Telugu Global
Andhra Pradesh

బాబు నాటకంలో పవన్‌ది చిన్న పాత్ర - సజ్జల

చంద్రబాబుది కక్ష సాధింపు వైఖరని విమర్శించారు సజ్జల. ఏదైనా సవ్యంగా జరుగుతుంటే ఆయనకు నచ్చదన్నారు. ఆ వ్యవస్థపై వరుస కంప్లైంట్లు చేసి ఆపేదాకా నిద్రోపోరని చెప్పుకొచ్చారు.

బాబు నాటకంలో పవన్‌ది చిన్న పాత్ర - సజ్జల
X

చంద్రబాబు నాటకంలో జనసేన అధినేత పవన్‌ది చాలా చిన్న పాత్ర అన్నారు వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. కూటమిలో ఉన్నవాళ్లంతా చంద్రబాబు మనుషులేనన్నారు. పవన్‌ కల్యాణ్‌ తాపత్రయమంతా చంద్రబాబు కోసమేనన్నారు సజ్జల. కాపుల ఓట్లు తెలుగుదేశం పార్టీకి గంపగుత్తగా వేయించాలనేదే పవన్ ప్రయత్నమన్నారు. చంద్రబాబుకు పవన్‌ ఎందుకు లొంగిపోయారో ప్రజలు ఆలోచించాలన్నారు.

2014లో ఇదే కూటమి పోటీ చేసిందని గుర్తు చేసిన సజ్జల.. అప్పుడు అధికారంలోకి వ‌చ్చి ప్రజలను ఎంత రాచిరంపాన పెట్టిందో అందరికీ గుర్తుంద‌న్నారు. 2014లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను చంద్రబాబు మోసం చేశారని గుర్తు చేశారు. కూటమి డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తుందనేది వాళ్లకు కోపం అన్నారు.

చంద్రబాబుది కక్ష సాధింపు వైఖరని విమర్శించారు సజ్జల. ఏదైనా సవ్యంగా జరుగుతుంటే ఆయనకు నచ్చదన్నారు. ఆ వ్యవస్థపై వరుస కంప్లైంట్లు చేసి ఆపేదాకా నిద్రోపోరని చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే 2 లక్షల 60 వేల మంది వాలంటీర్లను తప్పించారన్నారు. ఇప్పుడు అపవాదు తనపైకి రాకుండా వాలంటీర్లకు రూ.10 వేలు ఇస్తానంటూ చంద్రబాబు ఉపన్యాసాలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రతి నెల ఫస్ట్‌కే పెన్షన్‌లు ఇచ్చే సంస్కరణ తీసుకువచ్చింది జగనేనన్నారు సజ్జల. అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజలను భ్రమల్లో పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు.

First Published:  24 April 2024 12:05 PM GMT
Next Story