Telugu Global
Andhra Pradesh

పార్టీ ఏదైనా దుర్గ గుడిలో చొర‌బ‌డుతున్న కి``లేడీలు``

ప‌విత్ర పుణ్య‌క్షేత్రాలు అని భావించ‌కుండా, భ‌క్తుల మ‌నోభావాలు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా, నేర‌చ‌రిత్ర గ‌ల‌వారిని త‌మ రాజ‌కీయ అవ‌స‌రాల కోసం పాల‌క‌మండ‌లిలోకి తీసుకోవ‌డం పార్టీల‌కు అల‌వాటుగా మారిపోయింది.

పార్టీ ఏదైనా దుర్గ గుడిలో చొర‌బ‌డుతున్న కి``లేడీలు``
X

పార్టీ ఏదైనా ఇంద్ర‌కీలాద్రి గుడిని రాజ‌కీయాల‌కు దూరంగా ఉంచ‌లేక‌పోతున్నాయి. శ్రీ‌దుర్గామ‌ల్లేశ్వ‌ర‌స్వామి దేవ‌స్థానం అవినీతికి ఆల‌వాలం కాకుండా కాపాడ‌లేక‌పోతున్నాయి. అమ్మ‌వారిని అత్యంత భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో కొలిచే కోట్లాది మ‌హిళ‌ల మ‌నోభావాలు దెబ్బ‌తీసేలా రాజ‌కీయ పార్టీలు కి``లేడీలు``ను దుర్గ‌మ్మ పాల‌క మండ‌లి స‌భ్యులుగా నియ‌మిస్తున్నారు. ఆల‌యం ప‌రువుపోతోన్నా, దుర్గ‌గుడి ప‌విత్ర‌త మంట గ‌లిసిపోతున్నా.. హిందూ ధ‌ర్మానికి ప్ర‌మాదం త‌ల‌పెడుతున్న త‌మ రాజ‌కీయ అవ‌స‌రాల కోసం పార్టీలు ఆల‌యాల‌నే వేదిక‌గా చేసుకుంటున్నారు. త‌మ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ఇంద్ర‌కీలాద్రి దుర్గ‌మ్మ గుడిని కేంద్రంగా చేసుకుంటున్నారు.

Advertisement

తాజాగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన దుర్గ‌గుడి ఆల‌య పాల‌క‌మండ‌లి చైర్మ‌న్ కాల్ మ‌నీ కేసు నిందితుడు. పాల‌క‌మండ‌లి స‌భ్యురాళ్లపైనా కేసులు, ఆరోప‌ణ‌లున్నాయి. ట్ర‌స్ట్ బోర్డు మెంబ‌ర్ గా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన బచ్చు మాధవి పైన కేసులు ఉన్నాయి. 2021 అక్టోబరు 18వ తేదీన విజయవాడలోని టీడీపీ జాతీయ అధికార ప్ర‌తినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ఇంటిపై దాడిలోనూ, మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడిలోనూ బచ్చు మాధవిపై కేసులు న‌మోదు అయ్యాయి. ఈ కేసుల్లో బ‌చ్చుమాధ‌వి అరెస్ట‌యి బెయిల్ పై విడుద‌లైంది. మ‌రో కేసు ఎఫ్‌ఐఆర్‌లో బచ్చు మాధవి ప్రథమ నిందితురాలిగా ఉన్నారు. ఇటీవల కృష్ణలంక రాణిగారితోటలో తూర్పు వైసీపీ ఇన్‌చార్జి దేవినేని అవినాష్‌ను నిల‌దీసిన‌ ముస్లిం మహిళల‌పై దాడి కేసులోనూ మాధ‌వి నిందితురాలు. మ‌రో పాల‌క‌మండ‌లి స‌భ్యురాలు అసాంఘిక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతుంద‌నే ఆరోప‌ణ‌లున్నాయి.

Advertisement

వైసీపీ ప్ర‌భుత్వం వ‌చ్చాక నియ‌మించిన విజయవాడ దుర్గగుడి పాలకమండలి సభ్యురాలు నాగవరలక్ష్మి తెలంగాణ మద్యం రవాణా చేస్తూ పోలీసుల‌కు చిక్కింది. ఈ కేసులో అరెస్ట‌యిన ఆమె రాజీనామా చేసింది. టిడిపి ప్ర‌భుత్వ హ‌యాంలో ఏర్పాటైన పాల‌క‌మండ‌లిలో సభ్యురాలు అయిన‌ కోడెల సూర్యలత, అమ్మ‌వారికి భ‌క్తులు స‌మ‌ర్పించిన ఖ‌రీదైన చీర‌ని దొంగిలించింది. ఈ కేసులో ఎన్ని ఆరోప‌ణ‌లు వ‌చ్చినా రాజీనామా చేసేందుకు కోడెల సూర్య‌ల‌త ససేమిరా అంది. చివ‌రికి పాల‌క‌వ‌ర్గం నుంచి తొల‌గించారు.

ఉండవల్లికి చెందిన భక్త బృందం అమ్మవారికి సమర్పించిన చీర తీసుకెళ్లినట్లు విచారణలో తేలడంతో ఆమెపై వేటు వేశారు. రూ. 18 వేల విలువైన ఆషాడ‌ మాస సారెను కొందరు భక్తులు అమ్మవారికి బహూకరించగా.. ఆ చీరని పాలకమండలి సభ్యురాలు కోడెల సూర్యలత కుమారి మాయం చేశార‌ని ఆరోపిస్తూ భక్త బృందం లిఖితపూర్వకంగా పాలకమండలి చైర్మెన్ గౌరంగబాబుకు ఫిర్యాదు చేశారు. విషయం పెద్దది కావడం, మీడియాలో వార్తలు రావడంతో ఆలయ అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మరోవైపు సూర్యలత తానేమీ భక్తులు పెట్టిన చీరను తీసుకెళ్లలేదని, తనకు భక్తులు ఇచ్చిన కాటన్ చీరను మాత్రమే తీసుకెళ్లానని ఆమె వాదించినప్పటికీ, సీసీటీవీ కెమెరాలు అమ్మవారి ముందున్న చీర ఎలా మాయం అయిందో కళ్లకు కట్టినట్టు చూపింది. దీంతో ఆమెపై వేటు వేశారు.

ప‌విత్ర పుణ్య‌క్షేత్రాలు అని భావించ‌కుండా, భ‌క్తుల మ‌నోభావాలు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా, నేర‌చ‌రిత్ర గ‌ల‌వారిని త‌మ రాజ‌కీయ అవ‌స‌రాల కోసం పాల‌క‌మండ‌లిలోకి తీసుకోవ‌డం పార్టీల‌కు అల‌వాటుగా మారిపోయింది.

Next Story