Telugu Global
Andhra Pradesh

బోండా ఉమా.. నీ పెంపకంతో సహా అన్నీ చెబుతా.. - దేవినేని అవినాష్

ఇందుకు స్పందించిన అవినాష్.. బోండా ఉమా ఒక చిల్లరగాడు అంటూ ఫైర్ అయ్యారు. బోండా గురించి గానీ, అతడి పిల్లల పెంపకం గురించి గానీ చెప్పాలంటే చాలా ఉందన్నారు.

బోండా ఉమా.. నీ పెంపకంతో సహా అన్నీ చెబుతా.. - దేవినేని అవినాష్
X

టీడీపీ నేత బోండా ఉమా చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత దేవినేని అవినాష్ తీవ్రంగా స్పందించారు. రంగా చనిపోయిన సమయంలో దేవినేని నెహ్రూ అక్కడే ఉన్నారని బోండా ఉమా ఆరోపించారు. రంగా హత్యలో ప్రధాన నిందితుడిగా ఉన్న నెహ్రూ కుమారుడు అవినాష్ ఇప్పుడు ఏం పార్టీలో ఉన్నారని బోండా నిలదీశారు. రంగా హత్య జరిగినప్పుడు కొడాలి నాని కూడా నెహ్రూ దొడ్డిలో ఉన్నారంటూ వ్యాఖ్యానించారు.

దేవినేని నెహ్రూను కాంగ్రెస్‌లోకి తెచ్చి హైదరాబాద్‌లో వేల కోట్ల విలువైన భూములను ఇచ్చారని విమర్శించారు. ఇప్పుడు జగన్‌ కూడా దేవినేని అవినాష్‌ను దగ్గర పెట్టుకుని సెటిల్‌మెంట్లు చేయిస్తున్నారని.. వీరికి కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వారు వంతపాడుతున్నారని విమర్శించారు. రంగా వర్ధంతిని ఏ సామాజికవర్గం నిర్వహించాలో చెప్పడానికి కొడాలి నాని ఎవరని ప్రశ్నించారు బోండా.

ఇందుకు స్పందించిన అవినాష్.. బోండా ఉమా ఒక చిల్లరగాడు అంటూ ఫైర్ అయ్యారు. బోండా గురించి గానీ, అతడి పిల్లల పెంపకం గురించి గానీ చెప్పాలంటే చాలా ఉందన్నారు. తిరుపతిలో సారా వ్యాపారం చేసిన‌ వ్యక్తి బోండా ఉమా అని ఫైర్ అయ్యారు. కోగంటి సత్యం దగ్గర డైవర్‌గా చేరి, వారికి టీలు అందిస్తూ చివరకు వారికే మోసం చేసిన చరిత్ర బోండా ఉమాది అని విమర్శించారు. టీడీపీ హయాంలో భూములు కబ్జా చేశారన్నారు.

విజయవాడకు బైక్‌ రేసులు, కారు రేసులను తెచ్చిన వ్యక్తి బోండా ఉమా కుమారుడు అని విమర్శించారు. భవానీపురంలో ఉన్న సొంత హోటల్‌లో అమ్మాయిలను తెచ్చి బోండా ఉమా వ్యవహారాలు నడిపింది నిజం కాదా అని ప్రశ్నించారు. బోండా ఉమా లాంటి చిల్లర నాయకులను చంద్రబాబు తప్ప మరెవరూ ప్రోత్సహించరన్నారు. రంగా హత్యలో దేవినేని నెహ్రూకు ఎలాంటి సంబంధం లేదని కోర్టులోనే నిర్ధారణ అయిందన్నారు. చనిపోయిన తన తండ్రి పేరును పదేపదే ప్రస్తావిస్తే పరువు నష్టం దావా వేస్తానన్నారు.

Next Story