Telugu Global
Andhra Pradesh

ప్రజలను ఆకర్షించేందుకు వైసీపి మ‌రో వ్యూహం

తాము అమ‌లు చేస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాలే తిరిగి త‌మ‌ను గ‌ద్దెనెక్కిస్తాయ‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ బ‌లంగా న‌మ్ముతున్నారు. ఈ కార్య‌క్రమాల వల్ల పార్టీ ఎంత మేర‌కు ప్ర‌జ‌ల‌కు చేరువయ్యింది, వాటి ప్ర‌భావం ఏ మేర‌కు ఉంటుంద‌నే విష‌యాల‌పై వైసిపి ఆరా తీస్తోంది.

YS Jagan Mohan Reddy
X

YS Jagan Mohan Reddy

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో విప‌క్షాల‌కు ధీటుగా అధికార వైసిపి దూకుడు పెంచుతోంది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ముందు నుంచీ చెబుతున్న 175సీట్ల ల‌క్ష్యాన్ని సాధించేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు వ్యూహాల‌ను సిద్ధం చేస్తున్నారు. మ‌రోవైపు ఎమ్మెల్యేల‌ను, ఎంపీల‌ను ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌య్యేలా గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మాన్ని రూపొందించి అమ‌లు చేస్తున్నారు. అయితే ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు చాలా చోట్ల ప్ర‌తికూల‌త ఎదుర‌వుతోంది. ప్ర‌జ‌ల నుంచి సానుకూల‌త పొందేలా ఎమ్మెల్యేల‌పై వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించేలా ఇక నేరుగా ముఖ్య‌మంత్రి ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యేలా ఓ వినూత్న కార్య‌క్ర‌మాన్ని రూపొందిస్తున్నార‌ని స‌మాచారం.

తాము అమ‌లు చేస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాలే తిరిగి త‌మ‌ను గ‌ద్దెనెక్కిస్తాయ‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ బ‌లంగా న‌మ్ముతున్నారు. ఈ కార్య‌క్రమాల వల్ల పార్టీ ఎంత మేర‌కు ప్ర‌జ‌ల‌కు చేరువయ్యింది, వాటి ప్ర‌భావం ఏ మేర‌కు ఉంటుంద‌నే విష‌యాల‌పై వైసిపి ఆరా తీస్తోంది. జ‌గ‌న్ అనుకున్న ల‌క్ష్యం సాధించాలంటే ప్ర‌స్తుతం అమ‌లు చేస్తున్న కార్య‌క్ర‌మాలు స‌రిపోవ‌ని వైసిపి అంచనా వేస్తోందంటున్నారు. అందుకే ముఖ్య‌మంత్రి ఎక్కువగా జ‌నాల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారుట‌.

ఈ కార్య‌క్ర‌మంలో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను క‌లుసుకుని ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను వివ‌రించేలా కులాల వారీగా స‌భ‌ల‌ను నిర్వ‌హించాల‌ని ఆలోచిస్తున్నారు. ఆయా కులాల కార్పోరేష‌న్ల నుంచి స‌మాచారం తీసుకుని ఆయా వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు అందిన సంక్షేమ ప‌థ‌కాల ఫ‌లాల వివ‌రాల‌ను క‌ర‌ప‌త్రాలలో ముద్రించి వాటిని సంబంధిత వ‌ర్గాల సమావేశాలు,సభ‌ల్లో పంపిణీ చేయాల‌ని యోచిస్తున్నార‌ని స‌మాచారం. ఇప్ప‌టికే ఆ దిశ‌గా అధికారులు, నాయ‌కుల‌కు సూచ‌న‌లు అందాయ‌ని తెలుస్తోంది.

ఇప్ప‌టికే బిసి గ‌ర్జ‌న తో ఆ వ‌ర్గం ఓట‌ర్ల‌ను సమీక‌రించే ప్ర‌య‌త్నం చేశారు. పూర్తి స‌మాచారంతో మ‌రిన్ని స‌భ‌లు నిర్వ‌హించాల‌ని ప్లాన్‌. ఇదే త‌ర‌హాలో ఆయా వ‌ర్గాలను ఆక‌ర్షించేలా కార్య‌క్ర‌మాలు రూపొందిస్తున్నారు. ఇందుకు సంబంధించి ప‌ది ప‌దిహేను రోజుల్లో కార్యక్రమాన్ని ప్రకటిస్తారని తెలుస్తోంది. వ‌చ్చే నెలరోజుల్లోపే అమలు చేసేలా షెడ్యూల్ ఖరారు చేస్తారని వైసిపి వ‌ర్గాలు.చెబుతున్నాయి.

First Published:  7 Dec 2022 2:43 PM GMT
Next Story