Telugu Global
Andhra Pradesh

జ‌గ‌న్ బాట‌లో చంద్ర‌బాబు..విజ‌న‌రీ కాపీ ఫార్ములా.. వైసీపీ గృహ‌సార‌థులు.. టిడిపి సాధికార సార‌థులు

తెలుగుదేశం పార్టీ కూడా సేమ్ గృహ‌సార‌థులు మాదిరిగానే సాధికారిక సార‌థులు పేరుతో నియామకాలు చేప‌ట్టింది. ఇకపై పార్టీలో ఉన్న సెక్షన్ ఇంచార్జ్ లు అందరినీ కుటుంబ సాధికార సారథులుగా పిలుస్తామని గోదావ‌రి జిల్లాల ప‌ర్య‌ట‌న‌లో చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు.

జ‌గ‌న్ బాట‌లో చంద్ర‌బాబు..విజ‌న‌రీ కాపీ ఫార్ములా.. వైసీపీ గృహ‌సార‌థులు.. టిడిపి సాధికార సార‌థులు
X

వైసీపీ ఏర్ప‌డి ప‌దేళ్లు దాటింది. టిడిపి ఆవిర్భ‌వించి న‌ల‌భై ఏళ్లు పూర్త‌వుతోంది. ద‌శాబ్దాలుగా ఉన్న తెలుగుదేశం పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఫాలో అవ్వ‌డం విచిత్ర‌మేనంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. అన్నీ నేనే క‌నిపెట్టాన‌ని చెప్పుకునే చంద్ర‌బాబు.. జ‌గ‌న్ పార్టీ విధానాల‌ను కాపీ కొడుతున్నార‌ని వైసీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. టిడిపికి జిల్లాల వారీగా పార్టీ కార్య‌వ‌ర్గం ఉండేది. వైసీపీ అధినేత జ‌గ‌న్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల‌కు వైసీపీ క‌మిటీలు వేయ‌డం ఆరంభించారు. దీనిని ఫాలో అవుతూ టిడిపి కూడా పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గ పార్టీ క‌మిటీలు వేసింది.

వైఎస్ జ‌గ‌న్ త‌న పార్టీ కోసం ఐ-ప్యాక్ ప్ర‌శాంత్ కిశోర్‌ని ఎన్నిక‌ల క‌న్స‌ల్టెంటుగా పెట్టుకున్నారు. రాజ‌కీయ నేత‌ల్ని త‌యారు చేసే క‌ర్మాగారం అని ప‌దే ప‌దే చెప్పుకునే చంద్ర‌బాబు.. ఐ-ప్యాక్ నుంచి బ‌య‌ట‌కొచ్చిన రాబిన్ శ‌ర్మ‌ని క‌న్స‌ల్టెంటుగా నియ‌మించుకున్నారు. వైసీపీ గృహ‌సార‌థులు అనే పేరుతో ఎన్నిక‌ల కోసం ఓ కొత్త వ్య‌వ‌స్థ‌ని ఏర్పాటు చేసుకుంది. వై నాట్ 175 ల‌క్ష్యంతో ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్త‌మ‌వుతోన్న వైసీపీ అధినేత జ‌గ‌న్ రెడ్డి రాష్ట్ర‌వ్యాప్తంగా ల‌క్ష‌ల మంది గృహ‌సార‌థుల‌ను నియ‌మించారు. ప్రతి వలంటీరు పరిధిలో ఇద్దరు చొప్పున రెండున్నర లక్షల మంది గృహసారథులను, వీరి పనితీరు పర్యవేక్షించేలా ప్రతి గ్రామ/వార్డు సచివాలయం పరిధిలో ముగ్గురు పరిశీలకులను నియమించారు. వీరి నియామ‌కం 90 శాతానికి పైగా పూర్త‌య్యింద‌ని ఇటీవ‌లే సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించారు.

తెలుగుదేశం పార్టీ కూడా సేమ్ గృహ‌సార‌థులు మాదిరిగానే సాధికారిక సార‌థులు పేరుతో నియామకాలు చేప‌ట్టింది. ఇకపై పార్టీలో ఉన్న సెక్షన్ ఇంచార్జ్ లు అందరినీ కుటుంబ సాధికార సారథులుగా పిలుస్తామని లేటెస్ట్‌గా గోదావ‌రి జిల్లాల ప‌ర్య‌ట‌న‌లో చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. ప్రతి 30 కుటుంబాలకు ఒక సాధికార సారథి ఉంటార‌ని, ప్రతి నియోజకవర్గంలో కుటుంబ సాధికార సారథి విభాగం ఉంటుంద‌ని తెలిపారు.

ఎన్నిక‌ల సార‌థులు మోడ‌ల్ త‌మ‌ది కాపీ కొట్టేశార‌ని వైసీపీ నేత‌లు చంద్ర‌బాబుని ఎద్దేవా చేస్తున్నారు. దూర‌దృష్టితో తాను అన్నీ ముందే క‌నిపెడ‌తాన‌ని చెప్పుకునే విజ‌న‌రీ చంద్ర‌బాబు త‌మ గృహ‌సార‌థులు కాన్సెప్ట్‌ని కాపీ కొట్టార‌ని వారు విమ‌ర్శిస్తున్నారు.

First Published:  16 Feb 2023 9:19 AM GMT
Next Story