Telugu Global
Andhra Pradesh

న‌డిరోడ్డుపై మ‌హిళ దారుణ‌హ‌త్య‌

ఈ ఘ‌ట‌న‌పై వెంట‌నే విచార‌ణ చేప‌ట్టిన పోలీసులు ఆయేషా సోద‌రుడు సులేమాన్‌ని, అత‌ని ఇద్ద‌రు స్నేహితులు అహ్మ‌ద్‌, ప్యారేజాన్‌ల‌ను అదుపులోకి తీసుకున్నారు.

న‌డిరోడ్డుపై మ‌హిళ దారుణ‌హ‌త్య‌
X

చెల్లెలి కాపురానికి అడ్డుగా ఉంద‌ని భావించి.. భ‌ర్త మొద‌టి భార్య‌ను దారుణంగా హ‌తమార్చిన ఘ‌ట‌న గురువారం సాయంత్రం అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన వివ‌రాలిలా ఉన్నాయి. మదనపల్లె పట్టణంలోని శివాజీనగర్‌కు చెందిన కదీర్ అహ్మద్ వేంపల్లె విద్యుత్తు ఉపకేంద్రంలో డ్యూటీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఆరు సంవ‌త్స‌రాల క్రితం అత‌నికి మదనపల్లెలోని బీకేపల్లెకు చెందిన రుక్సానా(32)తో వివాహమైంది. రుక్సానా మదనపల్లెలోని శ్రీజ్ఞానాంబిక జూనియర్ కళాశాలలో ఉద్యోగం చేస్తోంది.

పెళ్లయిన మూడేళ్ల త‌ర్వాత కూడా రుక్సానాకు పిల్ల‌లు పుట్ట‌క‌పోవ‌డంతో ఆమె అనుమ‌తితో క‌దీర్ అహ్మ‌ద్ ఆయేషాను రెండో పెళ్లి చేసుకున్నాడు. కొద్దికాలం వారి కాపురం స‌జావుగానే సాగింది. ఈలోగా 18 నెల‌ల కింద‌ట రుక్సానాకు ఆడ‌పిల్ల పుట్టింది. దీంతో అప్ప‌టినుంచి క‌దీర్ రుక్సానా వ‌ద్దే ఉంటున్నాడు. దీంతో ఆయేషా అత‌నితో గొడ‌వ ప‌డుతోంది.

రుక్సానా వల్లే తన భర్త తనకు దూర‌మ‌య్యాడ‌ని, మొదటి భార్య విషయం చెప్పకుండా తనను పెళ్లి చేసుకున్నాడని ఆయేషా త‌న కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి.. రుక్సానా ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకుంది. మొదటి భార్య ఉండగా తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని క‌దీర్ అహ్మ‌ద్‌తో పాటు రుక్సానా, వారి కుటుంబ సభ్యులపై ఆయేషా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కోర్టులో కేసు నడుస్తోంది.

రుక్సానాను అడ్డుతొల‌గిస్తే గానీ త‌మ చెల్లి కాపురం చ‌క్క‌బ‌డ‌ద‌ని భావించిన ఆయేషా సోద‌రులు, కుటుంబ‌స‌భ్యులు ఆమెను చంపాల‌ని నిర్ణ‌యించుకున్నారు. రెండు నెల‌లుగా ఆమె ప‌నిచేస్తున్న కాలేజీ వ‌ద్ద రెక్కీ నిర్వ‌హించారు. గురువారం సాయంత్రం రుక్సానా కాలేజీ నుంచి ద్విచ‌క్ర వాహ‌నంపై ఇంటికి వెళుతుండ‌గా ప్రశాంత నగర్ సమీపంలో అడ్డుప‌డ్డారు. ఆమె కంట్లో కారం చ‌ల్లి.. క‌త్తితో గొంతులో పొడిచి హ‌త‌మార్చారు.

హత్య విషయం తెలుసుకున్న ఎస్పీ గంగాధర్రావు మదనపల్లెకు చేరుకుని మృతురాలి బంధువులను విచారించారు. ఈ ఘ‌ట‌న‌పై వెంట‌నే విచార‌ణ చేప‌ట్టిన పోలీసులు ఆయేషా సోద‌రుడు సులేమాన్‌ని, అత‌ని ఇద్ద‌రు స్నేహితులు అహ్మ‌ద్‌, ప్యారేజాన్‌ల‌ను అదుపులోకి తీసుకున్నారు.

First Published:  4 Aug 2023 7:29 AM GMT
Next Story