Telugu Global
Andhra Pradesh

పీకే పేరుతో సర్వే ప్రచారం వెనుక వైసీపీ అనుమానం

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 100 స్థానాలలోపు వైసీపీ గెలుస్తుందని ప్రస్తుతానికి చెప్పి.. మరో ఆరు నెలల తర్వాత వైసీపీ గ్రాఫ్ మరింత పడిపోయిందంటూ, మరిన్ని సీట్లు తగ్గించి టీడీపీ మీడియానే పీకే పేరుతో మరో సర్వే రిపోర్టును ప్రచారం చేసే అవకాశం ఉంద‌ని వైసీసీ భావిస్తోంది.

పీకే పేరుతో సర్వే ప్రచారం వెనుక వైసీపీ అనుమానం
X

టీడీపీ అనుకూల మీడియా రెండు రోజులుగా ఒక సర్వేను బాగా ప్రచారం చేస్తోంది. ప్రశాంత్ కిషోర్ ప్రతి మూడు నెలలకోసారి సర్వే చేస్తున్నారు.. ఈ సారి కూడా ఆ నివేదికను జగన్‌కు అందించారని టీడీపీ అనుకూల మీడియా ప్రచారం. సర్వే అంటూ టీడీపీ ప్రచారం చేస్తున్న వివరాలు వ్యూహాత్మకంగా ఉన్నాయని వైసీపీ భావిస్తోంది.

కుప్పంతో సహా 175 స్థానాలు కొట్టి చూపిస్తామని జగన్‌ పదేపదే చెబుతూ... అందుకు లోకల్ బాడీ ఎన్నికల ఫ‌లితాల‌ను ఉదాహరణగా చూపుతున్నారు. జగన్‌ వ్యాఖ్యలు టీడీపీ కేడర్‌ను నైరాశ్యంలో నెట్టాయని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. దానికి కౌంటర్‌గానే పీకే పేరుతో సర్వేను టీడీపీ ప్రచారంలోకి తెచ్చినట్టుగా ఉందంటున్నారు. జగన్‌కు పీకే ఇచ్చిన రిపోర్టులో మరీ భారీ వ్యతిరేకత ప్రభుత్వంపై లేదు గానీ.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 89 నుంచి 100 వరకు స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని చెప్పారంటూ టీడీపీ మీడియా ప్రచారం.

ఈ ప్రచారం చూడ్డానికి వైసీపీకి అనుకూలంగానే ఉన్నట్టుగా ఉంటుంది. కానీ టీడీపీ వ్యూహం వేరే అంటోంది వైసీపీ. ఒక్కసారిగా వైసీపీ ఘోరంగా ఓడిపోతోంది అని రిపోర్టు ఇచ్చారని చెబుతే ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 100 స్థానాలలోపు వైసీపీ గెలుస్తుందని ప్రస్తుతానికి చెప్పి.. మరో ఆరు నెలల తర్వాత వైసీపీ గ్రాఫ్ మరింత పడిపోయిందంటూ, మరిన్ని సీట్లు తగ్గించి టీడీపీ మీడియానే పీకే పేరుతో మరో సర్వే రిపోర్టును ప్రచారం చేసే అవకాశం ఉందంటున్నారు.

151 సీట్లు నుంచి 100 లోపుకు వైసీపీ వచ్చిందంటే మరో ఏడాదికి అధికార పార్టీ బలం మరింత తగ్గిపోయి టీడీపీ అధికారంలోకి వచ్చేస్తుందన్న ఆత్మస్థైర్యాన్ని టీడీపీ కేడర్‌లో నింపేందుకూ ఈ ప్రచారం చేస్తున్నారని అధికార పార్టీ అభిప్రాయపడుతోంది. టార్గెట్‌కు చాలా దగ్గర్లోకి వచ్చేశాం అన్నభావన కలిగించేందుకు ఈ తరహా సర్వేలను టీడీపీ ప్రచారం తెరపైకి తెస్తోందని వైసీపీ ఆరోపణ.

First Published:  5 Sep 2022 3:25 PM GMT
Next Story