Telugu Global
Andhra Pradesh

పాదయాత్ర దారిలో మూడు రాజధానుల ఫ్లెక్సీలు

అన్ని మన దగ్గరే ఉండాలంటూ బూతులు తిడుతూ యాత్రలు చేస్తే అది దుర్మార్గం అవుతుంది.. మూడు రాజధానులకు స్వాగతిస్తే అది నిజమైన త్యాగమవుతుందంటూ ఫ్లెక్సీలపై రాశారు.

పాదయాత్ర దారిలో మూడు రాజధానుల ఫ్లెక్సీలు
X

గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలో వెలిసిన ఫ్లెక్సీలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. అమరావతివాదుల పాదయాత్ర సాగుతున్న దారి పొడవున వీటిని ఏర్పాటు చేశారు. మూడు రాజధానులకు మద్దతుగా ఫ్లెక్సీలు వెలిశాయి. ఒకటే రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు అంటూ పలు స్లోగన్ల‌తో వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఉన్న కారుమూరు వెంకటరెడ్డి పేరుతో ఈ ఫ్లెక్సీలు వెలిశాయి.

''హైదరాబాద్ కేంద్రీకరణతో తెలుగుజాతి రెండు ముక్కలు.. అమరావతి అత్యాశతో మరో మూడు ముక్కలు కానిద్దామా?''... ''29 గ్రామాలతో మనం మాత్రమే బాగుపడుదామా?- 26 జిల్లాల అభివృద్ధితో తెలుగు జాతిని నిలబెడుదామా?''...


''హైదరాబాద్ నుంచి గెంటేశారు- అమరావతి నిర్మితం అయ్యాక వీరు గెంటేయరన్న గ్యారెంటీ ఏంటి?- సీమ, ఉత్తరాంధ్ర సంధిస్తున్న ఈ ప్రశ్నకు ఏం సమాధానం చెబుదాం?''... ''నీటి కింద నేల కనిపించని శ్రీశైలం, పోలవరం రైతులది త్యాగమా?- శాసన రాజధానిలో ఉండబోతున్న మనది పెద్ద త్యాగమా?''...

''పక్క ఊరోడికీ జాగా లేదంటాం- అమరావతికి జాతి మొత్తం మద్దతివ్వాలంటాం?-ఇదెక్కడి న్యాయం?''... ''లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఒకేచోట కొత్త నగరం కడదామా? .. ఉన్న నగరాలకు కొంచెం డబ్బు ఖర్చు పెట్టి పెద్ద నగరాలుగా మార్చుకుందామా? '' అంటూ అమరావతివాదులను ప్రశ్నిస్తూ ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

అన్ని మన దగ్గరే ఉండాలంటూ బూతులు తిడుతూ యాత్రలు చేస్తే అది దుర్మార్గం అవుతుంది.. మూడు రాజధానులకు స్వాగతిస్తే అది నిజమైన త్యాగమవుతుందంటూ ఫ్లెక్సీలపై రాశారు. ఈ ఫ్లెక్సీల పట్ల పాదయాత్ర సమయంలో అమరావతి వాదులు ఎలా స్పందిస్తారో చూడాలి.

First Published:  15 Sep 2022 6:47 AM GMT
Next Story