Telugu Global
Andhra Pradesh

జనసేనను పసుపు సేనగా చేయాలనుకుంటున్నాడు

ప్యాకేజీ ఉంటేనే పవన్‌ కల్యాణ్‌ రాష్ట్రం వైపు చూస్తాడని, ప్యాకేజీ లేకుంటే ఇటువైపు కన్నెత్తి కూడా చూడడని పోతిన మహేష్‌ విమర్శించారు.

జనసేనను పసుపు సేనగా చేయాలనుకుంటున్నాడు
X

పవన్‌ కల్యాణ్‌ కాపులను చంద్రబాబుకు ఓటు బ్యాంకుగా మార్చి జనసేనను పసుపు సేనగా చేయాలనుకుంటున్నాడని వైసీపీ నేత, జనసేన మాజీ లీడ‌ర్‌ పోతిన మహేష్‌ విమర్శించారు. అందుకే చంద్రబాబు ఇంటిముందు కట్టిపడేసిన కుక్కలా విశ్వాసం చూపెడుతున్నాడే తప్ప.. పవన్‌ ఏరోజూ కాపులకు మేలుచేసేలా మాట్లాడలేదని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కాపులను నిలువునా మోసం చేసింది పవన్, చంద్రబాబేనని, వాళ్లిద్దరినీ రాజకీయాల నుంచి తరిమిస్తేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్యాకేజీ ఉంటేనే రాష్ట్రం వైపు చూస్తాడు..

ప్యాకేజీ ఉంటేనే పవన్‌ కల్యాణ్‌ రాష్ట్రం వైపు చూస్తాడని, ప్యాకేజీ లేకుంటే ఇటువైపు కన్నెత్తి కూడా చూడడని పోతిన మహేష్‌ విమర్శించారు. పవన్‌ వారాహి ఎక్కి చంద్రబాబుకు భజన చేయడం, బాకా ఊదడమే పనిగా పెట్టుకున్నాడని, టీడీపీ పల్లకీ మోయడానికి ఎందుకంత శ్రమిస్తున్నాడని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. దీనికి వెనుకనున్న రహస్యం, కారణాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత పవన్‌పై ఉందన్నారు. కాపుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన పవన్‌ తీరుకు కాపు సామాజికవర్గం తీవ్రంగా కలత చెందుతోందని చెప్పారు. ఆయన ఎదగడు. కాపుల్లో ఏ ఒక్కరినీ ఎదగనీయడని మండిపడ్డారు. పవన్‌ తీరుతో కాపు సామాజికవర్గం తీవ్రంగా నష్ట పోతోందన్నారు. ఆత్మగౌరవం దెబ్బతింటోందని చెప్పారు.

పవన్‌ జీవితంలో ఏదీ పర్మినెంట్‌ కాదు..

పవన్‌ జీవితంలో ఏదీ పర్మినెంట్‌ కాదని, అన్నీ టెంపరరీనే అని పోతిన మహేష్‌ విమర్శించారు. కాకినాడ ఎంపీ అభ్యర్థి ఉదయ్‌ శ్రీనివాస్‌ ఇంజినీరింగ్‌ చదవలేదని, ఆయనపై ఎన్నో లుకౌట్‌ నోటీసులున్నాయని, విదేశాల్లో చాలా మోసాలు చేశారని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతున్నా పవన్‌ ఎందుకు స్పందించడం లేదని ఆయన నిలదీశారు. విదేశాల్లో మోసాలు చేసి లుకౌట్‌ నోటీసులున్న వ్యక్తిని పక్కనబెట్టుకుని ప్రజల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు.. అంటూ ధ్వజమెత్తారు. జనసేనను వీడిన వారంతా కాపులేనని, జనసేన పార్టీని కాపులు మాత్రమే వదిలిపోవడానికి కార ణమేంటని ప్రశ్నించారు. ఒకరిద్దరు కాదు.. పదుల సంఖ్యలో కీలకంగా పనిచేసిన కాపు నాయకులు ఎందుకు పార్టీని వీడాల్సి వచ్చిందని నిలదీశారు.

కాపులకు మేలు చేసింది వైసీపీ ప్రభుత్వమే...

కాపులకు మేలు చేసింది వైసీపీ ప్రభుత్వమేనని పోతిన మహేష్‌ స్పష్టం చేశారు. 2019 మేనిఫెస్టోలో ఏటా రూ.2 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో కాపుల కోసం రూ.10 వేల కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌.. ఆ హామీ కంటే మిన్నగా డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా రూ.34 వేల కోట్లు కాపుల కోసం ఖర్చు పెట్టారని ఆయన తెలిపారు. మీ దొంగ కూటమి కేటాయించిన సీట్ల కంటే ఎక్కువ సీట్లు కాపులకు కేటాయించారని చెప్పారు. కాపుల పట్ల సీఎం వైఎస్‌ జగన్‌కున్న చిత్తశుద్ధి గురించి ఇంతకంటే వేరే చెప్పనవసరం లేదన్నారు.

First Published:  30 April 2024 3:01 AM GMT
Next Story