Telugu Global
Andhra Pradesh

అలిగిన రాయదుర్గం కాపు..చూపు ఎటు వైపు..?

అధికార పార్టీలో కొన్ని శక్తులు తనను టార్గెట్ చేశాయని కాపు అనుమానిస్తున్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో కర్ణాటక మద్యం.. ఇసుక అక్రమ తరలింపుపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసు ఉన్నతాధికారులు లేనిపోని కేసులతో తన మనుషులను ఇబ్బందులు పెడుతున్నారని సన్నిహితుల వద్ద వాపోయారట.

అలిగిన రాయదుర్గం కాపు..చూపు ఎటు వైపు..?
X

రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలు వైసీపీలో కలకలం రేపుతున్నాయి. మంత్రి పదవి ఆశించిన రామచంద్రారెడ్డికి ప్రభుత్వ విప్ పదవి ఇచ్చిన నాటి నుంచీ అసంతృప్తిగా వున్నారని పార్టీలో టాక్ నడుస్తోంది. వైసీపీ జిల్లా అధ్యక్ష పదవి వదులుకున్న కాపు ఇప్పుడు తన గన్ మెన్లను వెనక్కి తిప్పి పంపడం చర్చనీయాంశం అయ్యింది. అల్లుడి ఆత్మహత్యతో బాగా కుంగిపోయిన రామచంద్రారెడ్డి పార్టీ బాధ్యతల నుంచి తప్పుకున్నారని అనుచరులు ప్రచారం చేశారు. అయితే రక్షణగా వున్న అంగరక్షకులను వద్దంటూ తిప్పి పంపడం మాత్రం ప్రభుత్వంపై నిరసన తెలపడమేనని వైసీపీ పెద్దలు ఆక్షేపిస్తున్నారు.

అయితే అధికార పార్టీలో కొన్ని శక్తులు తనను టార్గెట్ చేశాయని కాపు అనుమానిస్తున్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో కర్ణాటక మద్యం.. ఇసుక అక్రమ తరలింపుపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసు ఉన్నతాధికారులు లేనిపోని కేసులతో తన మనుషులను ఇబ్బందులు పెడుతున్నారని సన్నిహితుల వద్ద వాపోయారట. తన అనుచరగణాన్ని ఇబ్బందులు పెడుతున్న పోలీసు, సెబ్ అధికారులను బదిలీ చేయాలంటూ ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పట్టుబట్టడంతో ఉన్నతాధికారులు డైలమాలో పడ్డారు. కాపు డిమాండ్లను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లారని సమాచారం. పార్టీ అధిష్టానం మద్దతు కోసం ఇలా తన నిరసన తెలియజేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

మరోవైపు కాపు రామచంద్రారెడ్డి చూపు ఎటువైపు అన్న చర్చలు జోరందుకున్నాయి. అయితే కాపు రామ‌చంద్రారెడ్డి టిడిపిలో చేరలేడు. కాంగ్రెస్ ఉనికిలో లేదు. జనసేన కూడా కష్టమే. అయితే గియితే బీజేపీలో చేరేందుకు ఛాన్స్ ఉందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాపు రాంచంద్రారెడ్డి డిమాండ్లు నెరవేర్చి శాంతపరిచేందుకు అధిష్టానం ఏం చర్యలు తీసుకుంటుందో వేచిచూడాలి.

First Published:  19 Dec 2022 7:12 AM GMT
Next Story