Telugu Global
Andhra Pradesh

ముందు తమ్ముడు...తర్వాతే అన్నా?

వైసీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి తమ్ముడు గిరిధర్ రెడ్డి ఈనెల 24న టీడీపీలో చేరబోతున్నారు. అంటే ముందు తమ్ముడు పార్టీలో చేరి అన్న చేరిక కోసం మార్గం రెడీ చేస్తారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

ముందు తమ్ముడు...తర్వాతే అన్నా?
X

కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అంటే ఠక్కున అందరికీ గుర్తుకురాకపోవచ్చు. కానీ కోటంరెడ్డి శ్రీధరరెడ్డి అంటే మాత్రం అందరికీ గుర్తుకొస్తారు. వైసీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి తమ్ముడే గిరిధర్ రెడ్డి. ఈయన ఈనెల 24న తెలుగుదేశంపార్టీలో చేరబోతున్నారు. చంద్రబాబునాయుడు సమక్షంలో పసుపు కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధమైపోయింది. గిరిధర్‌ను పార్టీ నుండి జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ చేశారు. దాంతో వేరేదారిలేక గిరి టీడీపీలో చేరబోతున్నారు.

వైసీపీ సేవాదళ్ రాష్ట్ర విభాగానికి ఛైర్మన్‌గా కూడా గిరి పనిచేశారు. ఎప్పుడైతే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రెబల్‌గా మారారో అప్పటి నుండి గిరికి కూడా సమస్యలు మొదలయ్యాయి. ఎమ్మెల్యే స్థానంలో తమ్ముడినే నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా నియమించబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఏమైందో ఏమో గిరి స్థానంలో నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డి ఇన్‌చార్జితో పాటు ఏకంగా అభ్యర్థి కూడా అయిపోయారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే ఎమ్మెల్యే టీడీపీలో చేరటానికి రెడీగా ఉన్నారు

అయితే సీనియర్ తమ్ముళ్ళు చాలా మంది అడ్డుపడుతున్నట్లు సమాచారం. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీద రవిచంద్రయాదవ్, అబ్దుల్ అజీజ్ లాంటి సీనియర్ల కోటంరెడ్డిని చేర్చుకోవద్దని చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారట. చంద్రబాబు మాయలోపడే ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డిపై తిరుగుబాటు చేశారని మంత్రులు, నెల్లూరు జిల్లాలోని ఎమ్మెల్యేలు ఇప్పటికే చాలాసార్లు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హఠాత్తుగా తమ్ముడు గిరిధర్ టీడీపీలో చేరుతుండటం ఇంట్రెస్టింగ్‌గా ఉంది.

అంటే ముందు తమ్ముడు పార్టీలో చేరి అన్న చేరిక కోసం మార్గం రెడీ చేస్తారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అన్నంటే పడని తమ్ముళ్ళతో గిరిధర్ మాట్లాడి వ్యవహారం అంతా సెట్ చేస్తారనే ప్రచారం పెరిగిపోతోంది. ఎందుకంటే ఎమ్మెల్యేకి తమ్ముళ్ళల్లో ఎవరితోనూ పడదు. కారణం ఏమిటంటే వైసీపీలో బాగా హవా నడిచినపుడు తమ్ముళ్ళల్లో చాలామంది మీద కేసులు పెట్టి వేధించారట. అందుకనే కోటంరెడ్డిని పార్టీలో చేర్చుకోవటానికి ఎవరు ఇష్టపడటంలేదు. అందుకనే ముందు తమ్ముడు చేరి తమ్ముళ్ళలోని ఆగ్రహాన్ని తగ్గించి తర్వాత అన్నకోసం మార్గం సుగమం చేస్తారని చెప్పుకుంటున్నారు.

First Published:  17 March 2023 6:34 AM GMT
Next Story