Telugu Global
Andhra Pradesh

గట్టి అభ్యర్థి దొరికారా? పోటీయే సస్పెన్స్

బొమ్మిరెడ్డి డిమాండ్‌కు జగన్ సానుకూలంగా స్పందించటంతో వచ్చే ఎన్నికల్లో ఉదయగిరి నియోజకవర్గం వైసీపీకి బలమైన అభ్యర్థి దొరికినట్లే అనుకుంటున్నారు. ఎందుకంటే బొమ్మిరెడ్డికి జిల్లావ్యాప్తంగా మద్దతుదారులున్నారు.

గట్టి అభ్యర్థి దొరికారా? పోటీయే సస్పెన్స్
X

నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గం వైసీపీకి గట్టి అభ్యర్థి దొరికనట్లేనా? జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా పనిచేసిన బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి తన మద్దతుదారులతో వైసీపీలో చేరారు. జగన్మోహన్ రెడ్డి సమక్షంలో బొమ్మిరెడ్డి తన మద్దతుదారులతో పార్టీ కండువాను కప్పుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో మేకపాటి ప్లేసులో కొత్త అభ్యర్థిని పోటీలోకి దింపాల్సిన అవసరం వచ్చింది. అందుకని పార్టీలోని ఇద్దరు ముగ్గురు నేతలు టికెట్ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

ఇదే సమయంలో తండ్రి, కొడుకులైన మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి తెరవెనుక మంత్రాంగం నడిపారు. మేకపాటి కుటుంబంతో బొమ్మిరెడ్డికి బాగా సన్నిహిత సంబంధాలున్నాయి. బొమ్మిరెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చే విషయమై జగన్ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే మేకపాటి, మాజీ ఛైర్మన్ బొమ్మిరెడ్డితో మంతనాలు జరిపారట. వచ్చే ఎన్నికల్లో తనకు ఉదయగిరి టికెట్ ఇచ్చేట్లయితే వైసీపీలో చేరటానికి అభ్యంతరం లేదని చెప్పారట.

బొమ్మిరెడ్డి డిమాండ్‌కు జగన్ సానుకూలంగా స్పందించటంతో వచ్చే ఎన్నికల్లో ఇక్కడ వైసీపీకి బలమైన అభ్యర్థి దొరికినట్లే అనుకుంటున్నారు. ఎందుకంటే బొమ్మిరెడ్డికి జిల్లావ్యాప్తంగా మద్దతుదారులున్నారు. పోయిన ఎన్నికల్లో వైసీపీ తరపున వెంకటగిరి నుండి పోటీ చేయాలని అనుకుంటే కుదరలేదు. అందుకనే పార్టీకి రాజీనామా చేసి టీడీపీ తరపున బొమ్మిరెడ్డే ఉదయగిరిలో పోటీ చేయాలని ప్రయత్నించారు. కానీ చివరి నిమిషంలో బొమ్మిరెడ్డికి కాకుండా బొల్లినేని వెంకట రామారావుకుకు చంద్రబాబునాయుడు టికెట్ ఇచ్చారు. బొల్లినేని ఓడిపోయిన దగ్గర నుండి నియోజకవర్గ బాధ్యతలు ఎక్కువగా బొమ్మిరెడ్డే చూసుకుంటున్నారు.

అయితే వైసీపీలో జరిగిన పరిణామాల కారణంగా ఇక్కడ కొత్త అభ్యర్థిని వెతుక్కోవాల్సొచ్చింది. రాబోయే ఎన్నికల్లో బొమ్మిరెడ్డి పోటీ చేయటం ఖాయమైతే మేకపాటి కుటుంబం నుండి పూర్తి సహకారం అందటం ఖాయం. అయితే బొమ్మిరెడ్డికి ఉదయగిరి లేదా ఆత్మకూరులో టికెట్ ఇచ్చే విషయాన్ని జగన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఉదయగిరిలో అయితే ఇబ్బంది లేదు. అదే ఆత్మకూరులో అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే విక్రమ్‌ను ఉదయగిరికి మార్చాల్సుంటుంది. ఏది ఏమైనా బొమ్మిరెడ్డి పాత్ర ఆసక్తిగా మారింది. మొత్తానికి బొమ్మిరెడ్డి చేరటం వల్ల వైసీపీకి ప్ల‌స్ అవుతుంద‌నే అనుకుంటున్నారు. చివరకు ఏమవుతుందో చూడాలి.

First Published:  7 May 2023 5:14 AM GMT
Next Story