Telugu Global
Andhra Pradesh

దొంగతనం చేసి.. సానుభూతి కోరుకుంటున్నారు..

చంద్రబాబు అరెస్టుపై వారు ఐక్యరాజ్య సమితికి వినతిపత్రం ఇచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదని ఈ సందర్భంగా ఆయన ఎద్దేవా చేశారు.

దొంగతనం చేసి.. సానుభూతి కోరుకుంటున్నారు..
X

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు నాయుడుకు మద్దతు కూడగట్టేందుకు, ఆయనకు సానుభూతి రాబట్టేందుకు తెలుగుదేశం పార్టీ, ఎల్లో మీడియా చేయని ప్రయత్నాలంటూ లేవని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. అయితే వారు దొంగతనం చేసి సానుభూతి కోరుకుంటున్నారని గుర్తుచేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తప్పు జరిగిందని న్యాయస్థానాల్లో తేలడం వల్లే రిమాండ్‌ విధించారని.. అయినా చంద్రబాబుకు అన్యాయం జరిగిపోతోందంటూ రాష్ట్రపతికి వినతిపత్రం ఇచ్చారని విమర్శించారు. చంద్రబాబు అరెస్టుపై వారు ఐక్యరాజ్య సమితికి వినతిపత్రం ఇచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదని ఈ సందర్భంగా ఆయన ఎద్దేవా చేశారు. ఈ సానుభూతి ప్రచారాల వల్ల అసలు విషయం పక్కకు పోవాలని వారు పరితపిస్తున్నట్టు ఉందని సజ్జల తెలిపారు.

ఒక్క చంద్రబాబు లక్ష మంది గోబెల్స్‌కి సమానం..

చంద్రబాబుకు సంబంధించిన అన్ని కేసుల్లోనూ ఆధారాలు పక్కాగా ఉన్నాయని సజ్జల స్పష్టంచేశారు. ఒక వ్యక్తి దిగంబరంగా కనిపిస్తున్నా కూడా.. అతడి ఒంటిపై బట్టలు ఉన్నాయని వాదించగల నేర్పరితనం చంద్రబాబుకు, ఆయన అనుకూల మీడియాకూ సొంతం అని సజ్జల ఎద్దేవా చేశారు. ఎప్పుడు ఏ పార్టీతో పొత్తుపెట్టుకున్నా అది చారిత్రక అవసరం అని నమ్మబలికే బ్యాచ్‌ ఇదని ఆయన మండిపడ్డారు. ఇక అమరావతి అనే మహా కుంభకోణంలో.. అసైన్డ్‌ ల్యాండ్స్, ఇన్నర్‌ రింగు రోడ్డు అలైన్‌మెంట్, ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌ వంటివన్నీ చిన్న చిన్న స్కాములని సజ్జల వివరించారు. ఈ కేసుల్లో చంద్రబాబే సూత్రధారి అని ఆయన తెలిపారు. నారాయణ, గంటా సుబ్బారావు మొదలైన వారంతా ఇందులో పాత్రధారులని చెప్పారు.

First Published:  30 Sep 2023 2:30 AM GMT
Next Story