Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు జీరోయేనా..?

ఐదుకోట్ల ప్రజల కోరికమేరకే తాను పై రెండుపార్టీల మధ్య పొత్తు కుదిర్చినట్లు చెప్పారు. ఏ ప్రజలు టీడీపీ, బీజేపీతో పొత్తుపెట్టుకోవాలని పవన్ను కోరారో అర్థంకావటంలేదు.

చంద్రబాబు జీరోయేనా..?
X

జనసేన అధినేత పవన్ కల్యాణ్ లేకపోతే చంద్రబాబు నాయుడు జీరోయేనా..? స్వయంగా పవన్ మాట్లాడిన మాటల్లో అందరికీ ఇదే అర్థం వినిపిస్తోంది. పిఠాపురం నేతలతో పవన్ మాట్లాడుతూ టీడీపీ-బీజేపీ పొత్తు తనవల్లే సాధ్యమైందన్నారు. తానులేకపోతే టీడీపీతో పొత్తుకు బీజేపీ అంగీకరించేదికాదన్నారు. టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు కుదిర్చేందుకు తాను ఎంతకష్టపడ్డానో నేతలకు వివరించారు. నాలుగుదశాబ్దాల చరిత్ర గ‌ల‌ టీడీపీకి తానే ధైర్యమిచ్చానని ప్రకటించారు. టీడీపీతో పొత్తుకు తాను బీజేపీలోని జాతీయస్థాయిలోని నేతలతో పదేపదే మాట్లాడినట్లు వివరించారు.

రెండుచేతులెత్తి, బతిమలాడి రాష్ట్రంలో పరిస్థితులను వివరించినట్లు చెప్పారు. టీడీపీ, బీజేపీని కలిపేందుకు తాను చీవాట్లు కూడా తినాల్సొచ్చిందన్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. తాను లేకపోతే టీడీపీ, చంద్రబాబు జీరోయేనని పవన్ సింపుల్ గా తేల్చేశారు. ఐదుకోట్ల ప్రజల కోరికమేరకే తాను పై రెండుపార్టీల మధ్య పొత్తు కుదిర్చినట్లు చెప్పారు. ఏ ప్రజలు టీడీపీ, బీజేపీతో పొత్తుపెట్టుకోవాలని పవన్ను కోరారో అర్థంకావటంలేదు. ఒకవైపు ఫార్టీఇయర్స్ ఇండస్ట్రీ, మరోవైపు బీజేపీలోని జాతీయనాయకులను సమన్వయం చేసుకుని పొత్తుకుదర్చగలిగిన పవన్ మరి సీట్ల విషయంలో ఎందుకు బోల్తాపడ్డారో అర్థంకావటంలేదు.

మొత్తంసీట్లలో మూడోవంతు సీట్లలో అంటే 58 నియోజకవర్గాల్లో పోటీచేయబోతున్నట్లు పదేపదే చెప్పిన పవన్ చివరకు 24 సీట్లకు అందులో కూడా మూడుసీట్లను వదులుకుని చివరకు 21 సీట్లకు పోటీ చేస్తున్నారో చెప్పలేదు. ఎంతసేపు తగ్గటం అంటే ఓడిపోవటం కాదనే సొల్లుమాటలే చెబుతున్నారు. ఎన్నిసీట్లు తీసుకున్నామని కాదు ఎన్ని గెలిచామన్నది ముఖ్యమనే సినిమా డైలాగులు వినిపిస్తున్నారు. తాను లక్ష ఓట్లమెజారిటితో గెలుస్తానని చాలెంజ్ చేసిన పవన్ పోటీచేసే విషయంలో మాత్రం అనుమానంగానే మాట్లాడారు.

బీజేపీ పెద్దలు గట్టిగా కోరితే తాను కాకినాడ పార్లమెంటులో పోటీచేయటానికి కూడా రెడీ అన్నారు. అంటే పిఠాపురంలో పోటీచేయటం చివరివరకు గ్యారెంటీలేదని పవనే చెప్పారు. ఇలాంటి పవన్ కు జనాలు ఓట్లేస్తారా..? పిఠాపురంలో ఉన్నదే 2.3 లక్షల ఓట్లయితే తనకు లక్ష ఓట్ల మెజారిటి వస్తుందంటే ఎవరైనా నమ్ముతారా..? పోటీచేయటమే గ్యారెంటీలేని పవన్ కు ఓట్లెందుకు వేస్తారు..? లక్ష ఓట్ల మెజారిటి ఎలా వస్తుందో పవనే చెప్పాలి.

First Published:  20 March 2024 5:39 AM GMT
Next Story