Telugu Global
Andhra Pradesh

పవన్ కల్యాణ్‌కు నోటీసులు జారీ

భరణం చెల్లించి విడాకులు తీసుకోవాల్సిందిగా చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కోట్లు, లక్షలు, వేలు ఎవరి స్థాయిలో వారు భరణం ఇచ్చి భార్యలను వదిలించుకుంటూ పోతే ఇక మహిళలకు రక్షణ ఎక్కడ ఉంటుందని నిలదీశారు

పవన్ కల్యాణ్‌కు నోటీసులు జారీ
X

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు నోటీసులు జారీ అయ్యాయి. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలను ఏపీ మహిళా కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. నోటీసులు జారీ చేసింది. మహిళలను స్టెప్నీలతో పోల్చడం, కావాలంటే మీరు విడాకులు ఇచ్చి మరిన్ని వివాహాలు చేసుకోండి అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై నోటీసులు జారీ అయ్యాయి.

మహిళలను ఉద్దేశించి స్టెప్నీ అన్న పదం ఉపయోగించడం ఆక్షేపణీయమని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ అభిప్రాయపడ్డారు. చేతనైతే మూడు పెళ్లిళ్లు చేసుకోవాలన్న వ్యాఖ్యలను తక్షణం వెనక్కు తీసుకుని క్షమాపణ చెప్పాలని వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. మహిళలను స్టెప్నీ అనడం సరికాదని.. మహిళలను భోగ వస్తువుగా, అంగడి సరుకుగా భావించే వారే.. అటువంటి పదాలు వాడుతారంటూ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

భరణం చెల్లించి విడాకులు తీసుకోవాల్సిందిగా చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కోట్లు, లక్షలు, వేలు ఎవరి స్థాయిలో వారు భరణం ఇచ్చి భార్యలను వదిలించుకుంటూ పోతే ఇక మహిళలకు రక్షణ ఎక్కడ ఉంటుందని నిలదీశారు. పవన్‌ చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయన్నారు. సినిమా హీరోగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా పవన్ చేసిన వ్యాఖ్యలు సమాజంపై తప్పకుండా ప్రభావంచూపుతాయని.. కాబట్టి ఆ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ మహిళాలోకానికి సంజాయిషీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే మహిళా కమిషన్ చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.

First Published:  22 Oct 2022 7:11 AM GMT
Next Story