ప్రెస్‌మీట్‌ పెట్టాల్సిన పరిస్థితి వస్తుందని తాను ఎన్నడూ ఊహించలేదన్నారు. తాను చెప్పిన మాటలు నమ్మినా నమ్మకపోయినా తనకు ఇబ్బంది లేదని.. నిన్నటి నుంచి 30 నుంచి 35 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు, ఇద్దరు మంత్రులు తనకు స్వయంగా ఫోన్ చేసి ట్యాపింగ్ నిజమే.. తమ ఫోన్లను ట్యాప్‌ చేస్తున్నారని చెప్పారని కోటంరెడ్డి వివరించారు. నువ్వు బయటపడ్డావ్.. మేం బయటపడలేకపోతున్నాం అన్నారని చెప్పారు. ఇంకా టైం ఉంది కదా ఎందుకు అప్పుడే తొందరపాటు అని కూడా కొందరు సలహా ఇచ్చారని కోటంరెడ్డి వివరించారు.

First Published:  1 Feb 2023 6:49 AM GMT
Next Story