Telugu Global
Andhra Pradesh

కొడాలి నాని మళ్లీ సెటైర్లు.. మామూలుగా లేవుగా..

2 శాతం హెరిటేజ్‌ షేర్లు అమ్మితే కోట్లు వస్తాయని భువనేశ్వరి అంటున్నారని, హెరిటేజ్‌ షేర్లు అమ్మి ప్రజలకు డబ్బులేమైనా పంచుతారా అని ప్రశ్నించారు.

కొడాలి నాని మళ్లీ సెటైర్లు.. మామూలుగా లేవుగా..
X

టీడీపీ అధినేత చంద్రబాబుపై, ఆయన కుమారుడు లోకేశ్‌పై మాజీ మంత్రి కొడాలి నాని వేసే సెటైర్లు, పంచ్‌లు మామూలుగా ఉండవు. ఈసారి కూడా ఆయన ఏమాత్రం త‌గ్గ‌లేదు. విజయవాడలో మంగళవారం కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ యువగళం పాదయాత్రలో భాగంగా నారా లోకేశ్‌.. తెలుగు తమ్ముళ్లకి ఇచ్చిన పిలుపును గుర్తుచేశారు. ఎన్ని కేసులుంటే అంత పెద్ద పదవి అని చెప్పిన లోకేశ్‌.. తన తండ్రి జైలుకెళ్తే ఎందుకు ఏడుస్తున్నాడని ప్ర‌శ్నించారు. చంద్రబాబుకు పెద్ద పదవి వద్దా అంటూ ఎద్దేవా చేశారు. అలాగే.. లోకేశ్‌ తమ పేర్లు రెడ్‌ బుక్‌లో రాస్తున్నాడని, తాము మాత్రం లోకేశ్‌ పేరును చిత్తు కాగితాల్లో కూడా రాయమని చెప్పారు.

ఇంకో పక్క 2 శాతం హెరిటేజ్‌ షేర్లు అమ్మితే కోట్లు వస్తాయని భువనేశ్వరి అంటున్నారని, హెరిటేజ్‌ షేర్లు అమ్మి ప్రజలకు డబ్బులేమైనా పంచుతారా అని ప్రశ్నించారు. తన భర్తకు వసతుల్లేవు. వేడి నీళ్లు లేవని భువనేశ్వరి అంటున్నారని, ఏసీలు, ఫ్రిజ్‌లు, కూలర్లు ఉండటానికి అదేం ఇల్లు కాదని.. జైలని గుర్తుచేశారు. జైల్లో ఉంటే దోమలు కుట్టక.. రంభ, ఊర్వశి, మేనకలు కన్ను కొడతారా అని ఈ సందర్భంగా కొడాలి నాని ఎద్దేవా చేశారు. జైల్లో ఏమైనా వసతులు కావాలంటే కోర్టును అడగాలని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.

చంద్రబాబు అరెస్టుతో లోకేశ్‌ తిరునాళ్లలో తప్పిపోయిన పిల్లాడిలా బిత్తర చూపులు చూశాడని కొడాలి నాని ఎద్దేవా చేశారు. కొట్టండి, జైల్లో పెట్టండి, నిరూపించడండి అన్న లోకేశ్‌.. ఇప్పుడు బెయిల్‌ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడని విమర్శించారు. ఆడెవడో స్టార్‌ వస్తే లోకేశ్‌ అన్నయ్య అంటాడని, ఓ పక్కన అన్నయ్యను, మరో పక్క మామయ్యను పెట్టుకుని ఏదో చేద్దామని లోకేశ్‌ అనుకుంటున్నాడని కొడాలి నాని అన్నారు.

చంద్రబాబు ఏదో అరెస్ట్‌ అయ్యాడూ.. దానిపై ఎదోటి మాట్లాడమని పక్క రాష్ట్రం నేతలను

బతిమాలుతున్నారని కొడాలి నాని ఎద్దేవా చేశారు. అందుకే కొంతమంది ట్వీట్లు పెడుతున్నారని చెప్పారు. బాబుతో నేను అంటూ కార్యక్రమాలు చేసేవాళ్లు.. బాబుతో పాటు జైలుకెళ్తారా అని నిలదీశారు. చంద్రబాబు కోసం ఎవరూ పాదయాత్రలు చేయరు.. కార్ల యాత్రలు చేస్తారని నాని చెప్పారు. చంద్రబాబు కోసం యాత్రలు చేసేది కమ్మ కులస్తులు మాత్రమేనని, తమ వారికే కార్లు ఎక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు. పొరుగు దేశాలు.. రాష్ట్రాల్లో బీసీ, ఎస్సీలేమైనా నిరసనలు చేస్తున్నారా అని ఈ సందర్భంగా నాని ప్రశ్నించారు.

First Published:  26 Sep 2023 12:39 PM GMT
Next Story