Telugu Global
Andhra Pradesh

ఇది ట్రైల‌ర్‌ మాత్రమే.. సినిమా ముందుంది

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు తిప్పల దేవన్‌ రెడ్డి రాజీనామాల వ్యవహారం వల్ల మంగళగిరి, గాజువాక నియోజకవర్గాల్లో చోటుచేసుకున్న పరిణామాలపై సీఎం జగన్‌ ఈ భేటీలో నేతలతో చర్చించారు.

ఇది ట్రైల‌ర్‌ మాత్రమే.. సినిమా ముందుంది
X

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉండటంతో ఎన్నికల ప్రణాళికలో వేగం పెంచేస్తున్నారు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్‌. అందులో భాగంగానే సోమవారం నాడు 11 నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను ప్రకటించి నాయకుల్లో ఒక్కసారిగా కలకలం రేపిన జగన్‌.. ఇది ట్రైల‌ర్ మాత్ర‌మేన‌ని, ఇంకా చాలా నియోజకవర్గాల్లో మార్పులు ఉన్నాయని ఇండికేష‌న్ ఇచ్చారు. సోమవారం సాయంత్రం వైసీపీ నేతలతో ఏర్పాటుచేసిన అత్యవసర భేటీలో సీఎం జగన్‌ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది.

ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాకు చెందిన మంత్రులతో పాటు అందుబాటులో ఉన్న మంత్రులు ఈ భేటీకి హాజరయ్యారు. మంత్రి జోగి రమేష్, మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు తిప్పల దేవన్‌ రెడ్డి రాజీనామాల వ్యవహారం వల్ల మంగళగిరి, గాజువాక నియోజకవర్గాల్లో చోటుచేసుకున్న పరిణామాలపై సీఎం జగన్‌ ఈ భేటీలో నేతలతో చర్చించారు. ఈ రెండు నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులను నిలబెట్టడానికి గల కారణాలను క్షుణ్ణంగా వివరించాలని ఈ సందర్భంగా వారికి సూచించారు. అంతేకాదు మున్ముందు మరిన్ని మార్పులు ఉంటాయనే సంకేతాలను కూడా వారికి అందించారు.

అసెంబ్లీ ఎన్నికలు ఎంతో దూరం లేకపోవడం వల్ల ఇప్పటి నుంచే స్థానిక నాయకత్వాల్లో మార్పులు చేర్పులు చేయక తప్పదని చెప్పారు. దీనికోసం పార్టీ యంత్రాంగం సంసిద్ధంగా ఉండాల్సి ఉంటుందని సూచించారు. పనితీరు సరిగ్గా లేని నియోజకవర్గాల్లో కొత్త ఇన్‌చార్జ్‌ల నియామకం తప్పదని తేల్చి చెప్పారు. తాజా పరిణామాలతో చాలా మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేల‌కు సీటు భయం పట్టుకుంది.

First Published:  12 Dec 2023 1:58 AM GMT
Next Story