Telugu Global
Andhra Pradesh

పురందేశ్వరి కాంగ్రెస్‌లో ఉందా..? లేక టీడీపీలో ఉందా..?

పురందేశ్వరి గతాన్ని చూస్తే.. టీడీపీలో ఉండి ఎన్టీఆర్‌ కు వెన్నుపోటు పొడిచిందని, కాంగ్రెస్‌ లో ఉండి కేంద్ర మంత్రి పదవి అనుభవించి, అధికారం పోయిందని వారినీ వదిలేసి బయటకు వచ్చిందని, ఆ తర్వాత బీజేపీలో బాబు ఆదేశాల మేరకు, బాబు ప్రయోజనాల కోసమే చేరిందని కొడాలి నాని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.

పురందేశ్వరి కాంగ్రెస్‌లో ఉందా..? లేక టీడీపీలో ఉందా..?
X

పురందేశ్వరి కాంగ్రెస్‌లో ఉందా..? లేక టీడీపీలో ఉందా..?

చంద్రబాబు వదిన పురందేశ్వరి ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉందా..? టీడీపీలో ఉందా..? అని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జగన్‌పై, విజయసాయిరెడ్డిపై ఉన్న కేసులను ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌కి పురందేశ్వరి ఒక లేఖ రాశారని టీడీపీ అనుకూల ప్రసార మాధ్యమాల్లో హడావుడి చేస్తున్నారన్నారు. అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలు రాజకీయ కక్ష సాధింపుగా జగన్‌ మీద, విజయసాయిరెడ్డి మీద పెట్టిన కేసుల్ని ఈరోజు కాకపోతే రేపు ఏ న్యాయస్థానం అయినా రాజకీయ కేసులే తప్ప, ఎలాంటి అధికార దుర్వినియోగం గానీ, అవినీతి గానీ జరగలేదని నిర్ధారిస్తాయని ఆయన స్పష్టం చేశారు. కాబట్టి, ఇలా చార్జిషీట్ల నంబర్లు వేసి హడావుడి చేసినంతమాత్రాన, ఇక్కడ బెదిరేవాళ్ళు ఎవరూ లేరని తెలిపారు.

అయితే.. చంద్రబాబు వదినను బీజేపీ రాష్ట్ర నాయకులే కొన్ని ప్రశ్నలు అడిగితే బాగుంటుందని కొడాలి నాని పేర్కొన్నారు. పురందేశ్వరి ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో ఉందా? లేక తెలుగుదేశం పార్టీలో ఉందా? అన్నది తేల్చాలని సూచించారు. ఎందుకంటే, ఆవిడ బీజేపీలో ఉన్నట్టు ఎక్కడా కనిపించడం లేదన్నారు. ఈ మాట ఎందుకు అంటున్నామంటే.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఎన్నికల బరిలోకి దింపవద్దని చంద్రబాబు చేసిన నిర్ణయానికి కారణం ఏమిటో స్వయంగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ వివరించారు.. అంటూ గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ పూర్తిగా కాంగ్రెస్‌ కు మద్దతు ఇస్తోందని చంద్రబాబు స్పష్టం చేసినందువల్లే, తాను ఇక టీడీపీలో ఉండబోనని కాసాని జ్ఞానేశ్వర్‌ ప్రకటించారని వివరించారు. అంటే దీని అర్థం ఏమిటో గుర్తించాలని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ వెనుక, కాంగ్రెస్‌ తోనూ ఉన్నది చంద్రబాబేనని అంత స్పష్టంగా కనిపిస్తుంటే.. తెలంగాణలో కాంగ్రెస్‌ తో పోరాడుతున్నాం, బీఆర్‌ఎస్‌ తో పోరాడుతున్నాం అంటున్న బీజేపీకి కాకుండా, పురందేశ్వరి టీడీపీకి మద్దతు ఇస్తున్నారని తెలిపారు. టీడీపీ అంటే కాంగ్రెసే కదా..? మరి పురందేశ్వరి కాంగ్రెస్‌లో ఉన్నట్టా? లేక టీడీపీలో ఉన్నట్టా? లేక బీజేపీలో ఉన్నట్టా అన్నది బీజేపీ వారే అర్థం చేసుకోవాలని హితవు పలికారు.

పురందేశ్వరి గతాన్ని చూస్తే.. టీడీపీలో ఉండి ఎన్టీఆర్‌ కు వెన్నుపోటు పొడిచిందని, కాంగ్రెస్‌ లో ఉండి కేంద్ర మంత్రి పదవి అనుభవించి, అధికారం పోయిందని వారినీ వదిలేసి బయటకు వచ్చిందని, ఆ తర్వాత బీజేపీలో బాబు ఆదేశాల మేరకు, బాబు ప్రయోజనాల కోసమే చేరిందని కొడాలి నాని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. అంటే దీని అర్థం పురందేశ్వరికి రాజకీయ విలువలు ఉన్నాయనా..? అవి ఏమాత్రం లేవనా..? అని ఆయన ప్రశ్నించారు. మరి ఇలాంటి మనిషి కాంగ్రెస్‌–టీడీపీ కలిసి జాయింట్‌ గా అప్పట్లో పెట్టిన కేసుల్ని, అది కూడా ఓదార్పు యాత్రకు వెళ్ళవద్దంటే, కొడుకుగా తన ధర్మం నెరవేర్చకుండా ఉండలేనని జగన్‌ ఓదార్పు యాత్రకు వెళ్ళినందుకు కాంగ్రెస్‌ పార్టీ టీడీపీతో కలిసి పెట్టిన కేసుల్ని ఇప్పుడు బీజేపీలో చేరిన పురందేశ్వరి ప్రస్తావిస్తున్నారంటే ఆమెకు ఎవరి మీద ప్రేమ ఉంది.. ఎవరి మీద కోపం ఉంది.. అని నిలదీశారు.

రేణుకా చౌదరి కాంగ్రెస్‌లో ఉన్నా.. పురందేశ్వరి బీజేపీలో ఉన్నా.. చంద్రబాబు ప్రయోజనాలు, చంద్రబాబు బృందం ప్రయోజనాలు కాపాడటంలో ముందుకు దూకుతున్నారంటే.. వీరి రాజకీయం ఎవరి కోసమని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు.

First Published:  4 Nov 2023 12:05 PM GMT
Next Story