Telugu Global
Andhra Pradesh

ఇదంతా యనమల స్కెచ్చేనా?

యనమల సోదరుల మధ్య టికెట్ కోసం విభేదాలు వచ్చే అవకాశమే లేదని నియోజకవర్గంలో టాక్ మొదలైంది. అందుకనే జరుగుతున్నదంతా కేవలం డ్రామా మాత్రమే అని ప్రచారం పెరిగిపోతుంది.

ఇదంతా యనమల స్కెచ్చేనా?
X

తమ కుటుంబంలో నుండి టికెట్ మూడో వ్యక్తికి వెళ్ళకుండా మాజీ మంత్రి, సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పెద్ద స్కెచ్ వేశారా? ఇందులో భాగంగానే అన్నదమ్ముల మధ్య వివాదాలు రాజుకున్నట్లు నటిస్తున్నారా? అంటే టీడీపీ వర్గాలు అవుననే అంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో తునిలో పోటీ చేసే విషయంలో సోదరులు యనమల రామకృష్ణుడు - యనమల కృష్ణుడు మధ్య పెద్ద వివాదం మొదలైందనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఇద్దరి మధ్య గట్టిగానే సవాళ్ళు, ప్రతిసవాళ్ళు నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

అయితే పార్టీలో తాజా టాక్ ఏమిటంటే అదంతా యనమల ఆడిస్తున్న డ్రామా మాత్రమేనట. ఎందుకంటే రామకృష్ణుడు లేకపోతే కృష్ణుడు లేడు. అలాగే కృష్ణుడు లేకపోతే రామకృష్ణుడు లేడనేంత గాఢమైన అనుబంధముందట సోదరుల మధ్య దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నా రామకృష్ణుడి వ్యవహారాలన్నీ చూస్తున్నది కృష్ణుడే. ఇదే సమయంలో నియోజకవర్గంలోనే కాకుండా యావత్ జిల్లా మొత్తంమీద రామకృష్ణుడు పేరుతో కృష్ణుడే రాజకీయాలతో పాటు అధికారాన్ని చెలాయించారట.

ఇలాంటి సోదరుల మధ్య టికెట్ కోసం విభేదాలు వచ్చే అవకాశమే లేదని నియోజకవర్గంలో టాక్ మొదలైంది. అందుకనే జరుగుతున్నదంతా కేవలం డ్రామా మాత్రమే అని ప్రచారం పెరిగిపోతుంది. ఇంతకీ విషయం ఏమిటంటే తునిలో కొత్త అభ్యర్ధిని రంగంలోకి దింపటానికి చంద్రబాబునాయుడు, లోకేష్ ప్రయత్నాలు మొదలుపెట్టారట. యనమల కుటుంబానికి దీటైన నేతల కోసం వెతుకుతున్నారట. ఇందులో భాగంగానే యాదవ సామాజికవర్గానికి చెందిన యువ నేతలు కొందరిని పార్టీ గుర్తించినట్లు సమాచారం. అనూషా యాదవ్ అనే యువతి పేరు గట్టిగా వినబడుతోంది.

అలాగే ఆర్ధికంగా గట్టిస్ధితిలో ఉన్న బీజేపీలో యాక్టివ్‌గా ఉండే పారిశ్రామికవేత్త కూడా టికెట్ గ్యారెంటీ ఇస్తే టీడీపీలో చేరటానికి రెడీ అయ్యారట. దాంతో టికెట్ తమ కుటుంబాన్ని కాదని బయట వ్యక్తులకు వెళ్ళిపోతుందన్న భయంతోనే సోదరులిద్దరు డ్రామాలు మొదలుపెట్టారని ప్రచారం జరుగుతోంది. డ్రామాలో భాగంగానే టికెట్ కోసం కృష్ణుడు ఒక వైపు రామకృష్ణుడి కూతురు దివ్య మరో వైపు నిలిచారట. మరి చివరకు చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.

First Published:  22 Jan 2023 6:17 AM GMT
Next Story