Telugu Global
Andhra Pradesh

షర్మిలను వాయించేస్తున్న నెటిజన్లు

ఎవరికోసమో ఆరోపణలు చేయటం కాదని సొంత బుద్ధితో మాట్లాడాలని షర్మిలకు నెటిజన్లు సూచిస్తున్నారు. వైఎస్సార్ మరణించిన తర్వాత కుటుంబంతో పాటు జగన్‌ను కాంగ్రెస్ పార్టీ ఎంతగా వేధించింది మరచిపోయారా అంటూ షర్మిలను నిలదీస్తున్నారు.

షర్మిలను వాయించేస్తున్న నెటిజన్లు
X

కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న వైఎస్ షర్మిలపై నెటిజన్లు ట్రోలింగ్ మొదలుపెట్టారు. బాధ్యతలు తీసుకున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి షర్మిల మాట్లాడిన మాటలను పట్టుకుని నెటిజన్లు దుమ్ము దులిపేస్తున్నారు. కాంగ్రెస్ పై గతంలో మాట్లాడిన మాటలు, చేసిన ఆరోపణలు, తెలంగాణలో పార్టీ పెట్టుకున్నప్పుడు మాట్లాడిన మాటలను ప్రస్తావిస్తూ ఇప్పుడు చేసిన ఆరోపణలతో షర్మిలపై దుమ్మెత్తిపోస్తున్నారు. జగన్ వదిలిన బాణం అని తనను అనవ‌ద్దని షర్మిల తీవ్రంగా ఆక్షేపించారు. దానిపైన కూడా నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

ఎందుకంటే గతంలో జగన్ తరఫున షర్మిల ప్రచారం చేసినప్పుడు తనకు తానుగా జగనన్న వదిలిన బాణాన్ని అని ప్రచారం చేసుకున్నారు. దాన్నే ఇప్పుడు నెటిజన్లు గుర్తుచేస్తుంటే షర్మిల తట్టుకోలేకపోతున్నారు. షర్మిల ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు తీసుకోబోతున్నారని అనగానే ఆమె జగన్ కు వ్యతిరేకంగా ఆరోపణలు మొదలుపెడతారని ఊహించిందే. కానీ, మొదటి మీటింగులోనే అన్నను పట్టుకుని జగన్‌ రెడ్డి అని సంబోధించటమే అందరికీ ఆశ్చర్యంగా ఉంది. పైగా ఏపీ అప్పులు రూ. 10 లక్షల కోట్లని, ప్రత్యేకహోదా సాధనలో ఫెయిలయ్యారని మండిపడ్డారు.

టార్చిలైట్ వేసి వెతికినా ఏపీలో అభివృద్ధే కనబడదన్నారు. దానిపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సెటైర్లు వేశారు. స్కూలు బిల్డింగుల ఆధునీకీకరణ, రైతు భరోసా కేంద్రాలు నిర్మించటం, గ్రామ, వార్డు సచివాలయాల నిర్మాణాలు, పోర్టుల నిర్మాణాలు, విద్యుత్ కేంద్రాల ఏర్పాటు లాంటివి షర్మిల దృష్టిలో అభివృద్ధి కాదా అని నిలదీశారు. చంద్రబాబు, పవన్, ఎల్లోమీడియా చేస్తున్న ఆరోపణలనే షర్మిల కూడా మొదలుపెట్టారంటూ నెటిజన్లు ఫుల్లుగా ఫైర్ అవుతున్నారు.

ఎవరికోసమో ఆరోపణలు చేయటం కాదని సొంత బుద్ధితో మాట్లాడాలని షర్మిలకు నెటిజన్లు సూచిస్తున్నారు. వైఎస్సార్ మరణించిన తర్వాత కుటుంబంతో పాటు జగన్‌ను కాంగ్రెస్ పార్టీ ఎంతగా వేధించింది మరచిపోయారా అంటూ షర్మిలను నిలదీస్తున్నారు. అన్నతో వ్యక్తిగత విభేదాల కారణంగా వ్యతిరేకులతో చేతులు కలపటం ద్వారా షర్మిల సాధించబోయేది ఏముండదని నెటిజన్లు తేల్చేస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో జరుగుబాటు లేక చివరకు ఏపీ మీద పడ్డారా అని కూడా కొందరు షర్మిలను ఎద్దేవా చేస్తున్నారు.

First Published:  24 Jan 2024 5:50 AM GMT
Next Story