Telugu Global
Andhra Pradesh

జగన్ ఆరున్న‌ర‌ లక్షల ఉద్యోగాలు ఇచ్చింది కనపడటం లేదా..?

చంద్రబాబుకు దీర్ఘకాలిక మద్దతు ఇస్తామని పవన్‌ అంటున్నారని, అలాంటప్పుడు సొంతంగా పార్టీ పెట్టుకోవడం ఎందుకని సజ్జల ప్రశ్నించారు. పవన్‌ వెనుక ఉన్నవారు చంద్రబాబుని సీఎం చేయాలని ఎందుకు అనుకుంటారని నిలదీశారు.

జగన్ ఆరున్న‌ర‌ లక్షల ఉద్యోగాలు ఇచ్చింది కనపడటం లేదా..?
X

టీడీపీ అధినేత చంద్రబాబు స్థాయి దారుణంగా దిగజారిపోయిందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల తెలిపారు. యువగళం యాత్ర ముగింపు సందర్భంగా లోకేష్‌కి హైప్‌ తీసుకురావడానికి నానా తంటాలు పడిన చంద్రబాబు.. చివరికి తమ సభకు జనం రారనే విషయం అర్థమై.. పవన్ క‌ల్యాణ్‌ ఇంటికి వెళ్లి మరీ బతిమాలుకొని తమ సభకు రప్పించుకున్నారన్నారు. తాడేపల్లిలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు తన హయాంలో ఏం చేశారో చెప్పాలని సవాల్‌ చేశారు. చంద్రబాబు ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు. 2014–19 మధ్య చంద్రబాబు పాలనలో ఏం జ‌రిగిందో ప్రజలకు తెలుసని సజ్జల గుర్తుచేశారు.

చంద్రబాబుకు దీర్ఘకాలిక మద్దతు ఇస్తామని పవన్‌ అంటున్నారని, అలాంటప్పుడు సొంతంగా పార్టీ పెట్టుకోవడం ఎందుకని సజ్జల ప్రశ్నించారు. పవన్‌ వెనుక ఉన్నవారు చంద్రబాబుని సీఎం చేయాలని ఎందుకు అనుకుంటారని నిలదీశారు. పవన్, చంద్రబాబు మధ్య అప్పట్లో ఎందుకు గ్యాప్‌ వచ్చింది.. ఆ తర్వాత వారి మధ్య ఎలాంటి ఒప్పందం కుదిరిందనే విషయాన్ని ప్రజలకు చెప్పాలని సజ్జల డిమాండ్‌ చేశారు. పవన్, చంద్రబాబుకు ఏపీలో అడ్రస్‌ లేదని, వారికి సపోర్టు చేసే మీడియా అధినేతలు కూడా వేరే రాష్ట్రంలో కూర్చుని ప్ర‌భుత్వంపై రాళ్లు వేస్తున్నారని విమర్శించారు.



సీఎం జగన్‌ హయాంలో సచివాలయాల్లో చేసిన నియామకాలు, మెడికల్‌ విభాగాల్లో ఇచ్చినవి ఉద్యోగాలు కావా? అని సజ్జల ప్రశ్నించారు. ఆరున్నర లక్షలకు పైగా ఉద్యోగాలు జగన్‌ హయాంలో ఇచ్చిన విషయం కనపడటం లేదా అని నిలదీశారు. కొత్త ప్రాజెక్టులు పెద్ద ఎత్తున వస్తున్నాయని, ఆ విషయం కనిపించడం లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో ప్రజలకు ఏం చేశారో చెప్పమంటే ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. టీడీపీని ఎన్టీఆర్‌ నుంచి లాక్కున్నారని, పవన్‌కి ఎదురు డబ్బు ఇచ్చి తెచ్చుకున్నారని, మీ స్వార్థం కోసమే ఇవి చేశారు తప్ప.. ప్రజలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు.

సీఎం వైఎస్‌ జగన్‌ ప్రజలకు మంచి చేయాలనే తపనతో ముందుకెళుతున్నారని సజ్జల చెప్పారు. నాలుగున్నరేళ్లపాటు సంక్షేమ పాలన అందించారని అందుకే ప్రజల గుండెల్లో కొలువై ఉన్నారని తెలిపారు. ప్రజలంద‌రూ జగనే మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నారని సజ్జల వివరించారు.

First Published:  21 Dec 2023 11:18 AM GMT
Next Story