Telugu Global
Andhra Pradesh

క‌న్నా.. సున్నాగా మిగిలిపోతారా..?

తాజాగా గ‌న్న‌వ‌రం ఎపిసోడ్‌పై క‌న్నా స్పందిస్తూ.. ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. దీనిపై ఇప్పుడు వైఎస్సార్‌సీపీ మంత్రులు, నేత‌లు కౌంట‌ర్ల‌తో రియాక్ట‌వుతున్నారు.

క‌న్నా.. సున్నాగా మిగిలిపోతారా..?
X

క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌.. బీజేపీలో సీనియ‌ర్ లీడ‌ర్. నాలుగు సార్లు ప్ర‌జాక్షేత్రంలో గెలిచి.. మంత్రిగా ప‌నిచేసిన అనుభ‌వం. ఆంధ్ర‌ప్ర‌దేశ్ బీజేపీ అధ్య‌క్షుడిగా ప‌నిచేసిన నాయ‌కుడు. దాదాపు ప‌దేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న క‌న్నా.. ఇప్పుడు బీజేపీకి గుడ్‌బై చెప్పేశారు. త‌న బాట టీడీపీ వైపే అని తేల్చేశారు. ఇక అధికారికంగా పార్టీలో చేర‌డ‌మే త‌రువాయి. ఆ విష‌యాన్ని కూడా తాజాగా ఆయ‌న వెల్ల‌డించారు. ఈ నెల 23వ తేదీని అందుకు ముహూర్తంగా ప్ర‌క‌టించారు.


చంద్ర‌బాబు స‌మ‌క్షంలో టీడీపీలో చేరుతున్న‌ట్టు వెల్ల‌డించారు. ఇక‌ 2024 ఎన్నిక‌ల్లో ప్ర‌జాక్షేత్రంలో బ‌రిలోకి దిగేందుకు సై అంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో స‌త్తెన‌ప‌ల్లి నుంచి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ సీటు ఆశిస్తున్న‌ట్టు స‌మాచారం. రాబోయే రోజుల్లో క‌న్నా భ‌విష్య‌త్తు ఏమిట‌నేది అంద‌రిలోనూ ఆస‌క్తిక‌రంగా మారింది.

దాదాపు నాలుగు ద‌శాబ్దాలుగా రాజ‌కీయాల్లో కొన‌సాగుతున్న క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ ఐదుగురు ముఖ్య‌మంత్రుల వ‌ద్ద మంత్రిగా ప‌నిచేశారు. వైఎస్సార్‌, రోశ‌య్య‌, కిర‌ణ్‌కుమార్ రెడ్డిల క్యాబినెట్‌ల‌లో చ‌క్రం తిప్పారు. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో రాజ‌కీయ సందిగ్ధ‌త నెల‌కొన్న స‌మ‌యంలో కిర‌ణ్‌కుమార్ రెడ్డి స్థానంలో ముఖ్య‌మంత్రిగా అవ‌కాశ‌మిస్తార‌ని కూడా ఒక ద‌శ‌లో ప్ర‌చారం జ‌రిగింది.


రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం కాంగ్రెస్‌లో ఉంటే భ‌విష్య‌త్ ఉండ‌ద‌ని భావించిన బీజేపీలో చేరారు. ఆ త‌ర్వాత ఆయ‌న‌కు రాష్ట్ర అధ్య‌క్షుడి ప‌ద‌వి కూడా ద‌క్కింది. 2019 ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి ఏపీలో ఒక్క గెలుపు కూడా ల‌భించ‌లేదు. దీంతో రెండేళ్ల వ్య‌వ‌ధిలోనే ఆయ‌న ప‌ద‌వి పోయింది. పార్టీ ఓట‌మికి బాధ్యుడిని చేస్తూ ఆయ‌న్ని తొల‌గించి ఆ స్థానంలో సోము వీర్రాజుకు అధిష్టానం అవ‌కాశ‌మిచ్చింది. ఆ త‌ర్వాత సోముతో విభేదాల నేప‌థ్యంలో క‌న్నా బీజేపీకి తాజాగా రాంరాం చెప్పేశారు. టీడీపీలో చేరేట‌ప్పుడు త‌న‌తో పాటు 2 వేల మంది చోటామోటా కేడ‌ర్‌ను కూడా చేర్చుతాన‌ని ఆయ‌న ఇటీవ‌ల వెల్ల‌డించారు.

