Telugu Global
Andhra Pradesh

ప్రభుత్వంపై ఏడవటం తప్ప వారికి వేరే పనేలేదు.. - మంత్రి బొత్స ఆగ్రహం

రాజధాని విషయంలో తమ పార్టీ విధానం ఎప్పుడో చెప్పామని, దానికే కట్టుబడి ఉన్నామని ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తున్నామని మంత్రి బొత్స తెలిపారు.

ప్రభుత్వంపై ఏడవటం తప్ప వారికి వేరే పనేలేదు.. - మంత్రి బొత్స ఆగ్రహం
X

రాష్ట్రంలో ప్రతిపక్షాల తీరుపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ఏడవటం తప్ప ప్రతిపక్షాలకు వేరే పని లేదని ఆయన మండిపడ్డారు. వైసీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒకటే చెబుతున్నారని.. తాము మంచి చేశామనుకుంటేనే మళ్లీ తమకు అవకాశమివ్వమని అంటున్నారని.. అలా అనడంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. బుధవారం విశాఖపట్నంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు.

రాజధాని విషయంలో తమ పార్టీ విధానం ఎప్పుడో చెప్పామని, దానికే కట్టుబడి ఉన్నామని ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తున్నామని మంత్రి బొత్స తెలిపారు. అయినా వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు వక్రీకరిస్తున్నాయని బొత్స మండిపడ్డారు. హైదరాబాదు నుంచి చంద్రబాబు అర్ధరాత్రి పారిపోయి వచ్చారు గనుకే నేడు రాజధాని లేని దుస్థితి నెలకొందని మంత్రి చెప్పారు. చంద్రబాబు పాపాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన తెలిపారు.

ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించిన నేపథ్యంలో ఇచ్చిన హామీలను సాధించడమే వైసీపీ స్టాండ్‌ అని మంత్రి బొత్స స్పష్టం చేశారు. తాము ప్రజలకు ఏం మేలు చేశామో అది చెప్పి ఓట్లు అడుగుతామని, ప్రతిపక్షాలు చేస్తున్నట్టు జిమ్మిక్కులు చేయాల్సిన అవసరం తమకు లేదని ఆయన చెప్పారు. చంద్రబాబుకు, పవన్‌కు ఈ రాష్ట్రంలో సొంత ఇల్లు కూడా లేదని, అయినా వారికి ఇక్కడ రాజకీయాలు కావాలని మంత్రి బొత్స ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిల విషయమై మంత్రి మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న బకాయిలు వచ్చే నెలలో ఇస్తామని చెప్పారు. దీనిపై ఉద్యోగులతో ఇప్పటికే చర్చలు జరిపామని వివరించారు.

First Published:  14 Feb 2024 10:47 AM GMT
Next Story