Telugu Global
Andhra Pradesh

కట్లు, బెడ్లు, పరామర్శ..అంతా డ్రామానేనా..?

సీన్ కట్ చేస్తే.. 10 నిమిషాల పరామర్శ అయిపోయి చంద్రబాబు వెళ్ళిపోయారు. తమ అధినేత వెళ్ళిపోయిన కాసేపటికే బాధితులు కూడా ఆసుపత్రి నుండి వెళ్ళిపోయారట.

కట్లు, బెడ్లు, పరామర్శ..అంతా డ్రామానేనా..?
X

కుప్పంలో మూడు రోజుల చంద్రబాబు నాయుడు పర్యటనలో తాజాగా జ‌రిగిన ఓ విష‌యం బాగా హైలైట్ అవుతోంది. ఈ విషయాన్ని సాక్షి మీడియా బయటపెట్టింది. తన పర్యటన సందర్భంగా కుప్పంలో పోలీసులు టీడీపీ నేతలు, కార్యకర్తలను లాఠీలతో చితకబాదినట్లు చంద్రబాబు ఆవేశంతో ఊగిపోయిన విషయం తెలిసిందే. ఇదే విషయమై రోడ్డు మీదే పోలీసులతో పెద్దగా అరుస్తూ చంద్రబాబు గొడవపడ్డారు. తమ నేతలను లాఠీలతో కొట్టి చంపేస్తారా..? అంటూ మైకులోనే రెచ్చిపోయారు.

పోలీసులు కొట్టడం వల్ల ముగ్గురికి తలపైన బలమైన గాయాలయ్యాయని, కాళ్ళు, చేతులు విరిగిపోయాయన్నారు. ముగ్గురిలో ఒక మహిళ రోడ్డుపైనే స్పృహ తప్పిపడిపోయిందని నానా రచ్చచేశారు. తర్వాత తీవ్రంగా గాయపడిన ముగ్గురిని తమ నేతలే కుప్పం ఆసుపత్రిలో చేర్చినట్లు కూడా చెప్పారు. ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్న ముగ్గురిని గురువారం చంద్రబాబు పరామర్శించారు. వాళ్ళంతా చేతులకు కట్లు కట్టుకుని బెడ్ మీద లేవలేని స్ధితిలో పడుకునే చంద్రబాబుతో మాట్లాడారు. చంద్రబాబు కూడా వాళ్ళకి చాలా హామీలే ఇచ్చారు.

సీన్ కట్ చేస్తే.. పది నిమిషాల పరామర్శ అయిపోయి చంద్రబాబు వెళ్ళిపోయారు. తమ అధినేత వెళ్ళిపోయిన కాసేపటికే బాధితులు కూడా ఆసుపత్రి నుండి వెళ్ళిపోయారట. వెళ్ళేటప్పుడు చేతులకున్న కట్లను విప్పేసి వెళ్ళిపోయినట్లు సాక్షి మీడియా చెప్పింది. అంటే దెబ్బలు తినటం, స్పృహ తప్పిపడిపోవటం, తల, చేతులు, కాళ్ళకు గాయాలతో ఆసుపత్రిలో చేరటం, కట్లు కట్టించుకోవటం, చంద్రబాబు పరామర్శ అంతా డ్రామానే అని సదరు మీడియా చెబుతోంది.

చంద్రబాబు ఆసుపత్రికి వచ్చేసరికి బెడ్లపైన పడుకునున్న ముగ్గురు 10 నిమిషాల తర్వాత అడ్రస్ లేకుండా పోయారంటూ కొన్ని దృశ్యాలను చూపించింది. ఇప్పుడీ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు డ్రామా బట్టబయలైందంటూ ఆసుపత్రిలోని వీడియోలను ఈ మీడియా పదేపదే చూపిస్తోంది. అసలే టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ అని మంత్రులు, వైసీపీ నేతలు పదేపదే ఆరోపణలు గుప్పిస్తుంటారు. ఇలాంటి దృశ్యాలు మంత్రుల ఆరోపణలను నిజం చేసేట్లుగా ఉంటున్నాయి. ఆసుపత్రిలో చేరిన ముగ్గురు మరో రెండు రోజులు ఆక్కడే ఉండుంటే సరిపోయేది కదా.

First Published:  6 Jan 2023 6:05 AM GMT
Next Story