Telugu Global
Andhra Pradesh

ఎన్నికల కమిషన్‌ లేఖ ప్రకారమే పింఛన్ల పంపిణీ

వలంటీర్ల ద్వారా ఇంటివద్దే పింఛన్ల పంపిణీని ఒకట్రెండు నెలలు అడ్డుకుంటే అభిమానం తగ్గిపోతుందా అని సజ్జల ప్రశ్నించారు. బాబు పాలనలో పింఛన్‌ కోసం వృద్ధులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేదని గుర్తుచేశారు.

ఎన్నికల కమిషన్‌ లేఖ ప్రకారమే పింఛన్ల పంపిణీ
X

వృద్ధులకు పింఛన్ల పంపిణీపై ప్రతిపక్షాలు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాయని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ప్రతి నెలా ఒకటో తేదీనే సూర్యోదయానికి ముందే ఇంటింటికీ పింఛన్‌ తీసుకెళ్లే వలంటీర్‌ వ్యవస్థను అడ్డుకుని వృద్ధులను మండుటెండలో అవస్థలకు గురయ్యేలా చేసిన చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్ల పంపిణీ వ్యవహారంలో ఇప్పుడు తనపై వ్యతిరేకత వస్తుందన్న భయంతోనే ఇంటివద్దే ఇవ్వాలంటూ చంద్రబాబు కొత్త డ్రామా ఆడుతున్నాడని విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం స‌జ్జ‌ల‌ విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పింఛన్లు పేదల ఇంటికి వెళ్లకుండా ఆపించిన చంద్రబాబే.. ప్రభుత్వం ఏం చేయాలో ఎలా చెబుతారని సజ్జల నిలదీశారు. ఉద్యోగాలు ఇవ్వలేదని వైసీపీపై ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు.. ఇప్పుడు సీఎం జగన్‌ తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థలోని 1.30 లక్షల మంది ఉద్యోగులతోనే పింఛన్లను ఇంటింటికీ పంపాలని అంటున్నారని ఎద్దేవా చేశారు.

ఈసీ ఆదేశాల మేరకే...

ఈసీ ఆదేశాలతో వీలైనంత త్వరగా పింఛన్‌ పంపిణీ చేసేలా ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోందని సజ్జల తెలిపారు. ఏప్రిల్‌లో పింఛన్ల పంపిణీని చంద్రబాబు అడ్డుకోవడంతో.. నేరుగా బ్యాంకు ఖాతాల్లో (డీబీటీ ద్వారా) నగదు జమచేయాలని మార్చి 30న ఈసీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని సజ్జల చెప్పారు. దానికి కూడా చంద్రబాబు ఒప్పుకోలేదని ఆయన తెలిపారు. చంద్రబాబు గ్యాంగ్, ఢిల్లీలో ఏజెంట్లతో ఈసీపై ఒత్తిడి తెచ్చారన్నారు. తాజాగా ఏప్రిల్‌ 26న ఈసీ ప్రభుత్వానికి మరో లేఖ రాసిందని సజ్జల చెప్పారు. ఇందులో కూడా డీబీటీ ద్వారా ఇవ్వాలని చెప్పిందన్నారు. ఆ మేరకు ప్రభుత్వ యంత్రాంగం డీబీటీ ద్వారా, ఇళ్ల వద్ద పింఛన్‌ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు. ఇప్పుడు మళ్లీ బ్యాంకుల ద్వారా కాదు, ఇంటికే వెళ్లి ఇవ్వాలంటూ ఈసీకి బాబు హుకుం జారీ చేయడం సిగ్గుచేటన్నారు. పింఛన్‌ కోసం ప్రజలు మళ్లీ రోడ్డెక్కాల్సి రావడానికి బాబే కారణమని ఆయన స్పష్టం చేశారు. ఈ పాపానికి బాబు, ఆయన దత్తపుత్రుడు పవన్‌ కళ్యాణ్, వదినమ్మ పురందేశ్వరి బాధ్యులని చెప్పారు. 32 మంది వృద్ధులను పొట్టన పెట్టుకుని శవ రాజకీయాలు చేస్తున్నదీ చంద్రబాబే అని మండిపడ్డారు.

ఒకట్రెండు నెలలు అడ్డుకుంటే అభిమానం తగ్గిపోతుందా?

వలంటీర్ల ద్వారా ఇంటివద్దే పింఛన్ల పంపిణీని ఒకట్రెండు నెలలు అడ్డుకుంటే అభిమానం తగ్గిపోతుందా అని సజ్జల ప్రశ్నించారు. బాబు పాలనలో పింఛన్‌ కోసం వృద్ధులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేదని గుర్తుచేశారు. అప్పట్లో వచ్చే కొద్దిపాటి పింఛన్‌ ఎప్పుడు, ఎంత మందికి వస్తుందో తెలియని పరిస్థితి ఉండేదన్నారు. అలాంటి చంద్రబాబు.. పింఛన్లను ఇంటి వద్దే అందిస్తున్న సీఎం జగన్‌ను ప్రశ్నిస్తున్నాడని మండిపడ్డారు. ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ చేరవేస్తున్న వలంటీర్లకు సమాజంలో దక్కిన గౌరవాన్ని చూసి బాబులో వణుకు పుట్టిందని సజ్జల చెప్పారు. స్వయంగా పింఛన్‌ పంపిణీని అడ్డుకుంటే ప్రజలు తిరగబడతారనే భయంతో దొంగ ఎత్తులు వేశారన్నారు. బినామీలతో సుప్రీం కోర్టులో కేసులు, ఫిర్యాదులతో అడ్డుకున్నారని చెప్పారు. చంద్రబాబు ఓడిపోతున్నానన్న నిస్ప్పహలో తప్పులు చేసి, సీఎం జగన్‌ను తిట్టడాన్ని చూస్తే బాబు అసలు మనిషి జన్మ ఎలా ఎత్తాడా అనిపిస్తోందన్నారు.

First Published:  30 April 2024 5:06 AM GMT
Next Story