Telugu Global
Andhra Pradesh

మిగిలిన ఎంపీ స్థానాల‌పై వైసీపీ ముమ్మ‌ర‌ క‌సర‌త్తు

ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌క‌టించిన 17 పార్ల‌మెంట్ స్థానాల్లో ఒక‌టి రెండు త‌ప్ప అన్నీ కొత్త ముఖాలే. అయితే ఇక మిగిలిన 8 స్థానాల్లో మాత్రం నాలుగింటిలో పాత‌వారికే అవ‌కాశాలివ్వ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

మిగిలిన ఎంపీ స్థానాల‌పై వైసీపీ ముమ్మ‌ర‌ క‌సర‌త్తు
X

ఆరు జాబితాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 17 లోక్‌స‌భ స్థానాల‌కు సమన్వ‌య‌క‌ర్త‌లను ప్ర‌క‌టించిన వైసీపీ అధిష్టానం మిగిలిన 8 స్థానాల‌పైనా క‌స‌ర‌త్తు ముమ్మ‌రం చేసింది. విజ‌య‌న‌గ‌రం, అన‌కాప‌ల్లి, ఒంగోలు, బాప‌ట్ల‌, నంద్యాల‌, క‌డ‌ప‌, రాజంపేట స్థానాల‌కు అభ్య‌ర్థుల ఎంపిక‌పై జ‌గ‌న్ స‌మీక‌ర‌ణాల‌న్నీ స‌రిచూసుకుంటున్నారు.

నాలుగు స్థానాల్లో పాత‌వారే!

ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌క‌టించిన 17 పార్ల‌మెంట్ స్థానాల్లో ఒక‌టి రెండు త‌ప్ప అన్నీ కొత్త ముఖాలే. అయితే ఇక మిగిలిన 8 స్థానాల్లో మాత్రం నాలుగింటిలో పాత‌వారికే అవ‌కాశాలివ్వ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్త‌రాంధ్ర‌లోని అన‌కాప‌ల్లిలో బొడ్డేప‌ల్లి స‌త్య‌వతి, విజ‌య‌న‌గ‌రంలో బెల్లాన చంద్ర‌శేఖ‌ర్‌ల‌కే మ‌ళ్లీ ఛాన్స్ ఇచ్చేందుకు అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తోంది. అలాగే క‌డ‌ప‌లో వైఎస్ అవినాష్‌రెడ్డికి, రాజంపేట‌లో సిట్టింగ్ ఎంపీ, మంత్రి పెద్దిరెడ్డి కుమారుడు మిథున్‌రెడ్డికి మ‌రో ఛాన్స్ ఇస్తార‌ని వైసీపీ వ‌ర్గాల క‌థ‌నం.

ఒంగోలులో పీటముడి?

ఇక వైసీపీ అధిష్టానానికి కాస్త చిరాకు పెడుతున్న‌ది ఒంగోలు సీటు స్థాన‌మే. ఇక్క‌డ సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీ‌నివాసులు రెడ్డికి టికెట్ ఇవ్వ‌న‌ని జ‌గ‌న్ తేల్చిచెప్పేశారు. ప్ర‌త్యామ్నాయంగా త‌న కొడుకు ప్ర‌ణీత్‌రెడ్డికి టికెటిమ్మ‌ని ఎంపీ బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి అడిగినా జ‌గ‌న్ నో అన్నారు. చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డిని ఇక్కడ ఎంపీగా నిల‌బెట్టాల‌ని భావిస్తున్నారు. అయితే తాజాగా బాలినేని ఎంపీగా తానే పోటీ చేస్తాన‌ని అడుగుతుండ‌టంతో మళ్లీ పీట‌ముడి ప‌డిన‌ట్ల‌యింది. బాలినేని స్వయానా పార్టీ అధ్య‌క్షుడు జ‌గ‌న్‌కు దగ్గ‌ర బంధువు కావ‌డం, పార్టీ పెట్ట‌క‌ముందు నుంచి జ‌గ‌న్ వెన్నంటి ఉన్న విశ్వ‌స‌నీయ‌త ఆయ‌న విష‌యంలో పార్టీకి ఒక‌టికి రెండుసార్లు ఆలోచించుకునేలా చేస్తున్నాయంటున్నారు.

First Published:  4 Feb 2024 11:12 AM GMT
Next Story