Telugu Global
Andhra Pradesh

ఇప్పుడు క‌లిశామంటున్నారు.. అస‌లు విడిపోయిందెప్పుడు..? - స‌జ్జ‌ల

జ‌నం రియాలిటీకి ద‌గ్గ‌ర‌గా ఉన్నార‌ని.. ప‌వ‌న్ క‌ల్యాణ్ మాత్రం రీల్‌కి ద‌గ్గ‌ర‌గా ఉన్నార‌ని స‌జ్జ‌ల విమ‌ర్శించారు. పవన్ ఒక పొలిటీషియన్ అయితే, ఆయనది ఒక పార్టీ అయితే బాధ్యతగా మాట్లాడేవార‌ని చెప్పారు.

ఇప్పుడు క‌లిశామంటున్నారు.. అస‌లు విడిపోయిందెప్పుడు..? - స‌జ్జ‌ల
X

టీడీపీతో క‌లిశామని ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటున్నారని, అయితే అస‌లు విడిపోయిందెప్పుడు.. అని వైసీపీ ప్ర‌ధాన కార్య‌దర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ప్ర‌శ్నించారు. తాడేప‌ల్లిలో గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. 2014లో చంద్రబాబు కోసం కలిసి పోటీ చేశారని, 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చటానికి విడిగా పోటీ చేశారని తెలిపారు. పవన్ మనసులో ఎప్పుడూ చంద్రబాబే ఉంటారని ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఎద్దేవా చేశారు.

రియాలిటీకి ద‌గ్గ‌ర‌గా జ‌నం.. రీల్‌కి ద‌గ్గ‌ర‌గా ప‌వ‌న్‌

జ‌నం రియాలిటీకి ద‌గ్గ‌ర‌గా ఉన్నార‌ని.. ప‌వ‌న్ క‌ల్యాణ్ మాత్రం రీల్‌కి ద‌గ్గ‌ర‌గా ఉన్నార‌ని స‌జ్జ‌ల విమ‌ర్శించారు. పవన్ ఒక పొలిటీషియన్ అయితే, ఆయనది ఒక పార్టీ అయితే బాధ్యతగా మాట్లాడేవార‌ని చెప్పారు. సినిమాల్లో డైలాగులు చెప్పిన‌ట్టు బయట కూడా చెబితే జనం నవ్వుతారని తెలిపారు. అడ్డంగా దొరికినా బాబు సుద్దపూస అంటే జనం నమ్మరని చెప్పారు. వ్యవస్థలను మేనేజ్ చేయటంలో సిద్ధహస్తుడినన్న నమ్మకంతోనే బాబు ఇలా అక్రమాలు చేశార‌న్నారు. ఎల్లవేళలా మేనేజ్ చేయటం కుదరదని ఈ సంద‌ర్భంగా తెలిపారు.

ప్ర‌జ‌ల్లో వైసీపీకి 75 శాతం పైగా మ‌ద్ద‌తు..

ప్ర‌భుత్వంలో ఉన్న పార్టీకి ఎప్పుడూ లేనంత మ‌ద్ద‌తు ఫ‌స్ట్ టైమ్ త‌మ పార్టీకి ఉంద‌ని, అదికూడా ప్ర‌జ‌ల్లో 75 శాతం పైగా త‌మ‌కు మ‌ద్ద‌తు ఉంద‌ని సజ్జ‌ల వివ‌రించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ర‌క‌ర‌కాల ఫ్యాక్ట‌ర్లు ప‌నిచేసినా త‌మ‌కు ఈసారి మాత్రం 60 శాతం సీట్లు క‌చ్చితంగా వ‌స్తాయ‌ని చెప్పారు. ఇది అహంకారంతో చెప్ప‌డం లేద‌ని, ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న మ‌ద్ద‌తుతో తాము ఎంతో న‌మ్మ‌కంగా ఈ మాట చెబుతున్నామ‌ని తెలిపారు. ఎన్నిక‌లు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగానే ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు. పవన్ మేకపోతు గాంభీర్యం లాంటి మాటలను తాము పట్టించుకోవాల్సిన పనిలేద‌న్నారు.

గుడిని, గుడిలో లింగాన్నీ దోచేసింది..

స్కిల్ స్కాంలో రూ.350 కోట్లు బయటకు వెళ్లాయని స‌జ్జ‌ల చెప్పారు. సీమెన్స్ కంపెనీ త‌మ‌కు డబ్బు రాలేదని చెబుతోంద‌ని , డిజైన్ టెక్, ఇతర షెల్ కంపెనీలకు డ‌బ్బు వెళ్లినట్టు తేలింద‌న్నారు. ఇక అవినీతి జరగలేదని అంటే ఎలా కుదురుతుందని స‌జ్జ‌ల ప్ర‌శ్నించారు. గుడిని, గుడిలోని లింగాన్ని కూడా దోచేసిన ముఠా చంద్రబాబు ముఠా అని విమ‌ర్శించారు. సీమెన్స్ కు తెలియకుండానే డబ్బులు వెళ్లాయని, అసలు ఒప్పందంలో రూ.3,300 కోట్లు అనేదే లేదని తెలిపారు. జీవోలో ఒకలాగ, ఒప్పందంలో ఒకలాగ రాసుకున్నారని చెప్పారు. అమరావతి స్కాం, స్కిల్ స్కాం అన్నీ బయటకు వస్తాయని ఆయ‌న ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేశారు.

*

First Published:  15 Sep 2023 1:59 AM GMT
Next Story