Telugu Global
Andhra Pradesh

ఉద్యోగులు రెడీ అవ్వాల్సిందేనా..?

ఉద్యోగులు విశాఖకు కదలటానికి సిద్ధంగా ఉండాలని సజ్జల చెప్పటం వల్ల ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. సచివాలయంలో సుమారు 3 వేలమంది పనిచేస్తున్నారు.

ఉద్యోగులు రెడీ అవ్వాల్సిందేనా..?
X

'పరిపాలనా రాజధానిగా మారబోయే విశాఖపట్ట‌ణానికి కదిలేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉండాలి'.. ఇది తాజాగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్య. పరిపాలనా రాజధాని విశాఖపట్ట‌ణానికి వెళ్ళడం ఖాయమన్నారు. కోర్టులో చిన్నచిన్న సమస్యలు పరిష్కారం కాగానే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్ వెళ్ళిపోతుందన్నారు. పలానా సమయంలో వెళుతుందని చెప్పలేం కానీ, ఏ రోజైనా వెళ్ళిపోవచ్చని మాత్రం చెప్పారు.

సజ్జల మాటలు వింటుంటే.. తొందరలోనే విశాఖ నుంచి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మొదలవుతుందని అర్థ‌మవుతోంది. దీపావళి పండుగ తర్వాత నవంబర్‌లోనే జగన్మోహన్ రెడ్డి విశాఖకు వెళ్లిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రా యూనివర్సిటీలో భవనాలు రెడీ అవుతున్నట్లు సమాచారం. రెండు కొత్త భవనాలతో పాటు మరో మూడు పాత భవనాలను సెక్రటేరియట్ కోసం రెడీ చేస్తున్నారట.

ఉద్యోగులు విశాఖకు కదలటానికి సిద్ధంగా ఉండాలని సజ్జల చెప్పటం వల్ల ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. సచివాలయంలో సుమారు 3 వేలమంది పనిచేస్తున్నారు. వీరిలో ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖకు ఎంతమంది వెళ్ళాలనే విషయమై అంచనాలు రెడీ అవుతున్నాయి. అసెంబ్లీ ఉద్యోగులు మాత్రం అమరావతిలోనే కంటిన్యూ అవుతారు. ఇక కర్నూలులో హైకోర్టు ఏర్పాటైతే న్యాయవిభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులంతా కర్నూలుకు వెళ్ళక తప్పదు. అంటే సచివాలయం, న్యాయశాఖ ఉద్యోగులకు మళ్ళీ స్ధానచలనం తప్పేట్లులేదు. హైదరాబాద్ నుండి అమరావతికి వచ్చే సమయంలోనే ఉద్యోగులు చాలామంది చాలా ఇబ్బందులు పడ్డారు. మళ్ళీ ఇప్పుడు అమరావతి నుంచి వైజాగ్ అంటే మళ్ళీ కష్టాలు తప్పేట్లులేదు.

భార్య, భర్తలు ఉద్యోగులైతే చెరోచోటా పనిచేయాల్సిరావటం, రిటైర్మెంటుకు దగ్గరలో ఉన్న ఉద్యోగులకైతే మరీ సమస్యే. రిటైర్మెంట్ వయసులో భార్య ఒకచోట భర్త మరోచోట పనిచేయాలంటే కష్టమే. పిల్లల చదువులు కూడా ఇబ్బందుల్లో పడతాయి. ఉద్యోగుల్లో చాలా మంది ఇప్పుడు అమరావతి-హైదరాబాద్ మధ్య తిరుగుతున్నారు. అలాంటిది ఇకనుండి వైజాగ్-హైదరాబాద్ మధ్య తిరగాల్సుంటుంది. ఏదేమైనా కదలటానికి ఉద్యోగులంతా రెడీగా ఉండాలని సజ్జల చెప్పినంత తేలిక్కాదు ఉద్యోగులు రెడీ అవ్వటం. అమరావతి, విజయవాడతో పోల్చుకుంటే వైజాగ్ కాస్టాఫ్ లివింగ్ చాలా ఎక్కువ. మరి ఉద్యోగుల స్పందన ఎలాగుంటుందో చూడాల్సిందే.

First Published:  22 Oct 2022 7:03 AM GMT
Next Story