Telugu Global
Andhra Pradesh

ఈసారి ఆ సీటు వైసీపీ ఖాతాలో పడాల్సిందే.. బరిలోకి కొడాలి నాని?

విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగానే ఉంటాయి. వీళ్లు పార్టీలకు అతీతంగా కేశినేనికి ఓటేయడంతోనే వైసీపీ గెలవలేకపోయిందని ఓ రిపోర్టులో వెల్లడైంది.

ఈసారి ఆ సీటు వైసీపీ ఖాతాలో పడాల్సిందే.. బరిలోకి కొడాలి నాని?
X

2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్‌సీపీ బ్రహ్మాండమైన మెజార్టీ సాధించి అధికారంలోకి వచ్చింది. అందరూ ఊహించినట్లే కొన్ని అసెంబ్లీ సీట్లు ప్రతిపక్ష టీడీపీ కైవసం చేసుకున్నది. వైఎస్ జగన్ ప్రభంజనం వీచినా.. ఆయా నియోజకవర్గాల్లో కొంత వ్యక్తిగత చరిష్మాతో టీడీపీ నేతలు గెలిచారు. అసెంబ్లీ విషయం పక్కన పెడితే.. లోక్‌సభ సీట్ల విషయంలో మాత్రం వైసీపీకి కాస్త ఎదురు దెబ్బే తగిలింది. ఆయా లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని అధిక సంఖ్యలో అసెంబ్లీ సెగ్మెంట్లు గెలిచినా.. క్రాస్ ఓటింగ్ కారణంగా టీడీపీ ఖాతాలోకి వెళ్లాయి. దీంతో పార్లమెంటు స్థానాల్లో క్లీన్ స్వీప్ చేయాలన్న వైఎస్ జగన్ లక్ష్యం నెరవేరలేదు.

గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో కూడా వైసీపీకి విజయవాడ లోక్‌సభ సీటు అందని ద్రాక్షగా మిగిలింది. 2019లో ఈ పార్లమెంటు సీటు వైసీపీకే దక్కుతుందని అందరూ అంచనా వేశారు. కానీ సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని కేవలం 8,726 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2014 పార్లమెంటు ఎన్నికల్లో కేశినేని నాని 74,862 ఓట్ల మెజార్టీ సాధించినా.. మొన్నటి ఎన్నికల్లో మాత్రం భారీగా ఓట్లను కోల్పోయి.. స్వల్ప మెజార్టీతో బయటపడ్డారు. అయితే ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాలకు గాను ఆరింటిలో వైసీపీ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. క్రాస్ ఓటింగ్ కారణంగానే వైసీపీ అభ్యర్థి ప్రసాద్. వి. పొట్లూరి ఓడిపోయారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు.

విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగానే ఉంటాయి. వీళ్లు పార్టీలకు అతీతంగా కేశినేనికి ఓటేయడంతోనే వైసీపీ గెలవలేకపోయిందని ఓ రిపోర్టులో వెల్లడైంది. 2014, 2019లో ఈ సీటును కోల్పోయినా.. 2024లో మాత్రం ఎలాగైనా దీన్ని వైసీపీ ఖాతాలో వేయాలని అధిష్టానం భావిస్తోంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా.. అప్పుడే విజయవాడ లోక్‌సభ సీటుపై కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఓ బలమైన కమ్మ అభ్యర్థిని బరిలోకి ఉంచడం ద్వారా ఓటములకు తెర దించాలని భావిస్తోంది. ఇప్పటికే పలువురు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. అయితే కొడాలి నాని అయితే సరైన ఛాయిస్ అవుతారని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.

మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే అయిన కొడాలి నాని కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత. దూకుడైన వ్యక్తి మాత్రమే కాకుండా ఆయనకు ఆ సామాజిక వర్గంలో పార్టీలకు అతీతంగా మంచి పరిచయాలు ఉన్నాయి. గుడివాడ అసెంబ్లీ సెగ్మెంట్.. విజయవాడ పరిధిలోకి రాకపోయినా.. మొదటి నుంచి నానికి ఇటువైపు సంబంధాలు బలంగానే ఉన్నాయి. ఆయన అయితేనే టీడీపీ అభ్యర్థికి సరైన పోటీ ఇవ్వగలరని భావిస్తున్నారు. కేశినేని నాని వరుసగా రెండు పర్యాయాలు గెలిచారు. దీంతో ఆయనపై ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది. దాంతో పాటు కేశినేని నాని ఎలాగైతే ట్రాన్స్‌పోర్ట్ ఫీల్డ్ నుంచి ఎదిగారో.. కొడాలి నాని కూడా అదే రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. విజయవాడ పరిధిలో ఉన్న ట్రాన్స్‌పోర్ట్ రంగంలో కొడాలి నానికి మంచి పేరు ఉంది. పైగా కమ్మ సామాజిక వర్గం కూడా అతడికి అండగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇన్ని అనుకూలతలు ఉన్నాయి కాబట్టే.. కొడాలి నానిని ఈసారి విజయవాడ పార్లమెంటు బరిలో దింపాలని అధిష్టానం అనుకుంటుంది.

అయితే కొడాలి నాని ఈ ప్రతిపాదనకు ఒప్పుకుంటారా అనే అనుమానాలు నెలకొన్నాయి. ఇప్పటికే గుడివాడ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మరోసారి పోటీ చేయడానికి ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అక్కడ నానిని ఎలాగైనా ఓడించాలని టీడీపీ కూడా ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈసారి గుడివాడలో గెలిచి మరోసారి తన సత్తా చాటాలని నాని భావిస్తున్నారు. అలాంటి సమయంలో అసెంబ్లీకి కాకుండా పార్లమెంటుకు పంపుతామంటే ఆయన ఒప్పుకుంటారా అనే అనుమానాలు ఉన్నాయి. అయితే వైఎస్ జగన్ అంటే వీరాభిమానం చూపించే నాని.. ఆయన మాటను జవదాటరని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ వైఎస్ జగన్ స్వయంగా నానిని పిలిచి మాట్లాడితే తప్పకుండా పోటీలో ఉంటారని అంటున్నారు.

కేశినేని నానికే ఈ సారి టీడీపీ టికెట్ కేటాయించే అవకాశం ఉంది. ఆ నానిని ఓడించడానికి వైసీపీ మరో నానిని దింపితే మాత్రం విజయవాడ పార్లమెంటు ఎన్నిక రసవత్తరంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం నాని ఇక్కడి నుంచి పోటీ చేస్తారనే వార్త రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. అయితే నాని మనసులో ఏముందో మాత్రం ఇంకా తెలియదు. ఎన్నికలు వచ్చే వరకు ఈ చర్చ కొనసాగే అవకాశం ఉంది.

First Published:  6 Sep 2022 11:44 AM GMT
Next Story