ఇదంతా ఒకెత్తు అయితే.. తాజాగా గ‌న్న‌వ‌రం ఎపిసోడ్‌పై క‌న్నా స్పందిస్తూ.. ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. దీనిపై ఇప్పుడు వైఎస్సార్‌సీపీ మంత్రులు, నేత‌లు కౌంట‌ర్ల‌తో రియాక్ట‌వుతున్నారు. క‌న్నా.. చంద్ర‌బాబు కోవ‌ర్టేన‌ని రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ విమ‌ర్శించారు. ఆయ‌న ప్లాన్‌లో భాగంగానే క‌న్నా బీజేపీలో చేరార‌ని ఆయ‌న తెలిపారు. క‌న్నా చంద్ర‌బాబు కోవ‌ర్టు కాబ‌ట్టే.. ఆయ‌న అధ్య‌క్ష ప‌ద‌విని బీజేపీ పీకేసింద‌ని ఆయ‌న ఆరోపించారు.

మ‌రోప‌క్క మంత్రి అమ‌ర్నాథ్ ఇందుకు భిన్న‌మైన వ్యాఖ్య‌లు చేశారు. క‌న్నాకు, చంద్ర‌బాబుకు మ‌ధ్య ఎప్ప‌టినుంచో విభేదాలు ఉన్నాయ‌ని, ఆ విష‌యం క‌న్నానే గ‌తంలో వెల్ల‌డించార‌ని ఆయ‌న గుర్తుచేశారు. భౌతికంగా త‌న‌ను ఎలిమినేట్ చేయాల‌ని చంద్ర‌బాబు ప్ర‌య‌త్నించార‌ని క‌న్నా చెప్పార‌ని ఆయ‌న వెల్ల‌డించారు. తిరిగి చంద్ర‌బాబు వ‌ద్ద‌కే వెళుతుండ‌టంలో ఉద్దేశ‌మేమిట‌నేది ఆయ‌న‌కే తెలియాల‌ని ఆయ‌న చెప్పారు. కానీ తెలుగుదేశంలోకి వెళితే క‌న్నా సున్నా కావ‌డం గ్యారెంటీ అని మాత్రం మంత్రి అమ‌ర్నాథ్ స్ప‌ష్టం చేశారు. ఇటువంటి క‌న్నాలు గానీ.. సున్నాలు గానీ త‌మ‌నేమీ చేయ‌లేవ‌ని ఆయ‌న తేల్చి చెప్పారు.

ఇదిలావుంటే.. ఈవీఎంల‌ను మ్యానిప్యులేట్ చేశార‌ని, అగ్రిగోల్డ్ బాధితుల‌ను అన్యాయం చేశార‌ని క‌న్నా గ‌తంలో చంద్ర‌బాబుపై ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే. అలాగే పోల‌వ‌రం ప్రాజెక్టును టూరిస్టు ప్లేసుగా మార్చేశార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. తిరుప‌తిలో అమిత్ షానే చంపించ‌బోయార‌ని తీవ్ర విమ‌ర్శ‌లు కూడా చేశారు. చంద్ర‌బాబుపై ఇలాంటి విమ‌ర్శ‌లు అనేకం చేశారు క‌న్నా. కానీ రాజ‌కీయాల్లో శ‌త్రుత్వం ప‌రిస్థితుల‌కు అనుగుణంగా మారిపోతుంద‌నేది రుజువు చేస్తూ క‌న్నా ఇప్పుడు ఆ పార్టీ గూటికే చేరుతుండ‌టం గ‌మ‌నార్హం.

ఇక‌పోతే కాపు కార్డు వాడుతున్న క‌న్నాపై అదే కార్డుతో ఎదురు దాడి చేస్తోంది అధికార పార్టీ. గ‌తంలో వంగ‌వీటి రంగాను చంపించింది చంద్ర‌బాబే అంటూ క‌న్నా చేసిన విమ‌ర్శ‌ల‌ను ఆ పార్టీ నేత‌లు గుర్తుచేస్తున్నారు. గుంటూరు మేయ‌ర్ కావ‌టి మ‌నోహ‌ర్‌నాయుడు ఈ విష‌యాన్ని గుర్తుచేస్తూ.. వంగ‌వీటి రంగా క‌త్తిపోట్ల‌కు గురై చ‌నిపోతే.. తాను బ‌తికి బ‌య‌ట‌ప‌డ్డాన‌ని గుడ్డ‌లు చించుకుని గొంతు చించుకున్న‌ది మీరు కాదా అంటూ క‌న్నాపై విమ‌ర్శ‌లు చేశారు.

First Published:  22 Feb 2023 3:13 AM GMT
Next Story