Telugu Global
Andhra Pradesh

ప్రతిపక్షాలకు వైసీపీ చెక్ పెడుతోందా?

ఈ నేప‌ధ్యంలో గడపగడపకు మ‌న‌ ప్రభుత్వం అనే కార్యక్రమంలో పాల్గొనేందుకు తనకు అనుమతి కావాలంటూ రాయచోటి ఎమ్మెల్కే శ్రీకాంత్ రెడ్డి డీఎస్పీకి లేఖ రాశారు.

ప్రతిపక్షాలకు వైసీపీ చెక్ పెడుతోందా?
X

నిబంధ‌నలు అన్నీపార్టీలకు సమానంగానే వర్తిస్తాయని చెప్పేందుకు అధికార పార్టీ రెడీ అయ్యింది. తమ కార్యక్రమాలకు పోలీసుల నుండి అనుమతులు తీసుకోవటం ద్వారా ప్రతిపక్షాలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన అధినేతలకు చెక్ పెట్టబోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే రోడ్లపై సభలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. దీనిపైన ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వంపై మండిపోతున్నాయి. ఈ నేప‌ధ్యంలో గడపగడపకు మ‌న‌ ప్రభుత్వం అనే కార్యక్రమంలో పాల్గొనేందుకు తనకు అనుమతి కావాలంటూ రాయచోటి ఎమ్మెల్కే శ్రీకాంత్ రెడ్డి డీఎస్పీకి లేఖ రాశారు.

నాలుగు రోజులపాటు తన నియోజకవర్గంలోని లక్కిరెడ్డిపల్లె, దప్పేపల్లి, కోనంపేట గ్రామాల్లో నిర్వహించాలని అనుకున్న కార్యక్రమానికి అనుమతించాలని లేఖ రాశారు. ఇలాంటి లేఖ శ్రీకాంత్‌కు మాత్రమే పరిమితమా లేకపోతే మంత్రులు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అంతా రాయబోతున్నారా అన్న విషయమై క్లారిటి లేదు. ఏదేమైనా లేఖలు రాసి అనుమతులు కోరే సంప్రదాయం గడికోటతో మొదలైంది. నిజానికి రాయచోటి ఎమ్మెల్యే అనుమతి కోరుతూ డీఎస్పీకి లేఖ రాయాల్సిన అవసరమే లేదు.

ఎందుకంటే గడపగడపకు మ‌న‌ ప్రభుత్వం అన్నది రోడ్డు షో కాదు, రోడ్లపైన సభలు పెట్టరు, ర్యాలీలు కూడా తీయటంలేదు. మంత్రి లేదా ఎమ్మెల్యేతో పాటు మరికొంతమంది ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తున్నారు. ఆ ఇంట్లోవాళ్ళకి గడచిన మూడున్నరేళ్ళల్లో అందిన లబ్ది, రాబోయే కాలంలో అందబోయే లబ్దిని వివరించటమే కార్యక్రమం ముఖ్యఉద్దేశం. పనిలోపనిగా రాబోయే ఎన్నికల్లో వైసీపీకే ఓట్లేయమని అడుగుతున్నారు.

ఈ కార్యక్రమం వల్ల రోడ్లపై ట్రాఫిక్ ఆగిపోవటం, తొక్కిసలాటలు జరగటం, జనాలను పోగేసి సభలు పెట్టడం అన్నదే ఉండదు. అయినా వ్యూహాత్మకంగా అనుమతి కోరుతూ డీఎస్పీకి గడికోట లేఖ రాశారు. దీనివల్ల లాభం ఏమిటంటే అధికార పార్టీ వాళ్ళే కార్యక్రమాలకు అనుమతులు కోరుతున్నప్పుడు ప్రతిపక్షాలు మాత్రం అనుమతులు ఎందుకు తీసుకోరు అని ఎదురుదాడులు చేయచ్చు. జనాలకు అర్ధమయ్యేట్లుగా వైసీపీ నేతలు ఈ పాయింట్‌ను హైలైట్ చేయబోతోంది. ప్రభుత్వ నిబంధనలు అన్నీపార్టీలకు సమానంగానే వర్తిస్తాయని చాటిచెప్పటమే జగన్మోహన్ రెడ్డి వ్యూహం. మరి దీనిపై ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

First Published:  10 Jan 2023 6:25 AM GMT
Next Story